కాకాణి ఫైల్స్ చోరీ కేసు.. సీబీఐకి ఇస్తే ఇరుక్కుంటారా?
Publish Date:Apr 27, 2022
Advertisement
వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసు ఫైల్స్ చోరీ ఘటనపై దర్యాప్తు అధికారం సీబీఐకి ఇస్తే ఎవరు ఇరుక్కుంటారనే చర్చ ఏపీలో జరుగుతోంది. నెల్లూరు కోర్టులో ఫైల్స్ చోరీ, కాకాణిపై ఫోర్జరీ కేసుల దర్యాప్తును సీబీఐకి ఎందుకు అప్పగించకూడదో చెప్పాలని హైకోర్టు అనడంతో ఒక్కసారిగా పలువురి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విదేశాల్లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ గతంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి కోర్టులో కేసు వేశారు. అందుకు సాక్ష్యాలుగా కొన్ని పత్రాలను ఆయన కోర్టుకు సమర్పించారు. అయితే.. కాకాణి సమర్పించిన పత్రాలు ఫోర్జరీవని ఆయనపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేసు పెట్టారు. మొత్తం ఈ కేసులను సీబీఐకి అప్పగిస్తే అభ్యంతరం ఏమైనా ఉందా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించినప్పుడు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ తమకు అభ్యంతరం లేదని చెప్పారు. దీంతో ఈ కేసులతో ప్రమేయం ఉన్న పలువురు అధికారులు, రాజకీయ నేతల్లో అలజడి రేగిందంటున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసి, అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ డీజీపీని హైకోర్టు నిర్దేశించింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, నెల్లూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ప్రస్తుత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. నెల్లూరు కోర్టులో ఉన్న ఫైల్స్ చోరీ అయ్యాయని ముందుగా ఒప్పంద బెంచ్ క్లర్క్ గా పనిచేస్తున్న నాగేశ్వరరావు ఫిర్యాదు చేయడం గుర్తుంచుకోవాల్సి అంశం. అయితే.. క్లర్కు చోరీ అయినట్లు చెప్పిన ఫైల్స్ అసలు కోర్టు ఆధీనంలోనే లేవని, అవి పోలీస్ స్టేషన్ లో ఉన్నాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని హైకోర్టుకు నివేదిక సమర్పించడం సంచలనంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులతో బెంచి క్లర్కు నాగేశ్వరరావు కుమ్మక్కై కట్టుకథ అల్లాడని, పత్రాలు చోరీ అయ్యాయని కోర్టును తప్పదారి పట్టించాడని ఆ నివేదికలో జస్టిస్ యామిని పేర్కొనడం గమనించదగ్గ అంశం. ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో సమగ్రంగా దర్యాప్తు చేయించాలని తన నివేదికలో జస్టిస్ యామిని హైకోర్టుకు విన్నవించారు. నెల్లూరు కోర్టు ప్రాంగణంలోని డ్రైనేజిలో ఏప్రిల్ 14న దొరికిన ప్రాపర్టీ నగర నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు సంబంధించిన ప్రాపర్టీయే కాదని జస్టిస్ యామిని తన నివేదికలో చెప్పడం విశేషం. నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని హైకోర్టుకు ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే.. కోర్టులో ఉన్న పత్రాలు చోరీ అయ్యాయని కాంట్రాక్ట్ బెంచ్ క్లర్క్ నాగేశ్వరరావు ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందనే అనుమానం తెరమీదకు వస్తోంది. అలా పత్రాలు పోయాయంటూ నాగేశ్వరరావు ఫిర్యాదు చేయడం వెనక ఎవరున్నారు? అనే ప్రశ్న కూడా దూసుకు వస్తోంది. అసలు కోర్టులోనే లేని పత్రాలు పోయాయని ఎందుకు ఫిర్యాదు చేశాడు.. ఫిర్యాదు చేయడం వెనుక కుట్ర ఏమైనా ఉందా? అనేది స్పష్టం కావాల్సి ఉంది. కోర్టులో ఉన్న కాకాణికి కేసుకు సంబంధించిన ఫోర్జరీ పత్రాలు చోరీ అయ్యాయంటే.. అవి నిజంగా ఫోర్జరీవే అయితే.. వాటిని తప్పించాల్సిన అవసరం కాకాణికి ఉంటుందంటున్నారు. కానీ ఆ పత్రాలు ఫోర్జరీవి కాకపోతే వాటిని దొంగిలించాల్సి అగత్యం ఇంకెవరికి ఉంటుందనేది ప్రశ్నగా మారింది. అలా కాదనుకుంటే కోర్టులోనే లేని పత్రాలు చోరీ అయ్యాయని చెప్పడం వెనుక కాకాణిని అభాసుపాలు చేసే కుట్ర ఉందా? అనే సందేహాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులను విచారించే ప్రత్యేక కోర్టులోనే చోరీ జరిగిందనేది వాస్తవం. అయితే.. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులకు సంబంధించిన రికార్డులు అప్పటికే విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు పంపించేశారట. కానీ వాటిలో మంత్రి కాకాణి కేసుకు సంబంధించిన పత్రాలు మాత్రం విజయవాడకు చేరలేదట. ఈ సమాచారం నెల్లూరు జిల్లా జడ్జికి కూడా అందించలేదు. తీరా చూస్తే ఆ ఫైల్స్ నెల్లూరు టూటౌన్ పోలీసుల ఆధీనంలో ఉన్నాయట. అంటే చోరీ జరిగినట్లు చెబుతున్న కాకాణి కేసు ఫైల్స్ 4వ అదనపు జూనియర్ సిలిల్ జడ్జి కోర్టులో లేవని జిల్లా ప్రధాన జడ్జి జస్టిస్ యామిని తేల్చారు. అంటే అసలు చోరీ అయిన ప్రాపర్టీలో కాకాణి కేసు ఫైల్స్ లేకపోయినా.. ఎందుకు అవి చోరీ అయ్యాయని కాంట్రాక్ట్ బెంచ్ క్లర్క్ ఫిర్యాదు చేయాల్సి వచ్చిందనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. చోరీ అయినవి మంత్రి కాకాణి కేసు ఫైల్సే అనే ప్రచారం ఎలా జరిగింది? ఆ ప్రచారం అసలు ఎక్కడ మొదలైంది? బెంచ్ క్లర్క్ చెప్పిన కాకాణి ఫైల్స్ చోరీ కథ కట్టుకథా? లేక ఇంకేదైనా మోటివేషన్ ఉందా? అనే దానిపై చర్చ జరుగుతోంది. బెంచ్ క్లర్క్ చెప్పింది కట్టుకథే అయితే.. ఎందుకు చెప్పాడనేది స్పష్టం కావాల్సి ఉంది. నిజానికి కోర్టులో చోరీ జరిగిందని చెబుతున్న రోజున కోర్టులో 3 ప్లస్ 1 పోలీసు కాపలా ఎందుకు ఉండలేదు? ఆ రోజే భద్రతను అంత ఈజీగా పోలీసులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది. చోరీ జరిగిన తీరుపై పోలీసు దర్యాప్తు సరైన దర్యాప్తు జరగలేదని వస్తున్న అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తేల్చిన దానిపై ఎవరిని బాధ్యులగా లేలుస్తారనేది సీబీఐకి దర్యాప్తు అప్పగిస్తే తేలే అవకాశం ఉందంటున్నారు. చోరీ జరిగిన రోజున కోర్టు తలుపులు పగలగొట్టిన దుండగుల వేలి ముద్రలు గానీ, సంఘటనా స్థలంలో పాదముద్రలు గానీ పోలీసులు ఎందుకు సేకరించలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సంఘటన జరిగిన రోజున దర్యాప్తు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి కారణం ఏమై ఉంటుందనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. అందుకు ఏదైనా బలమైన కారణం ఉందా అంటున్నారు. మొత్తం మీద నెల్లూరు కోర్టులో చోరీ కేసును, కాకాణి, సోమిరెడ్డి పెట్టుకున్న కేసులపై సీబీఐ విచారణ జరిగితే.. అవి ఎవరి మెడకు చుట్టుకుంటాయో? ఇంకెవరు ఇరుక్కుపోతారో అనే ఆసక్తి పెరిగిపోతోంది.
http://www.teluguone.com/news/content/twists-in-minister-kakani-case-files-theft-issue-39-135082.html





