నవ్వుల పాలైనా నవ్వులేనా? జగన్ తీరుపట్ల జనాగ్రహం..
Publish Date:Apr 30, 2022
Advertisement
అడుసు తొక్కనేల .. కాలు కడగనేల’ అనేది సామెత. ఇప్పుడు ఆ సామెతను నిజం చేశారు, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుట్ల తారక రామ రావు. నిజమే కావచ్చును, ఆంధ్ర ప్రదేశ్’లో కరెంటు కష్టాలు నిజం కావచ్చును. నీళ్ళు లేని మాటా నిజం కావచ్చును. రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయన్న మాటలోనూ నిజం లేక పోలేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుభవ రాహిత్యం, అవినీతి ప్రస్థానం కారణంగా ప్రాధాన్యతలు తారు మారు కావడం, ఆంధ్ర ప్రదేశ్ అప్పుల్లో కూరుకు పోవడం కూడా నిజమే కావచ్చును.
కానీ, తెలంగాణలో అన్నీ బాగున్నట్లు తగుదునమ్మా, అని పొరుగు రాష్ట్రం వ్యవహారాలో మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ వేలు పెట్టడం ఏమిటనే ప్రశ్న సామాన్యులలో వినవస్తోంది. ఇది ఐదు కోట్ల ఆంధ్రులను అవమాన పరిచడం కాదా అని. ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు, ‘పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని’ వ్యాఖ్యలు చేయడం, ఇప్పుడు నింపాదిగా, అన్యాపదేశంగా అలాంటి వ్యాఖ్యలు చేశానే గానీ, మరే దురుద్దేశం లేని సంజాయిషీ ఇచ్చుకోవడం, ఆయన విషయం ఏమో కానీ, తెలంగాణ ప్రజలకు తలవంపులు తెచ్చిందని అంటున్నారు. మాములుగా అయితే, కేటీఆర్’ వ్యాఖ్యాలకు అంత ప్రాధాన్యత ఉండేది కాదేమో , కానే, ఇటీవల ఆయన వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారని అందుకే, ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.
విషయంలోకి వస్తే, క్రెడాయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'పక్క రాష్ట్రంలో కరెంట్, నీళ్లు లేవని.. రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయని మిత్రులు చెప్పారు.అక్కడ పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని చెప్పారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు. తెలంగాణ గురించి నేను డబ్బా కొట్టుకోవడం కాదు.. పక్క రాష్ట్రం వెళ్లి మీరే చూడండి. అక్కడికి వెళ్లి చూసి వస్తే మీరే మమ్మల్ని అభినందిస్తారు. కొన్ని మాటలంటే కొంత మందికి నచ్చకపోవచ్చు కానీ.. అవి వాస్తవాలు.' అని కేటీఆర్. నిజానికి ఆయన ఎవరో మిత్రులు చెప్పారని అంటూ, చెప్పుకొచ్చినా,నిజానికి అది ఆయన అభిప్రాయమే అని వేరే చెప్ప నక్కరలేదు. నిజానికి, పొరుగు రాష్ట్రం ఏపీని ఇలా తూలనాడి మాట్లాడడం తెరాస నాయకులకు కొత్త కాదు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఏకంగా అసెంబ్లీలోనే, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర విభజ జరిగితే తెలంగాణ అంధకారంలోకి పోతుందని చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ, ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఏపీ అంధకారంలో ఉందని అన్నారు. అలాగే, ఒకరిద్దరు తెలంగాణ మంత్రులు కూడా ఏపీ ఆర్థిక పరిస్థితిని అవహేళన చేస్తూ మాట్లాడారు. ఏపీలోఅప్పు పుట్టనిదే పూట గడవదని ఎద్దేవా చేశారు.
అయితే, ఇప్పుడు కేటీఆర్, అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఏపీ గురించి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదా అంటే, లేదని కాదు, జగన్ రెడ్డి మూడేళ్ళ సుందర ముదనష్ట పాలనలో కేవలం విద్యుత్, రోడ్లు, నీళ్ళు మాత్రమే కాదు, మౌలిక సదుపాయాల కల్పన మొత్తానికి మొత్తంగా అటకెక్కింది. మౌలిక సదుపాయాలు లేకుండా, రాష్ట్రం అభివృద్ధి చెందదు. అందుకే, మూడేళ్ళలో రాష్ట్రానికి చెప్పుకోదగిన పెట్టుబడులు కోటగా రాక పోగా, గతంలో చంద్రబాబు హయమలో వచ్చిన పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్లి పోతున్నట్లు వార్త లోస్తున్నాయి. అయినా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ఆ వైపుకు దృష్టి మరల్చ లేదు. అప్పులు చేయడం, మీట నొక్కి ఓటర్ల ఖాతాల్లోకి బట్వాడా చేయడం, కానీ, అభివృద్ధి గురించిన అలోచన జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఏ కోశానా లేదు. అందుకే, ఇరుగు పొరుగు రాష్ట్రాలే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను అనేక సందర్భాలో తప్పు పట్టింది. హెచ్చరికలు చేసింది. అయినా దున్నపోతు మీద వర్షం చందంగానే కథ నడిచి పోతోందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఇప్పుడు కూడా, పొరుగు రాష్ట్రం నుంచి అవమానకరమైన వ్యాఖ్యలు వస్తున్నా, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా కేసీఆర్, కేటీఆర్ ఇతర మంత్రులు వ్యాఖ్యలు చేసినా ఎవరెవరో స్పందిస్తున్నారు కానీ, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం నోరు మెదపలేదు. చిద్విలాసంగా తమ ట్రేడ్ మార్క్ నవ్వు నవ్వుకుంటున్నారని సామాన్య ప్రజలు, ఆవేదన వ్యక్త పఅరుస్తున్నారు.అందుకే మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు, బాధ పడినట్లు, కేటీఆర్ వ్యాఖ్యలు బాధిస్తున్నాయని, అంటున్నారు. ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.
http://www.teluguone.com/news/content/public-fumes-at-ktr-for-his-comments-on-state-of-affairs-in-ap-25-135239.html





