మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై ఉదయ్ కృష్ణారెడ్డి దాడి చేసినట్లు నిర్ధారణ..!
Publish Date:Jul 28, 2026
Advertisement
తాజాగా బాధితురాలి మెడపై గొంతు నులిమినట్లు గాయాల ఆనవాళ్లు..! పోలీసుల అదుపులో ఉదయ్ కృష్ణారెడ్డి..! ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధిత మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై ఉదయ్ కృష్ణారెడ్డి దాడి చేసినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు సమాచారం. కేసు నమోదైన రోజైన జూలై 18న బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు తమ నివేదికలో కీలక అంశాలను వెల్లడించారు. బాధితురాలి మెడపై గొంతు నులిమినట్లు గాయాల ఆనవాళ్లు, చెంపపై దెబ్బల వల్ల కమిలిన గాయాలు, అలాగే ఎడమ కాలిపై గాయం ఉన్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించినట్లు తెలుస్తోంది. ట్రైనీ ఐపీఎస్ అధికారి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని మిర్యాలగూడ సమీపంలో మంగళవారం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని, అనంతరం అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో ఈ వేధింపులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన నగర పోలీస్ కమీషనర్, ఈ కేసు విచారణ బాధ్యతలను పోలీసు శాఖలోని ప్రత్యేక 'ఉమెన్స్ సేఫ్టీ వింగ్' కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుపై రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ స్పందిస్తూ.. చట్ట నిబంధనల ప్రకారమే సమగ్ర విచారణ జరుపుతామని వెల్లడించారు. ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసిన సెక్షన్లు, సేకరించిన ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని, ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.మరోవైపు, తనపై వస్తున్న ఆరోపణలను ఉదయ్ కృష్ణారెడ్డి పూర్తిగా ఖండించారు. తన నానమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతోనే స్వగ్రామానికి వెళ్లానని, తాను పరారీలో లేనని తెలిపారు. న్యాయవ్యవస్థపై, పోలీస్ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.గ్రామీణ నేపథ్యం ఉన్న తనకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నోటీసులు అందలేదని, విచారణకు సంపూర్ణంగా సహకరిస్తానని ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు .పోలీస్ శిక్షణ పొందుతున్న ఉన్నతాధికారుల స్థాయిలోనే ఇలాంటి ఆరోపణలు రావడంతో ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బాధితురాలికి న్యాయం జరిగేలా ఉమెన్స్ సేఫ్టీ వింగ్ బృందం త్వరలోనే విచారణ పూర్తిచేసి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. Trainee IPS Uday Krishna Reddy, SIT, harassment case, Attapur Police, oollapalem villeage, DCP Lavanya, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand
http://www.teluguone.com/news/content/trainee-ips-uday-krishna-reddy-36-227408.html




