ఏపీ ఈడీబీతో యూఏఈ అవగాహనా ఒప్పందం..!
Publish Date:Jul 21, 2026
Advertisement
ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది. యూఏఈ ఫుడ్ క్లస్టర్ ద్వారా ఏపీలోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎగుమతులు, వాణిజ్యం, పెట్టుబడులను పెట్టేలా ఏపీ ఈడీబీ-యూఏఈకి చెందిన ఫుడ్ క్లస్టర్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈమేరకు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, యూఏఈ ఆర్ధిక, పర్యాటక విభాగం మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యాన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు, విదేశీ వాణిజ్యం సహా యూఏఈకి చెందిన సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ఈ ఒప్పందం కుదిరింది. ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుపై ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో యూఏఈ ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. ఈ ఏడాది జనవరిలో దావోస్ పర్యటనలో ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి యూఏఈ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆహారశుద్ధి రంగంలో ఏపీలో వ్యాల్యూ చైన్ ఏర్పాటు చేయాలని యూఏఈ నిర్ణయించింది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేస్తూ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మామిడి, అరటి, కోకో లాంటి వివిధ ఉద్యాన ఉత్పత్తులకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, విలువ జోడించిన ఉత్పత్తుల ఎగుమతులు, వాణిజ్యం లాంటి అంశాల్లో ఈ ఎంఓయూ సహకరించనుంది. ఈ ఒప్పందంలో తొలి అడుగుగా యూఏఈకి చెందిన ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఏపీలోని చిత్తూరులో రూ.100 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది. చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను తయారు చేయనుంది. దుబాయ్, యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ దాదాపు 25 దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఏపీలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి కూడా అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేయనుంది. క్వాంటం స్పీడ్ తో అవకాశాలు అందుకోండి.. దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనపరిచిన యూఏఈ ఆరు నెలల్లోగా వాటిని సాకారం చేసే దిశగా ముందుకు వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. యూఏఈ ఫుడ్ క్లస్టర్ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎగుమతులు, వాణిజ్యం, పెట్టుబడులకు ఏపీ వేదిక కావటం సంతోషదాయకమని సీఎం వ్యాఖ్యానించారు. ఉద్యాన, ఆక్వా, ఐటీ రంగాల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని వైవిధ్యమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఏడాది పొడవునా వివిధ రకాల ఉద్యాన ఉత్పత్తులు సాగు చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్ర స్థూల ఆదాయంలో 30 శాతం మేర ఉద్యాన, వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా వస్తోందని చెప్పారు. రూ. 1 లక్ష కోట్ల ప్రభుత్వం, ప్రైవేటు పెట్టుబడితో రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యాన హబ్ గా మారుస్తున్నామని తెలిపారు. రిలయన్స్ సంస్థ భాగస్వామ్యంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్-ISAను కూడా ఏర్పాటు చేయనున్నట్టు సీఎం వివరించారు. 200కు పైగా ఉద్యాన క్లస్టర్లతో అక్వా మిర్చి, పామాయిల్, కోకో, కాఫీ తదితర పంటల్లో ఏపీ ఎగుమతులు చేస్తోందని సీఎం యూఏఈ ప్రతినిధి బృందానికి వివరించారు. కృష్ణా-గోదావరి డెల్టాలో నిరంతర నీటి సరఫరా కారణంగా వ్యవసాయ ఉత్పత్తి సాధించగలుగుతున్నామని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీకి ఓ విధానంగా మారిపోయిందని తెలిపారు. ప్రగతిశీల విధానాల వల్ల దేశంలోని పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వచ్చాయన్నారు. పోర్టులు, రైల్వై, రోడ్డు వ్యవస్థతో ఏపీ లాజిస్టిక్స్ కేంద్రంగా మారిందని అన్నారు. ఆగస్టు 1 తేదీ నుంచి ఏపీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీలో అందుబాటులోకి వస్తోందని వివరించారు. విస్తృతమైన వనరులతో వివిధ రంగాల్లో విస్తృత వ్యాపార అవకాశాలను అందించేందుకు ఏపీ సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి యూఏఈ బృందానికి తెలిపారు. క్వాంటం స్పీడ్ తో అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. పర్యావరణ అనుకూలంగా నిర్మిస్తున్న అమరావతిని మరో నివాసంగా మార్చుకోవాలని యూఏఈ ప్రతినిధులను సీఎం కోరారు. ఏపీ-యూఏఈ మధ్య ఫుడ్ కారిడార్.. కృష్ణా-గోదావరి లాంటి నదులున్న ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని యూఏఈ ఎకానమీ, టూరిజం విభాగం మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విజనరీ నేత సీఎం చంద్రబాబు నాయుడు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. భారత్- యూఏఈ వాణిజ్య బంధంలో భాగంగా ఏపీలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా పని చేస్తున్నామని తెలిపారు. ఏపీలోని రొయ్యలు, అరటి లాంటి ఉద్యాన ఉత్పత్తులు వాణిజ్యంలో కీలకంగా ఉన్నాయని అన్నారు. ఏపీలో ఫుడ్ పార్క్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ చైన్ సహా వివిధ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. సీఎం చంద్రబాబు వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తూ వాణిజ్యాన్ని, పరిశ్రమల్ని ప్రోత్సహించటం సంతోషదాయకమని ఆయన ప్రశంసించారు. అమరావతి నుంచి న్యూయార్క్ మార్కెట్ వరకూ కు డెయిరీ, పౌల్ట్రీ, సీఫుడ్ , పప్పు దినుసులు తదితర రంగాల్లో ఎగుమతులపై దృష్టి పెడతామని అన్నారు. కృష్ణపట్నం, కాకినాడ నుంచి యూఏఈకి షిప్పింగ్ రూట్లోనూ వాణిజ్యం మరింత పెరిగేందుకు సహకరిస్తామని యూఏఈ మంత్రి తెలిపారు. ఏపీ-యూఏఈల మధ్య బంధం మరింత వేగంగా బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ స్పష్టం చేశారు. ఈ అవగాహనా ఒప్పందం కార్యక్రమంలో యూఏఈకి ఫుడ్ క్లస్టర్ చైర్మన్ సలేహ్, యూఏఈ సహాయ కార్యదర్శి మారియా అల్ ఖాసిమ్, స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ అనూషా అల్ మర్జూఖీ, యూఏఈ ఎంబసీ నుంచి అహ్మద్ అల్ జ్నేబీ, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, సీఎస్ సాయి ప్రసాద్ , పరిశ్రమలు, ఈడీబీ, ఆర్థికశాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
http://www.teluguone.com/news/content/uae-signs-mou-with-ap-edb-36-226664.html





