రగులుతున్న ఏపీ.. సమర్ధించుకున్న సీఎం.. గాంధీలో మంటలు.. టాప్ న్యూస్@ 1PM
Publish Date:Oct 20, 2021
Advertisement
ఏపీలో ప్రజలకు బ్రతికే హక్కు లేదని...ప్రజల ప్రాధమిక హక్కులను హరిస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు. అధికార పార్టీ అరాచకాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర డీజీపీ కనుసన్నల్లోనే టీడీపీ నేతలపై దాడులు జరిగాయని ఆరోపించారు. పోలీసుల సహకారంతోనే టీడీపీ ఆఫీస్‌పై దాడి చేశారన్నారు. ----- మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంద్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న పరిటాల సునీత, శ్రీరామ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలు కూడా వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులతో పరిటాల శ్రీరామ్ వాగ్వాదానికి దిగారు. చివరకు పరిటాల సునీత, శ్రీరామ్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు --- బెజవాడలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సిటీ టెర్మినల్ బస్ స్టాండ్ వద్ద టీఎన్‌టీయూసీ నేతలు రఘురామరాజు, పరుచూరి ప్రసాద్ ఆందోళన చేయగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్టు సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల ఓవర్ యాక్షన్ కారణంగా టీఎన్‌టీయూసీ నాయకులు పరుచూరి ప్రసాద్‌కు కాలు ఫ్రాక్చర్ అయ్యింది. నడవలేని స్థితిలో ఉన్న ప్రసాద్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. --- ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా రెచ్చిపోయి బూతులు తిడుతున్నారని.. తమపై ఆప్యాయత చూపే అభిమానులు వాళ్ల బూతులు వినలేక బీపీ వచ్చి రియాక్ట్ అవుతున్నారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. సొంత పార్టీ దాడులపై జగన్ స్పందించారు. ప్రభుత్వాన్ని దారుణంగా బూతులు తిడుతున్నారు.. ఇలాంటి బూతులు ఎప్పుడూ వినలేదు. కావాలని తిట్టించి రెచ్చగొడుతున్నారు. కులాల, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని అన్నారు. ---- తెలుగు దేశం పార్టీపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీపైన, దాడులను ఖండించిన ప్రతిపక్షాలపైన మంత్రి విరుచుకుపడ్డారు. టీడీపీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతామన్నారు. మావోయిస్ట్ పార్టీకి టీడీపీకి తేడాలేదని వ్యాఖ్యానించారు. బీజేపీతో ఉన్నానంటూ చంద్రబాబు పార్టనర్ పవన్ కళ్యాణ్ సమర్ధన సిగ్గుచేటన్నారు. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చంద్రబాబుకు వత్తాసు పలకటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.. ---- శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొయ్యం గ్రామ సమీపంలో బుధవారం ఉదయం ఓ ప్రైవేటు స్కూల్ బస్సు అదుపుతప్పి చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ప్రమాద సమయంలో బస్సులో ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు. మృతి చెందిన విద్యార్థిగా మైలపల్లి రాజుగా గుర్తించారు. మిగిలిన విద్యార్థులను స్థానికులు రక్షించారు. --- గాంధీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌తో నాలుగో అంతస్తులో ఒక్కసారి మంటలు చెలరేగాయి. దీంతో నాలుగో అంతస్తు నుంచి మొదటి అంతస్తు వరకు పెద్ద ఎత్తున్న మంటలు వ్యాపించాయి. గాంధీ ఆస్పత్రి సిబ్బంది మంటలను గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు -------- హైదరాబాద్ - విజయవాడ హైవేపై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.4 కోట్ల హవాలా డబ్బును చిట్యాల పోలీసులు పట్టుకున్నారు. కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళుతున్న TS10 EY 6160 నెంబర్ గల కారులో డబ్బు పట్టుబడింది. --- బౌద్ధ తీర్థయాత్ర కేంద్రమైన ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్‌లో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారంనాడు దేశ ప్రజలకు అంకితం చేశారు. ఈ అంతర్జాతీయ విమాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు బుద్ధభగవానుడు మహాపరినిర్వాణ స్థలాన్ని సందర్శించే సౌలభ్యం సుగమమవుతుంది. ---
http://www.teluguone.com/news/content/top-news-25-124854.html





