జార్ఖండ్ సీఎంకు ఈసీ నోటీసులు.. కేసీఆర్ తో చెలిమే కొంప ముంచిందా?
Publish Date:May 4, 2022
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో జార్ఖండ్ సీఎం సత్సంబంధాలే ఆయనకు ఈసీ నోటీసులు జారీ చేయడానికి కారణమైందని విశ్లేషణలు చేస్తున్నారు. అందుకేప్రజా ప్రాతినిథ్య చట్టం ఉల్లంఘన అంటూ ఆరోపణలు, ఫిర్యాదుల పర్వానికి తెరతీసి సరెండర్ చేసేసిన మైలింగ్ లీజు సాకు చూపుతూ ఈసీ నోటీసులు జారీ చేసిందని చెబుతున్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేయడానికి కేంద్రం ఒత్తిడే కారణమంటున్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ ఎన్నికల సంఘం సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈసీ నోటీసులు జారీ చేసిన సమయంలో ఆయన తన తల్లి చికిత్స నిమిత్తం హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. హేమంత్ సొరేన్ తల్లి శస్త్ర చికిత్సకు నగరంలోని ప్రముఖ వైద్యుడు జీ. నాగేశ్వరరెడ్డితో మాట్లాడి అన్ని ఏర్పాట్లూ చేసింది తెలంగాణ సీఎం కేసీఆర్. వీరిరువురి మధ్యా స్నేహం, రాజకీయంగా సారూప్య సిద్ధాంతాలు ఉన్న సంగతి విదితమే. బీజేపీకి అదే కన్నెర్ర అయ్యిందంటున్నారు. సీఎం అందుబాటులో లేకపోవడంతో ఈ సీ ఆ నోటీసును జార్ఖండ్ సీఎంవోకు అందజేసింది. తనకు అనకూలంగా మైనింగ్ లీజు మంజూరు చేసుకున్నారనీ, ప్రజా ప్రాతినిథ్య చట్టం 9ఏ ప్రకారం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిచారనీ ఆ నోటీసులో పేర్కొంది. అంతకు ముందే బీజపీ జార్ఖండ్ శాసనసబాపక్ష నాయకుడు బాబూలాల్ మురాండి నేతృత్వంలోని బీజేపీ ప్రతినిథి బృందం రాష్ట్ర గవర్నర్ ను కలిసి హేమంత్ సొరేన్పై ‘ఆఫీస్ ఆఫ్ ఫ్రాఫిట్’ ఆరోపణలు చేసింది. ఇప్పుడు అదే ఆరోపణలపై ఈసీ హేమంత్ సోరేన్ కు నోటీసుల ఇచ్చింది. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి తనకు అనుకూలంగా మైనింగ్ లీజు మంజూరు చేసుకున్నందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరించాలని ఆ నోటీసులో పేర్కొంది. 2019 ఎన్నికలలో బీజేపీ జార్ఖండ్ లో పరాజయం పాలైంది. రాష్ట్రంలో గిరిజనుల విశ్వాసం పొందడంలో బీజేపీ విఫలం కావడంతో అధికారానికి దూరమైంది. వారి మద్దతు పొందిన జార్ఖండ్ సీఎంను ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ చెలిమి సాకుతో బ్బందుల్లోకి నెట్టేలా ప్రజాప్రాతినిథ్య చట్టాన్ని ఆశ్రయించి గవర్నర్ కు ఫిర్యాదు చేసి ఈసీ నోటీసు జారీ చేసేలా ప్రయత్నించి సఫలీకృతం అయ్యింది. జార్ఖండ్ లో ఓటమే కాకుండా.. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన కేసీఆర్ కు సన్నిహతమౌతుండటం కూడా బీజేపీ కన్నెర్రకు ఓ కారణమైంది. జాతీయ స్థాయిలో బీజేపీని వ్యతిరేకిస్తూ.. కేంద్రంపై విమర్శల జోరు పెంచిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు హేమంత్ సొరేన్ మద్దతు పలుకుతుండటంతో రాష్ట్రంలో ఆయనకు ఇబ్బందులు సృష్టించే దిశగా వేసిన అడుగే ఈసీ నోటీసు అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాప్రాతినిథ్య చట్టం ఉల్లంఘించిన హేమంత్ సొరేన్ రాజీనామాకు బీజేపీ డిమాండ్ చేస్తున్నది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో అధికార పార్టీలోని ప్రముఖ నాయకులపై ఈడీ, సీబీఐ దాడులు జరిగిన సంగతి విదితమే. విపక్షాలను ఇబ్బందుల పాలు చేసి, వాటి ప్రతిష్టను పలుచన చేసి ఎన్నికలలో లబ్ధి పొందడమే లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ పని చేస్తున్నదని అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అదే దారిలో ఇప్పుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ను చిక్కుల్లో పడేయడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహంలో భాగమే ఈసీ నోటీసులు అని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే మైనింగ్ లీజు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పొరపాటు చేసిందని జార్ఖండ్ అడ్వొకేట్ జనరల్ అంగీకరించడమే కాకుండా ఆ లీజ్ ను సరండర్ చేశారని కూడా జార్ఖండ్ హై కోర్టుకు గత ఏప్రిల్ 18నే నివేదించారు. అంతా అయిపోయిన తరువాత తీరిగ్గా ఎన్నికల సంఘం ఇప్పుడు జార్ఖండ్ సీఎంకు నోటీసు జారీ చేయడం వెనుక కేంద్రం వేధింపుల వ్యూహమే ఉందని వారు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ec-notice-to-jarkhand-cm-is-reason-friendship-with-kcr-39-135419.html





