గరుడ పురాణం-2.. పోలవర్రీ.. సోరెన్ రావలెన్.. టాప్‌న్యూస్..
Publish Date:Mar 4, 2022
Advertisement
1. వైసీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు.. వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారంటూ హీరో శివాజీ సంచలన ప్రకటన చేశారు. ఓటుకు 50 వేలు ఇచ్చినా ఈసారి వైసీపీ గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని శివాజీ అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోందని.. మూడు రాజధానుల అంశాన్ని ఎన్నికల అస్త్రంగా మార్చుకుని వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని శివాజీ అన్నారు. 2. టీడీపీ హయాంలో పోలవరాన్ని పరిగెత్తించి 72 శాతం పూర్తి చేశామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ఉంటే ఈపాటికి 100 శాతం పూర్తయ్యేదన్నారు. పోలవరంలో అవినీతికి పాల్పడ్డామన్నారు.. నిరూపించారా? అని ప్రశ్నించారు. అభివృద్ధి చేతకాని సీఎం దాని గురించి మాట్లాడతారని అన్నారు. 3. పోలవరం ప్రాజెక్ట్ పురోగతి, ఆర్ అండ్ ఆర్ పై కేంద్ర మంత్రి షెకావత్ సమీక్ష నిర్వహించారు. సీఎం జగన్‌తో భేటీలో నిర్వాసితులకు పరిహారంపై షెకావత్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. పునరావాస కల్పన కేవలం 20 శాతమే పూర్తి కావడంపై చర్చించారు. 194 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి అవసరమయ్యే.. భూసేకరణ, పునరావాస కార్యక్రమాలపై కేంద్రమంత్రి ఆరా తీశారు. 4. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర పోలీసులపై మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. పార్కింగ్ చేసి ఉన్న మంత్రి పేర్ని నాని కారును అక్కడి నుంచి తీయాలని పోలీసులు చెప్పారు. కారు తీయమన్నది ఎవరంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ, డీఐజీ కార్లు పార్క్ చేసి ఉండటాన్ని చూసి పేర్నినాని మండిపడ్డారు. ‘తమాషాలు చేస్తున్నారా.. నేను ఇన్‌చార్జ్ మంత్రిని’ అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడితో పండుగ అయిపోలేదని పేర్ని నాని హెచ్చరించారు. 5. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. తామిద్దరం జాతీయ రాజకీయాలపై చర్చించామని.. త్వరలోనే మరికొందరు నేతలను కలుస్తానని కేసీఆర్ చెప్పారు. దేశానికి కొత్త దిశా నిర్దేశం కావాలన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదు.. అనుకూలం కాదని అన్నారు. దేశ హితం కోసమే తమ ప్రణాళిక అని.. తమది ఏ ఫ్రంటో తర్వాత చెబుతామని కేసీఆర్ ప్రకటించారు. 6. సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌కి భయపడి వ్యూహకర్త పీకేను తెచ్చుకున్నారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనడానికి ఇదే తార్కాణమన్నారు. కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో 40 లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేసి టీ-కాంగ్రెస్ దేశంలో నెంబర్‌వన్‌గా నిలిసిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. 7. విజయనగరం జిల్లా, కురుపాం మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో నిద్రిస్తున్న 8వ తరగతి విద్యార్థుల్ని పాము కాటు వేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సొంత నియోజకవర్గంలో ఇలా జరగడం దారుణమన్నారు. పిల్లల్ని సురక్షితంగా చూసుకోవాల్సిన గురుకులాలను జగన్ రెడ్డి సర్కారు పట్టించుకోకపోవడం లేదని లోకేష్ విమర్శించారు. 8. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. రాజధాని ఎక్కడుండాలన్న అంశం రాష్ట్ర పరిధిలోనిదేనని కేంద్రం చెప్పిందని గుర్తుచేశారు. అమరావతి ప్రాంతం శాసన రాజధానిగా ఉంటుందని.. రాజధానిపై ప్రభుత్వానికి స్పష్టత ఉందని హోంమంత్రి సుచరిత అన్నారు. 9. ఏపీ రాజధాని అంశంలో పకడ్బందీ జడ్జిమెంట్ వచ్చిందన ఎంపీ రఘురామ అన్నారు. హైకోర్టు తీర్పుపై హోంమంత్రి సుచరిత వ్యాఖ్యలు సరైన విధంగా లేవని రఘురామ విమర్శించారు. రాజధాని విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లినా లాభం లేదని, ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలో కోర్టు చెంప దెబ్బలు వేస్తోందని ఎద్దేవా చేశారు. సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలని.. అసెంబ్లీ రద్దు చేసి జగన్ ఎన్నికలకు వెళ్లాలని రఘురామ డిమాండ్ చేశారు. 10. రాష్ట్రపతి ఎన్నికకు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌ను అభ్యర్థిగా రంగంలోకి దించాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆజాద్ ఇప్పటికే వివిధ పార్టీల నేతలతో చర్చలు ప్రారంభించారని సమాచారం. ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షుడిగా, ప్రస్తుతం వైఎస్ జగన్ మంత్రివర్గంలో ఉన్న ఒక సీనియర్ నేతను ఇటీవల ఆజాద్ ఢిల్లీ పిలిపించుకుని ఈ విషయమై మాట్లాడారని అంటున్నారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తనకు మద్దతిచ్చే విషయమై జగన్‌ను ఒప్పించాల్సిందిగా ఆజాద్ ఆయన్ను కోరినట్టు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/top-news-7pm-25-132606.html





