శశికళ జైలుకి... మరి ఆ రిసార్ట్ బిల్లు ఎవరికి?
Publish Date:Feb 14, 2017
Advertisement
మనకు తమిళ సినిమాలు కొత్త కాదు. బోలెడు డబ్బింగ్ అయ్యి ఇటు వస్తుంటాయి. ఏ మాత్రం బాగున్నామనం ఆదరిస్తూనే వుంటాం. శశికళ, పన్నీర్ ల మల్టీ స్టారర్ కూడా అలాంటి సక్సెస్ ఫుల్ తమిళ డబ్బింగ్ సినిమానే! కాకపోతే, ఈ సినిమాకి సుప్రీమ్ తీర్పు క్లైమాక్స్ అనుకున్నారు అంతా. కాని, శశి ఇంకా స్క్రీన్ ప్లే ఇంట్రస్టింగ్ గా నడిపిస్తోంది. తాను జైలుకి వెళ్లినా పళని స్వామీ రూపంలో తన మనిషినే పీఠం మీద కూర్చోబెట్టాలని ప్రయత్నిస్తోంది. ఎంత వరకూ సక్సెస్ అవుతుందో ఇప్పుడే చెప్పలేం. అలాగే పన్నీర్ కూడా ఊరికే ఏం వుండటం లేదు. తన లెక్కల్లో తాను మునిగిపోయాడు!
ఒకవైపు శశి, పన్నీర్ లు సీరియస్ గా పొలిటికల్ బ్యాటిల్లో తలపడుతుంటే సోషల్ మీడియాలో మాత్రం తెగ జోకులు షికారు చేస్తున్నాయి. అందులో, శశికళ శిక్ష ఖరారయ్యాక మొదలైన సెటైర్ '' ఇంతకీ ఇప్పుడు గోల్డెన్ బే రిసార్ట్ బిల్లు ఎవరు చెల్లిస్తారు? ''' అని!
గోల్డెన్ బే అనే ఒక రిసార్ట్ వుందనే నిన్న మొన్నటి వరకూ ఎవరికీ తెలియదు. మహాబలిపురం వెళ్లే దారిలో అది వుందన్న సంగతి చిన్నమ్మ పుణ్యమా అని ప్రపంచం మొత్తానికి ఫ్రీగా తెలిసిపోయింది! ఆ రిసార్ట్ ఓనర్ ఎవరోగాని లక్కీ ఫెలో అనే అనాలి! ఇంత పబ్లిసిటీ కావాలంటే కోట్లు ఖర్చు చేయాలి యాడ్ప్ కోసం. కాని, చిన్నమ్మ తన ఎమ్మెల్యేల్ని తీసుకుపోయి గోల్డెన్ బేలో బంధించటంతో మీడియా మొత్తం గోల్డెన్ బే అంటూ గోల గోల చేసేసింది! సోషల్ మీడియాలో కూడా తమిళ ఎమ్మెల్యేల కొట్టంలా మారిన ఈ గోల్డెన్ బే ఫుల్ హాట్ టాపిక్ అయిపోయింది!
ఫేస్బుక్, ట్విట్టర్లలో కొందరు నిన్న మొన్నటి దాకా ఓ జోక్ చేస్తూ వచ్చారు. తన వద్ద '' 130మంది ఎమ్మెల్యేలు వున్నారని... సీఎం అయ్యేందుకు గవర్నర్ తనని ఆహ్వానించాలనీ'' గోల్డెన్ బే ఓనర్ డిమాండ్ చేశాడంటూ వాళ్లు సెటైర్ వేశారు! ఇక సుప్రీమ్ కోర్టు తీర్పు తరువాత శశికళ జైలుకి వెళ్లనుండటంతో ... ఇప్పుడు... ''గోల్డెన్ బే రిసార్ట్ ఓనర్ కి బిల్లు ఎవరు కడతారంటూ'' కామెంట్ చేస్తున్నారు! ఇన్ ఫ్యాక్ట్ బిల్లు ఎవరు చెల్లిస్తారో మనకు తెలియదు కాని... రిసార్ట్ లో చిన్నమ్మ తన ఎమ్మెల్యేలకు సకల సౌకర్యాలు కల్పించారు! బీరు, బిర్యానీతో పాటూ చిందులేసేందుకు మ్యూజిక్ కూడా పెట్టించారు! సో... బాగానే చమురు వదిలి వుంటుంది!
కొసమెరుపు ఏంటంటే... సోషల్ మీడియాలో... చాలా మంది మరో బాంబు పేల్చుతున్నారు! అసలు గోల్డెన్ బే రిసార్ట్ ఎవరిది? చిన్నమ్మ శశికళదే అంటున్నారు! అదే నిజమైతే బిల్లు బాధ లేదు...
http://www.teluguone.com/news/content/vk-sasikala-45-72152.html





