విజయశాంతి.. బీజేపీలో అశాంతి
Publish Date:Jul 28, 2023
Advertisement
విజయశాంతి పరిచయం అక్కర్లేని పేరు. సినీ పరిశ్రమలో లేడీ అమితాబ్ గా గుర్తింపు పొందిన నటి. హీరోలకే ప్రాధాన్యముండే ఆ రంగంలో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. అప్పట్లో అగ్రహీరోలతో సమానంగా రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటి. అనంతరం ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రాజకీయాలలో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ రాజకీయాలలో ఆమె ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. కేసీఆర్ విజయశాంతిని తనకు దేవుడిచ్చిన చెల్లిగా పేర్కొన్నారు. అయితే చెల్లి అన్నంత మాత్రాన ఆమె విధానాలతో రాజీపడి ఆగిపోలేదు. కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగురవేశారు. కేసీఆర్ తో విభేదించిన తరువాత తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయమంటూ కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ పార్టీలో కూడా తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ విషయంలో పెద్దగా పోరాడలేమని భావించిన ఆమె బీజేపీలో చేరారు. అక్కడా ఆమెకు సరైన గుర్తింపు దక్కలేదు.. కేవలం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఓ పదవి కట్టబెట్టి పక్కన పెట్టేశారు. అయితే విజయశాంతి రాజీపడి సర్దుకు పోయే రకం కాదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి హాజరై అక్కడ తెలంగాణ ఉద్యమ సమయంలో కరుడుగట్టిన సమైక్యవాది అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వేదికపై ఉండటాన్ని సహించలేక మధ్యలోనే వెళ్లిపోయారు. ఆ విషయాన్ని ఆమె దాపరికం లేకుండా మీడియా ముందు కుండ బద్దలు కొట్టారు. అసలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీలో చోటు ఇవ్వడమే కరెక్ట్ కాదని చెప్పారు. ఒక వేళ పార్టీలో చేర్చుకున్నా ఆయనను ఆంధ్రా వ్యవహారాలకు పరిమితం చేయాలని విశయశాంతి ఎలాంటి మొహమాటాలకూ తావు లేకుండా చెప్పేశారు. తెలంగాణ ఆవిర్భావాన్ని గట్టిగా వ్యతిరేకించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని.. తెలంగాణ పార్టీ ఆఫీసులో జరిగిన సభకు ఆహ్వానించడమేమిటని నిరసన గళం వినిపించారు. ఆయన ఉన్న వేదికపై ఉండటం ఇష్టంలేకే ఆ కార్యక్రమం నుంచి మధ్యలోనే వెళ్లిపోయాను అంటూ ఆమె చేసిన ట్వీట్ బీజేపీకి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లుగా మారిందనడంలో సందేహం లేదు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మనే కాదు.. అందుకు సహకరించిన ఈ చిన్నమ్మను కూడా గుర్తు పెట్టుకోండంటూ నాడు.. అంటే తెలంగాణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిన రోజు సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలను విజయశాంతి ట్వీట్ తెలంగాణ వాదులందరికీ గుర్తు చేసింది. తెలంగాణ కోసం బీజేపీ అన్ని విధాలుగా అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ కు సహకరించిందని ఆ పార్టీ ఇప్పటికీ చెప్పుకుంటుంటుంది. మరి అటువంటి పార్టీ తెలంగాణను వ్యతిరేకించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఎలా అక్కున చేర్చుకుంటోందని తెలంగాణ వాసులు బీజేపీని నిలదీస్తున్నారు. విజయశాంతి తన ట్వీట్ ద్వారా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించినట్లేననీ, ఆయనకు తన నిరసనగళాన్ని గట్టిగా వినిపించినట్లేనని పరిశీలకులు అంటున్నారు. ఇక ఆ తరువాత మణిపూర్ లో మహిళలపై జరుగుతున్న దారుణాలను గట్టిగా ప్రశ్నించారు. తద్వారా కేంద్రంలోని మోడీ సర్కార్ నిష్క్రియాపరత్వాన్ని నిలదీశారని పరిశీలకులు అంటున్నారు. ఈశాన్య రాష్ట్రాల ఇన్ చార్జ్ మంత్రిగా ఉన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మణిపూర్ విషయాలు తనను ఎందుకు అడుగుతారంటూ మీడియా ఎదుట అసహనం వ్యక్తం చేసిన సమయంలోనే విజయశాంతి ధైర్యంగా మణిపూర్ ఘటనలపై కేంద్రం వైఖరిని తప్పుపడుతూ ట్వీట్ చేశారు. మొత్తంగా విజయశాంతి కమలం పార్టీకి దూరం అవుతున్నారన్న సంకేతాలైతే బలంగా వస్తున్నప్పటికీ ఆ విషయంలో విజయశాంతి నుంచి అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు. తన అసంతృప్తిని దాచుకోకుండా బాహాటంగానే వెలిబుచ్చుతున్న విజయశాంతిపై చర్య తీసుకునే ధైర్యం బీజేపీ చేయలేకపోవడానికి కారణం ఆమె వ్యక్తిత్వమేనని అంటున్నారు పరిశీలకులు. విజయశాంతి తన అసంతృప్తిని బాహాటంగా వెలిబుచ్చుతున్నారు. అదే సమయంలో ఆమెలాగే రాష్ట్ర పార్టీలో అసంతృప్తితో ఉన్న అనేక మంది సమయం కోసం ఎదురు చూస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా బీజేపీ రాష్ట్ర శాఖలో పరిస్థితి బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/vijayashanti-disidense-in-bjp-25-159154.html





