రాహుల్ రచ్చలో ఇద్దరు సీఎంల వార్..
Publish Date:Feb 14, 2022
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో చెలిమి కోరుకుంటున్నారా? అందుకే ఆయన, రాహుల్ గాంధీ అడుగు జాడల్లో నడుస్తున్నారా? పుల్వామా దాడులకు ప్రతిగా పాక్’ భూభాగంలోని సైనిక,ఉగ్రవాద స్థావరాలపై, మన సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్’కు ఆధారాలు చూపాలంటూ, రాహుల్ గాంధీ చేసిన డిమాండ్ పై అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను, కేసీఆర్ ఖండించారు. ఖండించడమే కాదు, సర్జికల్ దాడులపై తనకు కూడా అనుమానాలున్నాయని, రాహుల్ ‘ కు అండగా నిలిచారు. రాహుల్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎంను బర్తరాఫ్ చేయాలని కూడా కేసీఆర్ డిమాండ్ చేశారు. అయితే, కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు, అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ, అదే తీరులో స్పందించారు. కేసీఆర్’కు జవాబుగా, హేమంత్ బిశ్వశర్మ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘డియర్ కేసీఆర్ గారూ, మన వీర సైన్యం చేసిన సర్జికల్ స్ట్రయిక్స్కు వీడియోగ్రాఫిక్ సాక్ష్యం. అయినప్పటికీ మీరు మా సాయుధ బలగాల పరాక్రమాన్ని ప్రశ్నిస్తున్నారు. సైనికులను అవమానిస్తున్నారు. మన సైన్యంపై దాడి చేసి దుష్ప్రచారం చేయడానికి మీరు ఎందుకు తహతహలాడుతున్నారు?’’ అంటూ ప్రశ్నించారు. మన సైన్యాన్ని అవమానిస్తే నవ భారతదేశం సహించదు అంటూ కూ యాప్లో వీడియోలో పోస్ట్ చేశారు. పుల్వామా దాడి వార్షికోత్సవం సందర్భంగా సర్జికల్ స్ట్రయిక్స్’ను ప్రశ్నించడం ద్వారా ప్రతిపక్షాలు మళ్లీ మన అమరవీరులను అవమానించాయని హిమంత్ అంటున్నారు. నెహ్రూ కుటుంబానికి తమ విధేయతను నిరూపించుకునే ప్రయత్నంలో కొందరు సైన్యానికి ద్రోహం చేసేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సైన్యం పట్ల తనకు ఎంతో విధేయత ఉందని, జీవితకాలమంతా తనను విమర్శించినా పట్టించుకోబోనని తెలిపారు. ఇదిలా ఉంటే, రాహుల్ గాందీని ఉద్దేశించి, హేమంత్ బిశ్వ శర్మ చేసిన అభ్యతరకర వ్యాఖ్యలను ఎవరూ సమర్ధించడం లేదు కానీ, రాహుల్, ఆయన అడుగు జాడల్లో కేసీఆర్ సైన్యాన్ని సాక్ష్యాలు అడగడం అంతకంటే పెద్ద తప్పని అంటున్నారు. అది కూడా పుల్వామా వీర సైనికుల సంస్మరణ సందర్భంగా ఈ ప్రస్తావన చేయడం బాధాకరమని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. సర్జికల్ స్త్రైక్స్ చేసింది, మోడీ కాదు. సైన్యం. సర్జికల్ స్త్రైక్స్ విజయవంత మయ్యాయని ప్రకటించింది, మోడీనో, రాజనాథ్ సింగో కాదు, త్రిదళ అధిపతులు. రాహుల్ గాంధీ , కేసేఅర్ ఎవరిని అనుమానిస్తున్నారు. ఎవరిని, అవమానిస్తున్నారు? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/two-cms-fight-over-rahul-gandhi-episode-25-131781.html





