తెలంగాణ ప్రాజెక్టులకు జలకళ.!
Publish Date:Jul 30, 2026
Advertisement
తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల్లోనూ కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు జలకళతో కళకళలాడుతున్నాయి. దీంతో కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. జలాశయాలకు వరద నీరు పోటెత్తుతుండటంతో ఏడాదంతా సాగునీటికి కొదవ ఉండదని రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వరద తాకిడికి పలు గ్రామాలు ముంపునకు గురికావడం, రహదారులు జలమయమై రాకపోకలు స్తంభించడంతో సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని జలాశయాల్లో ఇన్-ఫ్లో పెరుగుతోంది. మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 46 వేల క్యూసెక్కుల ఇన్-ఫ్లో వస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ 12.88 టీఎంసీలకు చేరుకుంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు 96,445 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు వద్ద ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన అధికారులు 24 గేట్లను ఎత్తివేసి 96,472 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక పోతే.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వట్టి వాగు ప్రాజెక్టుకు కూడా వరద ఉధృతి పెరిగింది. ఈ ప్రాజెక్టుకు 8 వేల క్యూసెక్కుల ఇన్-ఫ్లో వస్తుండటంతో అధికారులు 3 గేట్లు ఎత్తివేసి 10 వేల 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. Water boost to Telangana projects, Telangana Heavy Rains, Godavari Flood Inflow, Sripada Yellampalli Project, aliperu Dam Gates Opened
http://www.teluguone.com/news/content/water-boost-to-telangana-projects-36-227536.html





