స్పీడ్, క్వాలిటీ, డెలివరీ లక్ష్యంగా రాజధాని పనులు జరగాలి : సీఎం చంద్రబాబు
Publish Date:Jul 28, 2026
Advertisement
రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం మరింత పెరగాలని....అనుకున్న సమయానికి ప్రతి ప్రాజెక్టు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్పీడ్, క్వాలిటీ, డెలివరీ లక్ష్యంగా రాజధాని పనులు జరగాలని ముఖ్యమంత్రి అన్నారు. గతంతో పోల్చితే పనుల్లో వేగం కొంత మేర పెరిగినా... ఇంకా వేగం పెంచాలన్నారు. ఒక నిర్మాణ సంస్థగా రాజధాని పనులు చేపట్టడం గొప్ప అవకాశమని...ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రభుత్వం చూస్తున్న నేపథ్యంలో... పనుల్లో ఎక్కడా జాప్యం ఉండకూదని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో రాజధాని అమరావతి నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజధానిలో 95 ప్రాజెక్టులకు సంబంధించి రూ.50,999 కోట్ల విలువైన పనులు చేపట్టగా...నెలకు కనీసం 7.92 శాతం పనులు జరగాలని సూచించారు. భూసేకరణ, నిధుల సమీకరణ, అనుమతులు, డిజైన్లు వంటి అంశాల్లో అన్ని శాఖలు, ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అమరావతి అంటే... కేవలం 29 గ్రామాల సమాహారంగా కాకుండా విజయవాడ, గుంటూరుతో కలిపి చూడాలన్నారు. అందుకు తగిన విధంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల ప్రాజెక్ట్ పనులు జరగాలన్నారు. రోడ్ల నిర్మాణంతో పాటు పచ్చదనం పెంపుపైనా దృష్టిపెట్టాలని సూచించారు. తాను కూడా స్వయంగా ఇకపై రాజధాని పనులను పరిశీలిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో మంత్రి నారాయణ, సీఎస్ సాయిప్రసాద్, ఉన్నతాధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. CM Chandrababu reviews Amaravati works with officials, Speed, quality, delivery, Secretariat, AP Goverment,Minister Narayana, CS Sai Prasad
http://www.teluguone.com/news/content/cm-chandrababu-reviews-amaravati-works-with-officials-36-227406.html





