పెట్రో మంటలపై పెదవి విప్పిన మోడీ.. అంతా మీవల్లనే.. భగ్గుమన్న విపక్షాలు
Publish Date:Apr 27, 2022
Advertisement
ఇంచుమించుగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, వచ్చి యూపీ సహా నాలుగు రాష్ట్రాలలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన పది రోజుల మొదలు పెట్రోల్. డీజిల్ ధరలు, ఇంచుమించుగా ప్రతి రోజూ ఎంతోకొంత పెరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల బ్రేక్’ కు ముందు వందలోపున ఉన్న లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు సెంచరీ మార్క్ దాటి, 120 నాట్ అవుట్’ దశకు చేరుకున్నాయి. పెట్రోల్ డిజిల్ ధరలతో పాటుగా, నిత్యావసర సరకులు, కూరగాయలు, ఒకటనేమిటి మందులు సహా అన్నిటి ధరలు చుక్కలు చూస్తున్నాయి. సామాన్యులు, అల్పాదాయ, మధ్య తరగతి ప్రజలు, దిక్కులు చూస్తున్నారు. పడరాని పాట్లు పడుతున్నారు. అయితే, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల విషయంగా ఇంతవరకు పెదవి విప్పని ప్రధాని, ఈరోజు ( బుధవారం) పెదవి విప్పారు. అంతే కాదు, ఏపీ, తెలంగాణ సహా ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాల పై ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ నెలలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా.. కొన్ని రాష్ట్రాలు చమురుపై వ్యాట్‌ను తగ్గించలేదన్నారు.అలా చేయడం ద్వారా కేంద్రం అందించిన ప్రయోజనాలు క్షేతస్థాయిలోని ప్రజల వరకు వెళ్లడం లేదన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా పరిస్థితులు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా తలెత్తుతున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు.ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడిందన్నారు మోదీ. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరం అన్నారు. పెట్రోలు, డీజిల్పై వ్యాట్ తగ్గించకపోవడం వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు మోదీ. ఇలా చేయడం మంచిది కాదన్నారు. ఒక రాష్ట్రం ధరలు తగ్గించకపోవడం వల్ల, ఆ ప్రభావం పొరుగు రాష్ట్రాలపై కూడా పడుతుందన్నారు. "మహారాష్ట్ర, బంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఝార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలు.. కొన్ని కారణాల వల్ల.. ఈ విషయంలో కేంద్రం మాట వినడం లేదు. అలా చేయడం వల్ల ప్రజల పై భారం పడుతోంది. నవంబర్‌లోనే ఈ రాష్ట్రాలు వ్యాట్ తగ్గించావాల్సింది , కానీ తగ్గించ లేదు. ఇప్పటికైనా, వ్యాట్ తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అయితే, మోడీ ఆరోపణను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. వ్యాట్ విషయం జోలికి వెళ్ళకుండా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జీవాలా, కేంద్ర ప్రభుత్వం గడచిన ఎనిమిదేళ్ళలో పెంచిన ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని డిమాండ్ చేశారు. యూపీఎ ప్రభుత్వ హయాంలో పెట్రోల్ మీద లీటరుకు రూ.9.48, డీజిల్ పై రూ.3.56 ఉన్న ఎక్సైజ్ డ్యూటీ మోడీ ప్రభుత్వం ఏకంగా పెట్రోల్ పై లీటరుకు రూ. 27.90, డీజిల్ పై రూ.21.80 కు చేర్చిందని సుర్జీవాలా చెప్పు కొచ్చారు. ప్రభుత్వానికి ప్రజలను ఆదుకునే ఉద్దేశం ఉంటే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని అయన సూచించారు. అదలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ లోంచి 41 శాతం తిరిగి రాష్ట్రాలకే వస్తుందని, అదే విధంగా రాష్ట్రాలు విదిస్తున్న వ్యాట్ వలన ఏపీ, తెలంగాణ సహా అనేక రాష్ట్రాలలో లీటరుకు రూ.30 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే చేరుతుందని, ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అదే విధంగా, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే, ఆ మేరకు రాష్ట్రాలకు వచ్చే ఆదాయం కూడా తగ్గుతుందని, మరో వంక కేంద్ర ప్రభుత్వం ఫ్రీ వాక్సిన్, ఫ్రీ రేషన్ అందిస్తున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే పరిస్థితి లేదని అంటున్నారు. అదే సమయంలో కొవిడ్, యుద్ధం (రష్యా-ఉక్రెయిన్) యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నా వాస్తవాన్ని, రాజకీయ పార్టీలు విస్మరించరాదని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/pm-modi-asks-states-to-reduce-vat-on-petrol-and-diesel-39-135087.html





