టీటీడీలో 18 మంది అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు
Publish Date:Feb 5, 2025
.webp)
Advertisement
జగన్ అరాచకపాలన నుంచి విముక్తి పొందిన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సమయానికి రాష్ట్రం అన్ని రంగాలలో అధమ స్థానంలో ఉంది. వ్యవస్థలు నిర్వీర్యమై ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ప్రక్షాళన చేసి మళ్లీ అభివృద్ధి బాట పట్టించాల్సిన పరిస్థితి. అందుకే అధికార పగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ చంద్రబాబు అదే పనిలో ఉన్నారు. అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తిరుమల దేవుడిని దర్శించుకున్న చంద్రబాబు అక్కడే రాష్ట్రంలో ప్రక్షాళన తిరుమల నుంచే ఆరంభిస్తానని ప్రకటించారు. అదే చేశారు. చేస్తున్నారు. తిరుమల ప్రక్షాళన మొదలైంది. జరగాల్సింది ఇంకా చాలా ఉంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆ పనికి నడుంబిగించింది. తిరుమలపై ఈ నెల 11 చంద్రబాబు సమీక్ష చేయనున్న నేపథ్యంలో కీలక చర్యలు, సంచలన నిర్ణయాలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న 18 మందిపై బదిలీ వేటు వేసింది. తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారంటూ వారిపై బదిలీ వేటు వేసింది. వీరు కాకుండా మరో 300 మంది అన్యమతస్తులు టీటీడీలో వివిధ విభాగాల్లో కొలువులు చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. వారిని కూడా దశల వారీగా బదలీ చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం టీటీడీ బదిలీవేటు వేసిన వారిలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్, ఎస్వీయూ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఉన్నారు. తిరుమలలో అన్యమతస్తులు ఉండడానికి వీలులేదని టీటీడీ చెబుతోంది. హిందువులు వినా మరో మతానికి చెందిన వారికి టీటీడీలో కొలువులు సరికాదన్న భావనతో ముందుగా టీటీడీలోని వివిధ విభాగాలలో పని చేస్తున్న 18 మందిపై బదిలీ వేటు వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వాస్తవానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులకు ఉద్యోగ అవకాశాలు ఉండవు. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడంతో కొందరు టీటీడీలో కొలువులో చేరారు. తొలి దశలో 18 మందిపై బదిలీ వేటు వేసింది. ముందు ముందు మిగిలిన వారిని కూడా టీటీడీ నుంచి వేరే రాష్ట్రప్రభుత్వ శాఖలకు బదిలీ చేయడమో, వీఆర్ఎస్ ఇవ్వడమో చేస్తామని టీటీడీ చెబుతోంది. ఇక తిరుమల కొండపై పారిశుదధ్య పరిస్థితిని మెరుగుపరచడానికి టీటీడీ తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. తిరుమలలో పారిశుద్ధ్య పరిస్థితి బాగా మెరుగుపడిందని భక్తులు చెబుతున్నారు. అలాగే తిరుమలలో భక్తుల సౌకర్యాలు, అన్న, జల ప్రసాదాల వితరణ భేషుగ్గా ఉందంటున్నారు. అలాగే తిరుమల కొండపై హోటళ్లలో తినుబండారాల నాణ్యత కూడా మెరుగుపడిందనీ, అలాగే తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతా భేషుగ్గా ఉందని భక్తులు చెబుతున్నారు. తాజాగా మంగళవారం తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాన్ని టీటీడీ బ్రహ్మాండంగా నిర్వహించిందని భక్తులు ప్రశంసిస్తున్నారు. స్వామి వారి వాహన సేవలను తిలకించి తరించడానికి వచ్చిన లక్షలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేసిన ఏర్పాట్ల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత టీటీడీ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు టీటీడీలో హిందూయేతరులు ఉండడానికి వీల్లేదని స్పష్టంగా పేర్కొన్నారు. టీటీడీలో ఉద్యోగం చేస్తున్న అన్యమతస్తులను రాష్ట్ర ప్రభుత్వ శాఖలలోకి మార్చడం లేదంటూ వీఆర్ఎస్ ఇవ్వడం చేస్తామని విస్పష్టంగా ప్రకటించారు. ఆ మేరకు ఆరా తీయగా టీటీడీలో 300 మందికి పైగా అన్యమతస్తులు పని చేస్తున్నట్లు తేలింది. ఇప్పుడు వారిని టీటీడీ నుంచి పంపేయడానికి చర్యలు తీసుకుంటోంది.
http://www.teluguone.com/news/content/ttd-transfer-18-non-hindu-employees-39-192412.html












