Top Stories

political-news-img

కుటుంబ వివాదాలూ రాజకీయ వేధింపులే.. వైసీపీ నేతల వింత పోకడ.!

ఏపీలో వైసీపీ రాజకీయం వింత పోకడలు పోతోంది. ఆ పార్టీకి చెందిన నేతలు వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి జోగి రమేష్ లపై ఇటీవల నమోదైన కేసులన్నీ వారి వారి సొంత విషయాలకు సంబంధించినవి. అయితే ఈ మూడు అంశాలనూ కూడా రాజకీయ వేధింపులంటూ వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ కేసులకు కారణం ఆయా నేతల వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ వివాదాలే కారణమని విస్పష్టంగా తెలుస్తున్నా.. అవన్నీ రాజకీయ వేధింపుల కారణంగా నమోదైన కేసులే అని కలరింగ్ ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలపై అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందుగా మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కేసు విషయానికి వస్తే.. ఆయన కుమారుడు నిర్లక్ష్యంగా ద్విచక్రవాహనం నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే చట్టపరమైన నిబంధనల ప్రకారం పారదర్శకంగా వ్యవహరించడానికి బదులు.. సిదిరి అప్పలరాజు.. ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయన అరెస్టయ్యారు. అంతకు ముందు జగన్ సిదిరి అప్పలరాజుకు మద్దతుగా చిన్న కుర్రోడు యాక్సిడెంట్ చేస్తే అరెస్టు చేస్తారా అంటూ చేసిన వ్యాఖ్యలు జగన్ ప్రతిష్ఠను సైతం మసకబార్చాయి. ఆ తరువాత వైసీపీ సీనియర్ నాయకుడు, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విషయం తీసుకుంటే.. ఆయన వైసీపీ హయాంలో తన పలుకుబడిని, అధికారాన్ని ఉపయోగించి నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే ప్రైవేటు భూమిని బోగస్ డెత్ సర్టిఫికెట్, బోగస్ వారసులను సృష్టించి కబ్జా చేశారు. దీనిపై ఆ భూమి యజమాని తను బతికి ఉండగానే.. తన డెత్ సర్టిఫికేట్ సృష్టించి తన భూమిని అన్యాయంగా తమ్మినేని కుమారుడి పేరుపై రిజిస్టర్ చేయించారని ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో ఆయన కుటుంబంతో సహా పరారయ్యారు. అజ్జాతం నుంచే హైకోర్టును ఆశ్రయించి రాజకీయ వేధింపులతోనే కేసు పెట్టారంటూ ముందస్తు బెయిలు కోరారు. కోర్టు ఆయన యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది. కాగా తమ్మినేని సీతారాం కుటుంబం భూ కబ్జా విషయంలో జగన్ మౌనం ఆయనకు మద్దతుగా నిలిచారన్న సంకేతాన్ని ఇస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఇప్పుడు తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యుల 11 మందిపై స్వయానా ఆయన కోడలే వరకట్నం కోసంశారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు వేధింపుల కేసు పెట్టారు. వీరి విషయంలో కూడా జగన్ ఇంత వరకూ స్పందించడం కానీ, పార్టీ పరంగా చర్యలు తీసుకోవడం కానీ చేయకుండా పరోక్షంగా అండగా నిలుస్తున్నారు. ఈ తరహా సంఘటనలు జరిగిన ప్రతిసారీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యలని ఆరోపించడం వైసీపీకి రివాజుగా మారింది. సొంత సమస్యలు, తప్పుల కారణంగా క్రిమినల్ కేసుల్లో బుక్కై వాటికి రాజకీయ రంగు పులమడానికి వైసీపీ చేసే ప్రయత్నాలు ప్రజలలో ఆ పార్టీ, ఆ పార్టీ నయకత్వంపై వ్యతిరేకత పెరగడానికే దోహదపడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వ్యక్తిగత తప్పులు, కుటుంబ కలహాలతో కేసుల్లో ఇరుక్కుని, వాటిని రాజకీయ వేధింపులుగా చిత్రీకరించే ప్రయత్నాలను ప్రజలు ఏ మాత్రం హర్షించరని చెబుతున్నారు. YSRCP leaders cases, AP political news, Jogi Ramesh family dispute, Appalaraju case, Tammineni family issue

Publish Date: Jul 25, 2026 12:02PM

political-news-img

ధింసా నృత్యంతో ప్రధానికి స్వాగతం.!

ఉత్తరాంధ్రకే తలమానికంగా రూపుదిద్దుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్రమోడీ వచ్చే నెల1న జాతికి అంకితం చేస్తున్న నేపథ్యంలో ఈ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్ అనే రీతిలో విజయవంతం చేయాలని ఏపీ మంత్రి నారా లోకేష్ ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను శుక్రవారం(జులై 24) స్వయంగా పరిశీలించిన మంత్రి లోకేష్.. అనంత‌రం స‌మీక్ష నిర్వ‌హించారు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి మూడు లక్షల మందికి పైగా ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం, ప్రధాని మోదీ బహిరంగసభకు హాజరవుతారనీ, అందుకు తగ్గట్లుగా ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాలని లోకేష్ ఆదేశించారు. కూటమి నాయకులు సమన్వయంతో పనిచేసి ప్ర‌ధాని స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతూ 13వేలమందితో దేశంలోనే అతిపెద్ద ధింసా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ సభకు హాజరయ్యే ప్రజలకోసం 36 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 5వేల బస్సులు ఏర్పాటు చేశారు. సభకు వచ్చేవారు బస్సు ఎక్కినప్పటినుంచి తిరిగి వెళ్లేవరకు ఎటువంటి లోటులేకుండా మండలస్థాయి లైజన్ ఆఫీసర్లు దగ్గరుండి చూసుకోవాలని లోకేష్ చెప్పారు. ప్ర‌ధాని బహిరంగసభను వీక్షించేందుకు ప్రతి 5వేలమందికి ఒక ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్ల కమిటీ ముఖ్య అధికారి ఎంటి కృష్ణబాబు చెప్పారు. సీనియర్ ఐఎఎస్ అధికారులు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారన్నారు. ఈ సమీక్షలో మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, తెలుగుదేశం జాతీయ ప్రధానకార్యదర్శి కిలారి రాజేష్, ఎపిఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, ఎంపి చింతకాయల విజయ్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, కార్యక్రమాల కమిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, కళా వెంకట్రావు, కోండ్రు మురళీమోహన్, లోకం నాగమాధవి , విఎంఆర్ డిఎ చైర్మన్ ప్రణవ్ గోపాల్, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి జి.వీరపాండ్యన్, విజయనగరం కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ ఎండి ఢిల్లీరావు, మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చైర్మన్ ఎంఎం నాయక్, ఎపి గిరిజన కార్పొరేషన్ ఎండి ఎస్ఎస్ శోభిక, విశాఖపట్నం రేంజి ఐజి గోపినాథ్ జెట్టి, రవాణాశాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, విజయనగరం ఎస్పీ దామోదర్, ఎపి ట్రైబల్ వెల్ఫేర్ డైరక్టర్ భార్గవి,ప్రోటోకాల్ (జిఎడి) డైరక్టర్ మోహన్ రావు, విజయనగరం జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్, విజయనగరం డిసిసిబి చైర్మన్ కిమిడి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. Welcome to Prime Minister, Dhimsa dance, Bhogapuram, Airport, Inaguration, Minister, Lokesh

Publish Date: Jul 25, 2026 11:38AM

political-news-img

ఎల్ నినో ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలలో సాగుకు తిలోదకాలేనా?

ఎల్ నినో ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాలలో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు, తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. నెలకొన్నాయి. వానకాలం ఖరీఫ్ సీజన్ సగం గడుస్తున్నప్పటికీ వర్షభావ పరిస్థితుల కారణంగా సాగు రంగం సంక్షోభంలో పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సారికి క్రాప్ హాలీడే యే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావం కారణంగా ఈ సీజన్ సాగుకు తిలోదకాలు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. పలు గ్రామీణ మండలాల్లో నేల కనీసం ఒక్కసారి కూడా తడవని పరిస్థితి ఏర్పడింది. ఈ అనావృష్టి ప్రభావం పంట సాగుపైనే కాకుండా తాగునీటి నిల్వలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. తెలంగాణలో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. సాధారణ వర్షపాతం 35 శాతానికి పైగా లోటు నమోదైంది. రాష్ట్రంలోని పాతిక పైగా జిల్లాలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. దీంతో వ్యవసాయానికి నీటిని విడుదల చేయడం నిలిపివేసి, ఉన్న కొద్దిపాటి జలాలను తాగునీటి అవసరాలకే కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ దాదాపు అదే పరిస్థితి. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లోని 400కి పైగా మండలాల్లో నేలలో తేమ శాతం పడిపోయింది. అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాధారంగా సాగయ్యే వేరుశనగ, పత్తి, పప్పుధాన్యాలు, మిర్చి పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి. వర్షాలు లేక విత్తనాలు వేయడం ఆలస్యం కావడం, నాటిన మొలకలు ఎండిపోతుండటంతో చిన్న, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. కేవలం గ్రామీణ ప్రాంతాలే కాకుండా ప్రధాన నగరాలు కూడా నీటి కొరత ముప్పును ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి మహానగరాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతోంది. జలాశయాల్లో నీటి నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతుండటంతో నగరపాలక సంస్థలు ముందస్తు చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. అత్యవసర సమయంలో నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండటం కోసం ట్యాంకర్లను సిద్ధం చేయడం, అందుబాటులో ఉన్న నీటి వనరులను నిశితంగా పర్యవేక్షించడంపై అధికారులు దృష్టి సారించారు. వాతావరణ శాఖ వివరాల ప్రకారం, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావం వల్ల రుతుపవనాల గమనం మందగించింది. అల్పపీడన ద్రోణులు మధ్య, పశ్చిమ భారత ప్రాంతాల వైపు తరలిపోవడంతో తెలుగు రాష్ట్రాలలో వానలు కురవడం లేదు. జులై చివరి వారంలో లేదా ఆగస్టు ప్రారంభంలో బంగాళాఖాతంలో ఏర్పడే స్థానిక వాతావరణ మార్పుల వల్ల కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. Kharif Cultivation Crisis, Water Scarcity in Telugu States, Absence, Southwest Monsoon

Publish Date: Jul 25, 2026 11:08AM

political-news-img

ఏపీలో ఆగని కరోనా వ్యాప్తి.!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. కొత్తగా ఏడుగురికి కరోనా సోకటంతో మొత్తం కేసుల సంఖ్య 39కి పెరిగింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ఆరోగ్య శాఖ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన బాధితులందరినీ ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి తగిన చికిత్స అందిస్తున్నది. వైరస్ వ్యాప్తి వేగాన్ని అరికట్టుందుకు ఆరోగ్య శాఖ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కొత్తగా పాజిటివ్‌గా తేలిన వారితో నేరుగా సంబంధం కలిగి ఉన్న ప్రాథమిక కాంటాక్ట్‌లను గుర్తించే ప్రక్రియను ముమ్మరం చేశారు. బాధితులు ఇటీవల కాలంలో ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడికి ప్రయాణించారు అనే సమాచారాన్ని సేకరించి, వారిని కూడా వెంటనే హోమ్ ఐసోలేషన్ కు పంపుతున్నారు. వైరస్ తీవ్రత సకాలంలో అదుపులోకి రావాలంటే బాధితుల కాంటాక్ట్ ట్రేసింగ్ అత్యంత కీలకమని భావించిన అధికారులు, ఈ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రంలో మళ్లీ వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించి ప్రతి జిల్లా పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల వరకు ప్రత్యేక కరోనా వార్డులను సిద్ధం చేయాలని మార్గదర్శకాలు జారీ చేశారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కరోనా టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. మందుల కొరత లేకుండా చూడటంతో పాటు ఆక్సిజన్ నిల్వలు, వైద్య పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆసుపత్రుల నిర్వహణ వర్గాలను ఆదేశించారు. ap corona cases, andhra pradesh covid updates, ap health department news, active covid cases

Publish Date: Jul 25, 2026 10:54AM

political-news-img

ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్? క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన ప్లాన్!

ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రాచీనమైన, ప్రతిష్ఠాత్మకమైన పోరుగా 'యాషెస్' సిరీస్‌ను పేర్కొంటారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మైదానంలో సాగే ఈ సాంప్రదాయ పోరుకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మైదానంలో ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ ఆటగాళ్ల మధ్య కనిపించే తీవ్రమైన పోటీ, భావోద్వేగాలు క్రికెట్ ప్రేమికులను కట్టిపడేస్తాయి. ఇప్పటివరకు ఈ చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్‌లు కేవలం ఆస్ట్రేలియా లేదా ఇంగ్లాండ్ నేలపైన మాత్రమే జరుగుతూ వచ్చాయి. కానీ త్వరలోనే ఈ సాంప్రదాయ సమరానికి భారత గడ్డ వేదిక కాబోతోందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న ఒక ఊహించని నిర్ణయం ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో తీవ్ర ఆసక్తిని, సంచలనాన్ని రేకెత్తిస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా ఇటీవలే ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రతిష్టాత్మక బిగ్ బాష్ లీగ్ (బిబిఎల్) ఓపెనింగ్ మ్యాచ్‌ను భారతదేశంలోని చెన్నై నగరం వేదికగా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. చెన్నైలో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ నిర్వహించడం అనేది కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో భారత్‌లో మరింత భారీ మైలురాళ్లను అధిరోహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఇందులో భాగంగానే ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే ఐకానిక్ యాషెస్ టెస్ట్ మ్యాచ్‌ను న్యూట్రల్ వెన్యూ అయిన భారత్‌లో హోస్ట్ చేయడంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ క్రేజీ ఐడియా వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, గ్లోబల్ క్రికెట్ మార్కెట్‌లో ఇది అతిపెద్ద మార్పునకు సంకేతంగా నిలుస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్‌బర్గ్ ఈ విప్లవాత్మక ఆలోచనపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో యాషెస్ టెస్ట్ నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అన్ని ఆప్షన్లను పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియాకు, భారత క్రికెట్ నియంత్రణ మౌలిక మండలి (బీసీసీఐ) మరియు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) లతో అత్యంత బలమైన, సత్సంబంధాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. భారత్ వంటి భారీ క్రికెట్ మార్కెట్లోకి టాప్-టైర్ టెస్ట్ కంటెంట్‌ను తీసుకురావడం వల్ల అద్భుతమైన, అపరిమిత అవకాశాలు లభిస్తాయని టాడ్ గ్రీన్‌బర్గ్ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా ల మధ్య టెస్ట్ క్రికెట్‌కు అత్యంత పవర్‌ఫుల్ ఫ్యాన్ బేస్ ఉందని, ఈ సాంప్రదాయ సుదీర్ఘ ఫార్మాట్‌ను మరింత బలోపేతం చేసి కాపాడుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. అయితే ఈ ప్లాన్‌ను వెంటనే అమలు చేయడానికి కొన్ని పెద్ద సవాళ్లు అడ్డుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌లో నెలకొన్న అత్యంత బిజీ షెడ్యూల్ దీనికి ప్రధాన అడ్డంకిగా మారింది. ప్రస్తుత ప్రపంచ క్రికెట్ పరిపాలనలో సంవత్సరానికి కేవలం 365 రోజులు మాత్రమే ఉండటం అతిపెద్ద సవాలుగా పరిణమించిందని గ్రీన్‌బర్గ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాము అనుకున్న విధంగా అంతర్జాతీయ మ్యాచ్‌లను, లీగ్‌లను సరిగ్గా ఫిట్ చేయాలంటే క్యాలెండర్‌లో మరో 1 లేదా 2 నెలల అదనపు సమయం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ లాజిస్టికల్ సమస్యల కారణంగా తక్షణమే భారత్‌లో యాషెస్ మ్యాచ్ నిర్వహించడం కుదరకపోవచ్చని, కానీ భవిష్యత్ అవసరాల కోసం ఈ ఆప్షన్‌ను కచ్చితంగా ఓపెన్‌గా ఉంచుతున్నామని ఆయన స్పష్టం చేశారు. cricket australia considers ashes in india,bbl chennai and ashes test india.

Publish Date: Jul 25, 2026 10:36AM

political-news-img

ఇండియాఫస్ట్ లైఫ్‌లో 26% వాటా కొనుగోలు చేసిన ఫ్రెంచ్ దిగ్గజం బిఎన్‌పి పారిబాస్!

భారత ఇన్సూరెన్స్ రంగంలో సరికొత్త సంచలనం నమోదు కాబోతోంది. ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ బీమా దిగ్గజం బిఎన్‌పి పారిబాస్ కార్డిఫ్ (BNP Paribas Cardif), భారతదేశంలో ఉన్న ప్రముఖ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ (IndiaFirst Life Insurance Company)లో భారీ పెట్టుబడి పెట్టడానికి అధికారికంగా ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్ పింకస్ (Warburg Pincus) వద్ద ఉన్న దాదాపు 26 శాతం (ఖచ్చితంగా 25.96 శాతం) వాటాను బిఎన్‌పి పారిబాస్ కార్డిఫ్ పూర్తిగా కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం ద్వారా ఫ్రాన్స్‌కు చెందిన ఈ గ్లోబల్ ఇన్సూరెన్స్ దిగ్గజం దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్‌లోకి అత్యంత బలమైన రీతిలో రీ-ఎంట్రీ ఇస్తోంది. నియంత్రణ సంస్థలైన ఐఆర్‌డిఎఐ (IRDAI) తుది ఆమోదాలకు లోబడి ఈ కొనుగోలు ప్రక్రియ త్వరలోనే పూర్తి కానుంది. ఈ కొనుగోలు ఒప్పందం ఆధారంగా ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ మొత్తం వాల్యుయేషన్ (Valuation) సుమారు ₹10,000 కోట్ల ($10,000 Crore) విలువను తాకినట్లు మార్కెట్ వర్గాల అంచనా. ఈ కీలక వాటా మార్పిడి పూర్తయిన తర్వాత ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ వాటాదారుల నిష్పత్తిలో గణనీయమైన మార్పులు రానున్నాయి. ఈ కంపెనీలో ప్రధాన ప్రమోటర్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ గరిష్టంగా 65 శాతం వాటాను తమ వద్దే ఉంచుకోనుంది. అంతేకాకుండా మేనేజ్‌మెంట్ నియంత్రణ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా చేతిలోనే ఉంటుంది. ఇక కొత్తగా భాగస్వామిగా చేరుతున్న బిఎన్‌పి పారిబాస్ కార్డిఫ్ 26 శాతం వాటాతో రెండవ అతిపెద్ద వాటాదారుగా అవతరించనుంది. మరో ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India) మిగిలిన 9 శాతం వాటాను కలిగి ఉంటుంది. దేశంలో 12వ అతిపెద్ద ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీగా ఎదుగుతున్న ఇండియాఫస్ట్ లైఫ్, ఆర్థిక సంవత్సరం 2026లో ఏకంగా ₹3,498.55 కోట్ల నూతన బిజినెస్ ప్రీమియంను (New Business Premium) సాధించి తన అపారమైన మార్కెట్ సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఈ భాగస్వామ్యం భారత బీమా రంగానికి నూతన శకాన్ని పరిచయం చేయబోతోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కలిగి ఉన్న వేలాది బ్యాంక్ శాఖల విస్తృత నెట్‌వర్క్, ఇండియాఫస్ట్ లైఫ్ యొక్క డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ శక్తి, అలాగే బిఎన్‌పి పారిబాస్ యొక్క అంతర్జాతీయ బ్యాంకాస్యూరెన్స్ (Bancassurance) అనుభవం, గ్లోబల్ ప్రాడక్ట్ ఇన్నోవేషన్ విధానాలు కలసికట్టుగా పనిచేయనున్నాయి. ఈ సందర్భంగా బిఎన్‌పి పారిబాస్ కార్డిఫ్ సిఈఓ పౌలిన్ లెక్లెర్క్-గ్లోరియక్స్ మాట్లాడుతూ, వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం వంటి వ్యూహాత్మక మార్కెట్లలో తమ అంతర్జాతీయ వ్యాపారాన్ని విస్తరించడం ఎంతో కీలకమని, భారత ప్రజలందరికీ బీమా ఉత్పత్తులను సరసమైన ధరల్లో సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు శ్రమిస్తామని స్పష్టం చేశారు. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండి మరియు సిఈఓ దేబదత్త చంద్ ఈ భాగస్వామ్యాన్ని స్వాగతిస్తూ, ఇండియాఫస్ట్ లైఫ్ తదుపరి స్థాయి వృద్ధికి ఇది బలమైన పునాది వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఎస్‌బిఐ లైఫ్‌లో భాగస్వామిగా ఉండి వైదొలిగిన బిఎన్‌పి పారిబాస్, ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడాతో చేతులు కలిపి భారత లైఫ్ ఇన్సూరెన్స్ రంగాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లడానికి సిద్ధమైంది. warburg pincus sells 26 percent stake indiafirst life,indiafirst life insurance bnp paribas deal.

Publish Date: Jul 25, 2026 10:33AM

MOVIE NEWS