జమిలి ఎన్నికలు..మోడీ సర్కార్ కు తత్వం బోధపడిందా?
Publish Date:Jul 28, 2023
Advertisement
గంపగుత్తగా కేంద్రంతో పాటు రాష్ట్రాలలోనూ అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే జమిలి ఎన్నికలు మాత్రమే శరణ్యం అనుకున్న మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జమిలి గురించే మాట్లాడుతూ వస్తోంది. ఒక దశలో 2024 సార్వత్రిక ఎన్నికలను ఒకింత ముందుకు జరిపి.. వాటితో పాటు జరగాల్సిన అసెంబ్లీలకు కూడా ముందస్తుగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా మినీ సార్వత్రికానికి తెరతీయాలని మోడీ యోచించినట్లుగా వార్తలు గట్టిగా వినిపించాయి. అసలు జమిలి ఎన్నికల వల్ల చాలా ఉపయోగాలున్నాయని, జమిలి ఎన్నికల వల్ల సమయం, శ్రమ, వ్యయం వంటివి బాగా కలిసి వస్తాయనీ, అయినా దేశంలో ఏడాది పొడవునా ఎక్కడో ఓ చోట ఎన్నికలు జరుగుతూనే ఉండే పరిస్థితి వల్ల ప్రగతి కుంటుపడుతుందనీ ఒకటేమిటి జమిలికి మద్దతుగా కేంద్రంలోని మోడీ సర్కార్, బీజేపీ అగ్రనేతలో బోలెడు కారణాలు చెప్పారు. అయితే జమిలి ఎన్నికల నిర్వహణ కష్టమని నిపుణులు చెబుతూనే వచ్చారు. జమిలి ఎన్నికలు అన్నది ఒక నినాదంగా చెప్పుకోవడానికి ఉపయోగపడుతుందే తప్ప ఆచరణలో అసాధ్యమని నిపుణులు ఎంతగా చెప్పినా మోడీ పట్టించుకోలేదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ ఆకర్షణీయమైన స్లోగన్ ఇస్తూ.. అందుకు అనుగుణంగా ప్రజా మద్దతును కూడగట్టేందుకు చేయగలిగిన ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. జమిలి సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి కమిటీలు వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ విషయంలో రాజకీయ పార్టీలతో ఒకటికి రెండు సార్లు సమావేశమైంది. దీంతో దేశంలో జమిలి ఎన్నికల దిశగా పెద్ద ఎత్తున కసరత్తు కూడా జరుగుతోందన్న బిల్డప్ ను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇంత హడావుడి చేసిన తరువాత... జమిలి ఎన్నికల నిర్వహణ అసాధ్యమని కేంద్రం గ్రహించింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్ వాల్ ప్రకటించారు. జమిలి ఎన్నికల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఆచరణ సాధ్యం కాదని కేంద్రం గ్రహించిందని ఆయన సెలవిచ్చారు. ఆ విషయం గ్రహించడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి రమారమి ఐదేళ్లు పట్టింది. కానీ నిపుణులు మాత్రం మోడీ జమిలి ఎన్నికల ప్రస్తావన చేసిన తొలి రోజునే పలు ప్రశ్నలు సంధించారు. దేశంలో రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంటుకూ ఒకే సారి ఎన్నికలు నిర్వహిచడం వరకూ ఓకే.. సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో పార్లమెంటులో మెజారిటీ కోల్పోయి మధ్యంతర ఎన్నికలు వెళ్లాల్సి వస్తే.. అప్పుడు అసెంబ్లీలను కూడా రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా? అలాగే ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో అసెంబ్లీ రద్దయి మధ్యంతర ఎన్నికల్లో లేకపోతే ముందస్తు ఎన్నికలో నిర్వహించాల్సొస్తే అప్పుడు ఏం చేస్తారు? అసెంబ్లీ గడువు పూర్తయ్యే వరకూ ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారా? అంటూ నిపుణులు పలు ప్రశ్నలు సంధించారు. వాస్తవానికి మోడీ చెప్పాల్సిన అవసరం లేకుండానే దేశంలో 1962 వరకు జమిలి ఎన్నికలే జరిగాయి. అయితే తర్వాత మారిన రాజకీయాల కారణంగా ఆ పరిస్థితి మారింది. ప్రధాని మోడీ దేశ రాజకీయ చరిత్రపై అవగాహన లేకుండా జమిలి నినాదంతో అనవసర ఆర్భాటం చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/modi-sarkar-at-last-realised-reality-25-159149.html





