ఇండియా కూటమి: పొత్తులూ, పొరపొచ్చాలు.. యూపీలో కాంగ్రెస్ ఎస్పీ సర్దుపాట్లు.!
Publish Date:Nov 26, 2026
Advertisement
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం పీటముడి పడినట్లు కనిపిస్తోంది. 2027 ఫిబ్రవరి, మార్చి మధ్య జరగనున్న యూపీ అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య ఇప్పటికే రెండు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ సీట్ల సర్దుబాటు విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇరు పార్టీల మధ్య సీట్ల సంఖ్యపై పీటముడి కొనసాగుతోంది. అయితే ఈ లోగానే సమాజ్వాదీ పార్టీ ఏకపక్షంగా ఐదు స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో ఇరు పక్షాల మధ్యా పొరపొచ్చాలు బహిర్గతమయ్యాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 403 నియోజకవర్గాలకు గాను కనీసం నూట పాతిక స్థానాలలో పోటీ చేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించిందన్న కారణాన్ని చూపుతూ.. ఆ రెండు స్థానాలకు అదనంగా మరో 24 సీట్లు కలిపి మొత్తం 26 స్థానాలను మాత్రమే కేటాయిస్తామని ఎస్పీ అంటోంది. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ పూర్తిగా తిరస్కరిస్తుండగా, తాము ప్రతిపాదించిన సంఖ్య కంటే పెద్దగా వెనక్కి తగ్గేందుకు ఎస్పీ అంగీకరించడంలేదు. మొత్తంగా ఇరువురూ పట్టువిడుపులు ప్రదర్శించకపోవడంతో రెండు దఫాలు చర్చలు జరిగినా ఫలితం లేకుండా పోయింది. ఇదే సమయంలో ఎస్పీ విడుదల చేసిన తొలి జాబితాలో ప్రకటించిన ఐదు నియోజకవర్గాల అంశం ఇరు పార్టీల మధ్యా అగాధాన్ని మరింత పెంచింది. ఎస్పీ ప్రకటించిన ఐదు స్థానాలలో కాంగ్రెస్ ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలోని ఒక అసెంబ్లీ స్థానం కూడా ఉండటంతో పీటముడి మరింత బిగిసింది. ఓ వైపు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుండగానే ఎస్పీ ఏకపక్షంగా ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో కాంగ్రెస్ స్పందన ఎలా ఉంటుందన్న దానిపై రాజకీయవర్గాలలో ఆసక్తి వ్యక్తమౌతోంది. ఈ పరిణామాలపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ అత్యంత ఘాటుగా స్పందించారు. సమాజ్వాదీ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సరికాదని విమర్శించారు. సీట్ల కోసం తాము దేబిరించడం లేదనీ, సీట్లు అడుక్కోవడానికి తాము బిచ్చగాళ్లం కాదనీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు పొత్తు చర్చలు నడుపుతూనే, మరోవైపు అభ్యర్థుల జాబితాలను విడుదల చేయడం చూస్తుంటే సీట్ల సర్దుబాటుపై ఎస్పీకి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ఇక సీట్ల సర్దుబాటుపై తదుపరి చర్చలకు హాజరుకావాలా లేదా అనే విషయం పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసీసీ ఇన్ఛార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్ కూడా ఎస్పీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు పార్టీల మధ్య జరుగుతున్న సీట్ల చర్చలు పూర్తయ్యే వరకు సమాజ్వాదీ పార్టీ వేచి ఉండాల్సిందన్నారు. గత ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేసినప్పుడు ఎస్పీ 311 స్థానాల్లో, కాంగ్రెస్ 114 స్థానాల్లో బరిలోకి దిగాయి. ఆ ఎన్నికల్లో ఎస్పీ 47, కాంగ్రెస్ కేవలం 7 స్థానాల్లోనే గెలిచి అధికారానికి దూరమయ్యాయి. దీంతో కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు ఇవ్వడం వల్లే నష్టపోయామని భావించిన ఎస్పీ, 2022లో ఒంటరిగా పోటీ చేసి 111 స్థానాలు గెలుచుకోగా, విడిగా పోటీ చేసిన కాంగ్రెస్ 2 స్థానాలకే పరిమితమైంది. ఇది కూడా చదవండి: గాంధీ కుటుంబం: ఐదు తరాల వరకు ప్రధాని కాలేరు..ఎస్పీ నేత సెటైర్లు.! స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1989 వరకు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ కాలంలో కాంగ్రెస్కు చెందిన 11 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. అలాంటి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ, నేడు ప్రాంతీయ పార్టీ అయిన ఎస్పీ కేటాయించే పరిమిత స్థానాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడటంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇరు పార్టీల మధ్య సమన్వయం లోపించి ఓట్లు చీలిపోతే, భారతీయ జనతా పార్టీకే అనుకూలంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరు పార్టీల అగ్ర నాయకత్వం జోక్యం చేసుకుని చర్చలను మళ్లీ పట్టాలెక్కిస్తుందా లేదా అనే అంశంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఢిల్లీ స్థాయిలో జరిగే సంప్రదింపుల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తీసుకోబోయే నిర్ణయం కీలకం కానుంది. గౌరవప్రదమైన సంఖ్యలో స్థానాలు దక్కకపోతే ఒంటరిగా బరిలోకి దిగాలన్న ఒత్తిడి రాష్ట్ర కాంగ్రెస్ నేతల నుంచి పెరుగుతుండగా, విపక్ష ఓట్లు చీలకుండా పొత్తును నిలబెట్టుకోవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. 2027 ఎన్నికల సమరానికి ముందు ఈ సీట్ల పంచాయితీ ఎలాంటి మలుపు తిరుగుతుందోనని ఉత్తరప్రదేశ్ రాజకీయ వర్గాలు, ఓటర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. మీకు నచ్చవచ్చు: కాంగ్రెస్, ఎస్పీ పార్టీల పొత్తు... షీలా దీక్షిత్ ఔట్.. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై లేటెస్ట్ సర్వే.. యూపీలో సంచలనమేనా?
[UP Assembly Elections, SP Congress, Alliance, Seatsharing, Uttar Pradesh politics, Rift, TeluguOne]
http://www.teluguone.com/news/content/up-assembly-elections-45-237980.html





