తానే మారెనా..వ్యూహమే మార్చెనా..? కేసీఆర్ వ్యూహం మార్పు కారణమేంటి?
Publish Date:Apr 30, 2022
Advertisement
టూ బర్డ్స్ ఎట్ వన్ షాట్ అన్నట్లుగా బిజెపి ఇటు టిఆర్ఎస్ ని, అటు కాంగ్రెస్ ని ఒకే సారి టార్గెట్ చేసిందని గ్రహించారేమో.. సిఎం కెసిఆర్ తన వ్యూహాన్ని సమూలంగా మార్చేశారు. ప్రశాంత్ కిషోర్ భుజాలపై తుపాకి పెట్టి టిఆర్ఎస్ ను, కాంగ్రెస్ ను రెండింటిని ఏకకాలంలో లక్ష్యం చేసింది బిజెపి. ఈ నేపథ్యంలోనే జాతీయ రాజకీయాలపై దృష్టి పెడితే.. రాష్ట్ర రాజకీయాలలో తమ ఆధిపత్యానికి గండి పడే అవకాశాలు ఉన్నాయన్న బావనతోనే తెురాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తన వ్యూహాన్ని మార్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ వ్యూహం గ్రహింపునకు రానంత కాలం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెలుగు వెలగాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచించి, ఆ దిశగా అడుగులు వేసిన కేసీఆర్.. బీజేపీ ఎత్తుగడ గ్రహించిన మరుక్షణమే తన వ్యూహాలను మార్చుకున్నారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని ముందుకు సాగితే.. తెలంగాణలో టిఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న అంచనాకు కేసీఆర్ రావడంతోనే...దిశ మార్చుకుని, వ్యూహాలను మార్చుకుని రాష్ట్ర రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించాలన్న నిర్ణయానికి వచ్చారన్నది పరిశీలకులు అభిప్రాయం. 2018 ఎన్నికల్లో తెరాసకు అప్పటి రాజకీయ సమీకరణాలు బాగా కలిసి వచ్చాయి. అదును చూసి ముందస్తుకు వెళ్లిన కేసీఆర్ ఆశించిన దాని కన్నా ఎక్కువగా ప్రయోజనం పొందారు. అందుకుకారణం అప్పటి ఎన్నికలలో కాంగ్రెస్, టిడిపిలు పొత్తు పెట్టుకుని పోటీ చేయడమే. కాంగ్రెస్, తెలుగుదేశంల పొత్తు కేసీఆర్ కు బాగా కలిసి వచ్చింది. ఆయాచితంగా మరోసారి సెంటిమెంట్ అనే బలమైన ఆయుధాన్ని ఆయన చేతికి ఇచ్చింది. మళ్లీ తెలంగాణను దోచుకునేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి వస్తున్నాయంటూ ప్రచారంతో ఊరూవాడా ఏకం చేసేశారు. మరోసారి తెలంగాణ ఉద్యమం నాటి స్థాయిలో సెంటిమెంటును రగిల్చారు. ఫలితంగా తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు భారీ మూల్యం చెల్లించుకున్నాయి. ఇప్పుడు అలాంటి అవకాశాన్ని బీజేపీ అందిపుచ్చుకునేందుకు ప్రశాంత్ కిశోర్ రూపంలో అవకాశం వచ్చింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏక కాలంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తోనూ, తెలంగాణలో కేసీఆర్ తోనూ చర్చలు జరపడంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ లు కలిసిపోతున్నాయన్న ప్రచారానికి బీజేపీ తెరతీసింది. 2018 ఎన్నికలలో తెరాస ఎలాగైతే కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తును ఉపయోగించుకుని ఎలా రాజకీయ లబ్ధి పొందిందో...సరిగ్గా అలాగే కాంగ్రెస్, తెరాస ములాఖత్ పేరుతో బీజేపీ లబ్ధి పొందేందుకు ఉపయోగించుకోవాలనుకుంది. ఈ ఎత్తుగడను సకాలంలో పసిగట్టిన కేసీఆర్ ఒక్క సారిగా తన వ్యూహాలను మార్చేసి రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెట్టాలన్న నిర్ణయానికి వచ్చేశారు. సరే కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు పీకే కాంగ్రెస్ చేరికకు ఆదిలోనే హంస పాదు పడింది. దీంతో పీకే వ్యూహాలను రాష్ట్రంలో అనుసరించడానికి కేసీఆర్ కు ఎలాంటి అభ్యంతరాలు ఎదురు అవ్వని పరిస్థితి వచ్చింది. అయితే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న కోరికను మాత్రం కేసీఆర్ మరోసారి పక్కన పెట్టక తప్పని రాజకీయ అనివార్యతను బీజేపీ వ్యూహాత్మకంగా కల్పించింది. అందుకే జాతీయ అజెండాకే పరిమితమై.. మారిన తన వ్యూహాన్ని ఇటీవల ప్లీనరీ వేదికగా కేసీఆర్ ఆవిష్కరించారు.
http://www.teluguone.com/news/content/kcr-changes-stratagy-keep-aside-naional-politcs-25-135243.html





