తెలంగాణలో పాల్ కు స్థాయికి మించిన ప్రాధాన్యం.. కేసీఆర్ స్కెచ్చేనా?
Publish Date:May 4, 2022
Advertisement
గత రెండు రోజులుగా కేఏ పాల్ తెలంగాణలో చేస్తున్న హల్ చల్ కు మీడియాలో ఎనలేని ప్రాధాన్యం కనిపిస్తున్నది. దీని వెనుక కేసీఆర్ స్కెచ్ ఉన్నదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అసలు కేఏ పాల్ కు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆయన ఏం మాట్లాడినా సీరియస్ గా తీసుకునే వారెవరూ లేరు. గత ఎన్నికల ముందు కూడా ఆయన చేసిన హడావుడి సీరియస్ నెస్ లేని రాజకీయ కామెడీగానే మిగిలిపోయింది. అయితే గత రెండు రోజులుగా మాత్రం పాల్ చుట్టూ మీడియా తిరగడం.. ప్రాధాన్యత ఇవ్వడం అనుమానాలకు తావిస్తున్నది. ఆయనపై దాడి జరగడమేమిటి? ఆ దాడిపై డీజీపీకి ఫిర్యాదు చేయడానికి బయలు దేరిన ఆయనను హౌస్ అరెస్టు చేయడమేమిటి అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. \ఈ సంఘటనలకు కొద్ది రోజుల ముందు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అసందర్భంగా కేఏ పాల్ ప్రస్తావన తీసుకువచ్చారు. ఒకింత వ్యంగ్యంగా మాట్లాడుతున్నట్లుగా రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం కేఏ పాల్ అని చెప్పుకొచ్చారు. అప్పట్లో కేటీఆర్ మాటలను అంతా జోక్ గానే తీసుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లను పలుచన చేసే ఉద్దేశంతో చెప్పిన మాటలుగా పరిగణించారు. కానీ ఈ రోజు రాష్ట్రంలో కేఏపాల్ కు ఆయన హడావుడికి తెరాస ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే...మొత్తం కేసీఆర్ స్కెచ్ ప్రకారమే జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు బలం తగ్గిందని ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ కేసీఆర్ కు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఓటమి గండం నుంచి బయటపడడానికి కేసీఆర్ వేసిన స్కెచ్ లో బాగంగానే కేఏ పాల్ ఎంట్రీ అంటున్నారు. వచ్చే ఎన్నికలలో రాష్ర్టంలో త్రిముఖ పోరు అనివార్యమన్న పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అంతే కాకుండా బీజేపీ, కాంగ్రెస్ పుంజుకుంటున్నాయి. వాటిని నిలువరించకుంటే మూడో సారి అధికారంలోకి రావాలన్న కేసీఆర్ కల సాకారం అవ్వడం కష్టసాధ్యమని పీకే నివేదిక స్పష్టం చేసింది. దీంతో కేసీఆర్ కేఏపాల్ ను రంగంలోనికి దింపారని చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరంగల్ లో రాహుల్ గాంధీతో రైతు సంఘర్షణ సభ సన్నాహాలలో కాంగ్రెస్ రాష్ట్రంలో పట్టు సాధించేందుకు బలోపేతమయ్యేందుకు సన్నాహాలలో నిమగ్నమయ్యాయి. ఏలాగైనా అధికారం నిలుపుకోవాలనే లక్ష్యంతో కేసీఆర్ కేఏ పాల్ తమకు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అని కేటీఆర్ తో చెప్పించి ఆయన ఎంట్రీకి తలుపులు తెరిచారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి కేసీఆర్, కేటీఆర్ లు ప్రస్తావించేంత స్థాయి కేఏ పాల్ కు గానీ, ఆయన పార్టీకి కానీ లేదు. కేఏ పాల్ పై దాడి, హౌస్ అరెస్టు వంటి ఘటనల ద్వారా ఆయనకు లేని ప్రాధాన్యాన్నికల్పించి రాష్ట్రంలో రాజకీయ కన్ఫ్యూజన్ తీసుకువచ్చి లబ్ధి పొందాలన్నదే కేసీఆర్ స్కెచ్ లా కనిపిస్తున్నదని పరిశీలకులు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/un-necessary-importance-to-ka-paul-kcr-scketch-39-135424.html





