రామన్నా .. ఇదేందన్నా .. తెరాస నేతల పరేషాన్ ..
Publish Date:Apr 30, 2022
Advertisement
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కే.తారక రామా రావును అందరూ కేటీఆర్’ అని పిలిచినా, సన్నిహితులు, అభిమానులు మాత్రం రామన్నా, అని ముద్దుగా పిలుస్తారు. అయితే. అలాముద్దుగా పిలిచే వారీ ఇప్పుడు, ఇదేంది రామన్నా, ఈ భాషేంది రామన్నా, ,ఇదెక్కడ నేర్చినవ్’ ఎందుకంత ఫ్రస్ట్రేషన్ అని ముఖాన కాక పోయినా, చాటుమాటుగా అయినా, గుసగుసలు పోతున్నారు.ఇక రాజకీయ ప్రత్యర్ధులు అయితే, తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా’ అన్నట్లు అవే మాటలు అప్పగిస్తున్నారు.
అయితే ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అనేది కాదు, ప్రజాలు ఏమంటున్నారు? ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అనేది ముఖ్యం.అంత కంటే, పార్టీ క్యాడర్, నాయకులు ఏమనుకుంటున్నారు? ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అనేది మరింత ముఖ్యం, అయితే మా రామన్న, ఈ మధ్య కాలంలో ఎందుకనో అవేవి పట్టించుకోకుండా, తల వంపులు తెచ్చేలా మాట తూలుతున్నారని, పార్టీ నాయకులు, రామన్న అభిమానులు ఆక్షేపిస్తున్నారు. ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. ఒకప్పుడు రామన్న మాట్లాడితే, తెరాస అభిమానులే కాదు, సామాన్య ప్రజలు ముఖ్యంగా, ఉన్నత చదువులు చదువుకున్నమధ్య తరగతి ప్రజలు కూడా, శభాష్ రామన్నా, అన్న సందర్భాలున్నాయి. ఎంతైనా అమెరికా చదువులు అని ముచ్చట పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు అదే సామాన్య మధ్యతరగతి ప్రజలు, ఆయన మాట వినిపించగానే చానల్ మార్చేస్తున్నారని, చదవేస్తే ఉన్న మతి పోయిందన్నట్లు, రామన్న తీరు మారిందని పార్టీ క్యాడరే ఆశ్చర్యపోతున్నారు.
నిజమే,ఎప్పుడోనే అయన ముందరే, డిప్యూటీ స్పీకర్ పద్మా రావు వంటి పెద్దలు. ఆయన్ని కాబోయే ముఖ్యమంత్రిని ఆకాశానికి ఎత్తేశారు. ముహూర్తాలు కూడా పెట్టేశారు. అయితే ఏళ్ళు గడుస్తున్నా ఆ ముచ్చట మాత్రం తీరలేదు. సో .. ఆయనలో ఫ్రస్ట్రేషన్ ఉండడం సహజమే,అయినా, మరీ ఇంతలా బయట పడిపోవడం అవసరమ రామన్నా, అని సొంత పార్టీ నాయకులే మౌనంగానే అయినా అడుగుతున్నారు. ఈరోజు కాకపోతే రేపు, ముఖ్యమంత్రి అయ్యేది కుడా ఆయనే కదా, ఇంతలోనే ప్రజల్లో పార్టీని, పల్కాహన్ చేయడం ఎందుకని కూడా అటు పార్టీ నాయకులూ, ఇటు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
నిజమే, తెలంగాణలో ఆమాట కొస్తే ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల తీరు మారిపోయింది. రాజకీయ భాష మారిపోయింది. సభ్యతా, సంస్కారం సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. ఏది మాట్లాడవచ్చును, ఏది మాట్లాడరాదు, అనే విచక్షణ, అసలే లేదు. అంతే కాదు, బూతులు తిట్టడం మీకే కాదు, మాకూ వచ్చూ, అయినా మా నాయకుడు మాకు సంస్కారం నేర్పారు, అంటూ, సభ్యసమాజం వినలేని ‘తిట్ల పురాణం ఎత్తుకోవడంతో, ఉన్నత చదువులు చదివిన నాయకుడిగా, ఆయన మీదున్న ‘మంచి’ అభిప్రాయం కూడా చెరిగి పోతోందని అంటున్నారు. పార్టీలో, పబ్లిక్’లోనే కాదు, ఫ్యామిలీలో, బంధు వర్గంలో కూడా రామన్నా, ఇదేందన్నా అనే మాట వినవస్తోందని అంటున్నారు.
సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమస్యలు లేవా అంటే, ఉన్నాయి. అవి ఇంతకు ముందు ఉన్నాయి, ఇప్పుడూ ఉన్నాయి, ఇక ముందు కూడా ఉంటాయి.అయితే, సమస్యలు పరిష్కరించుకోవడమే లక్ష్యం అయితే, అందుకు ప్రజాస్వామ్య పద్దతిలో చర్చలు, సంప్రదింపులు వంటి చక్కని మార్గాలు ఎన్నో ఉన్నాయి. అంతేకానీ, ‘జగడమెట్లొస్తుందిరా జంగమయ్యా అంటే బిచ్చం పెట్టవే బొచ్చు ముండా’ అన్నట్లు కయ్యానికి కాలు దువ్వడం మంచిది కాదని పార్టీ పెద్దలే అంటున్నారు.
గతంలో రాహుల్ గాంధీ, ఇలాగే 2019 ఎన్నికల సమయంలో ఇలాగే నోరు పారేసుకున్నారు. చౌకీదార్ చోర్’ అంటూ ప్రధాని మోడీని దుర్భాషలాదారు. ఫలితం ఏమిటో వేరే చెప్పనక్కర లేదు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన వందేళ్ళు పైబడిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో చూస్తూనే ఉన్నాం. ఎన్నికల వ్యూహకర్తగా రాజకీయ వ్యాపారం చేస్తున్న ప్రశాంత్ కిశోర్ పాఠాలు చెపుతుంటే, నాలుగు పదులకు పైగా దేశాన్ని పాలించిన, మంత్రులుగానే పదేళ్ళు, పాతికేళ్ళు అనుభవం పార్టీ పెద్దలు చేతులు కట్టుకుని వినవలసిన పరిస్థితికి చేరుకున్నారు. అఫ్ కోర్స్, తెరాస ఎనిమిదేళ్ళకే పీకే శరణు వేడింది అనుకోండి, అయినా,అ విషయం పక్కన పెట్టినా, అటు కేంద్రాన్ని, ఇటు ఇరుగు పొరుగు రాష్ట్రాలను చులక చేసి మాట్లాడడం, మనకే మంచి కాదని తెరాస నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయి’ అనే పరిస్థితి తెచ్చుకోవద్దని, తెరాస అభిమానులే గుసగుసలు పోతున్నారు.
http://www.teluguone.com/news/content/trs-leaders-unhappy-over-ktrs-recent-utterances--25-135241.html





