హోం మంత్రా..? హోం మేకరా..? ఓనమాలు తెలియని హోంమంత్రి వనిత
Publish Date:May 4, 2022
Advertisement
‘కోతికి కొబ్బరికాయ ఇస్తే.. నెత్తిపై కొట్టుకుందట’ ఇది పాత నానుడి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి తానేటి వనిత తీరు అందుకు భిన్నంగా లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో మహిళలపై రోజురోజుకూ లైంగికదాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో హోంమంత్రిగా తాను నిర్వర్తించాల్సిన పని సక్రమంగా చేయడం లేదు సరికదా.. ఏదో ఇంట్లో కూర్చుని యధాలాపంగా మాట్లాడేసినట్లు ఆమె మాట్లాడుతుండడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఓనమాలు తెలియని వ్యక్తికి హోం శాఖ ఇస్తే ఇలాగే ఉంటుందని ప్రత్యర్థి పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మహిళలపై లైంగికదాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో హోంమంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన తానేటి వనిత చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లోను, రాష్ట్ర ప్రజల్లోను, సోషల్ మీడియాలోనూ విమర్శల జడివాన కురుస్తోంది. విశాఖపట్నంలోని దిశ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సందర్భంగా హోంమంత్రి వనిత చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేశాయి. ఆపైన అందరికీ ఆగ్రహం తెప్పించాయి. ‘బిడ్డల సంరక్షణ బాధ్యత తల్లిదే. తల్లి పాత్ర సరిగా లేనప్పుడే అత్యాచారాలు లాంటివి జరుగుతుంటాయని ఆమె యధాలాపంగా.. ఇంట్లో మాట్లాడుకున్నట్లు అనేయడం అందరికీ ఆశ్చర్యం కలిగింది. పైగా తండ్రి పనిమీద బయటకు వెళ్లినప్పుడు బిడ్డల సంరక్షణ బాధ్యత తల్లి చూసుకుంటుందని, ఆమె కూడా ఉద్యోగం కోసమో, ఏదైనా పని కోసమో బయటకు వెళ్లినప్పుడు పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడే అఘాయిత్యాలు జరుగుతున్నాయని వనిత వ్యాఖ్యానించారు. ఒక పక్కన ఏపీలో తరచూ మహిళలపై దాడుల సంఘటనలు వెలుగు చూస్తున్న వేళ ఆ తప్పంతా టీడీపీదే అనే ధోరణిలో హోంమంత్రి వనిత మాట్లాడడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. హత్యలు, అత్యాచార ఘటనల నిందితుల్లో టీడీపీ వారే ఎక్కువ ఉంటున్నారని ఆమె ఆరోపించడం గమనార్హం. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా సరైన దిశలో చర్యలు తీసుకోవడం హోం మంత్రిగా తానేటి వనిత బాధ్యత. అయితే.. ఏదో యధాలాపంగా టీడీపీ వాళ్లే నిందితులంటూ ఓ పనికిమాలిన వ్యాఖ్య చేసేసి చేతులు దులుపుకోవడం ఏంటనే ప్రశ్న వేస్తున్నారు. చేతిలో పోలీస్ పవర్ ఉంది.. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తన మీదే ఉంది. అయినా.. ఆ దిశగా ఆమె తీసుకుంటున్న చర్యలేమిటో ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు. టీడీపీ నేతల ప్రమేయంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ రేపల్లె రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన బాధితురాలిని పరామర్శించిన సందర్భంగా హోంమంత్రి వనిత ఈ స్టేట్ మెంట్ ఇవ్వడం ఆమే చేతకానితనానికి నిదర్శనం అంటున్నారు. తాజాగా హోంమంత్రి తానేటి వనిత గుంటూరులో చేసిన వ్యాఖ్యలు కూడా దుమారాన్నే లేపుతున్నాయి. రేపల్లె ఘటనపై స్పందిస్తూ.. ‘దుండగులు ఆమెపై అత్యాచారం చేసే ఉద్దేశంతో రాలేదు. మద్యం మత్తులో ఉన్న దుండగులు డబ్బుల కోసం బాధితురాలి భర్తపై దాడి చేశారు. ఆ సమయంలో భర్తను రక్షించుకోడానికి బాధితురాలు వెళ్లింది. ఆ సందర్భంగా నిందితులు ఆమెను నెట్టేసే క్రమంలోనే ఆమె అత్యాచారానికి గురైంది’ అనడం హోంమంత్రి తన అసహాయతను బయటపెట్టుకున్నారంటున్నారు. ‘పేదరికం వల్లో, మానసిక పరిస్థితుల వల్లో అప్పటికప్పుడు అనుకోని రీతిలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఆమెపై జరిగిన లైంగిక దాడికి.. పోలీసు సిబ్బంది కొరతకు సంబంధమే లేదు’ అనడం హోంమంత్రి స్థాయికి తగదని పలువులు ఫైరవుతున్నారు. గతంలో అధ్యాపకురాలిగా పనిచేసిన వనితమ్మ నాలుక ఇలాగేనా మాట్లాడేది..? ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలా చేసేది..? పబ్లిక్ లో మాట్లాడుతున్నామన్న ఇంగితజ్ఞానం ఆమెకు ఉండక్కర్లా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేసేది తక్కువ.. ప్రయోజనం లేని మాటలు ఎక్కువ చందంగా హోంమంత్రి వనిత తీరు ఉందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/taneti-vanitha-home-minister-or-mer-maker-39-135427.html





