గాంధీ హాస్పిటల్ లో మంటలు.. రోగులంతా సేఫ్..
Publish Date:Oct 20, 2021
Advertisement
తెలంగాణలో పేదల పెద్దాస్పత్రిగా పిలుచుకునే, 20 నెలలుగా కొవిడ్ మహమ్మారి సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో నాలుగో అంతస్తులో ఒక్కసారి మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే నాలుగో అంతస్తు నుంచి మొదటి అంతస్తు వరకు పెద్ద ఎత్తున్న మంటలు వ్యాపించాయి. గాంధీ ఆస్పత్రి సిబ్బంది మంటలను గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ అవ్వటంతో గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగిందని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్(డీఎంఈ)రమేష్ రెడ్డి తెలిపారు. అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని డీఎంఈ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీలోనే ప్రత్యేకంగా అగ్నిమాపక సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి 15 నిమిషాల్లో మంటలను అదుపులోకి తెచ్చారని అన్నారు. ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని.. పరికరాలు పాడవ్వలేదని చెప్పారు. 120 పేషేంట్లను పక్క వార్డులోకి తరలించామన్నారు. 2 రోజుల్లో అంత క్లియర్ చేస్తామని ఆయన తెలిపారు. ఎలక్ట్రికల్ వాళ్లకు పక్క వార్డులలో కూడా ఉన్న బోర్డులను చెక్ చెయ్యమని చెప్పామన్నారు. అన్ని ఆస్పత్రులలో ఫైర్ సిబ్బంది ఉండేలా చూస్తామని తెలిపారు. పెద్ద ఆస్పత్రి కాబట్టి ఒక స్టేషన్ పెట్టామని...భారత దేశంలోనే గాంధీలో ఫైర్ స్టేషన్ ఉందని అన్నారు. మొదట్లో డాక్టర్లకు మాక్ డ్రిల్ నిర్వహించామని.. మళ్ళి ఒకసారి మాక్ డ్రిల్‌ని నిర్వహించి అవగాహన కల్పిస్తామని చెప్పారు. సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశు, పాడి, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాను హుజురాబాద్ ఎలక్షన్ క్యాంపింగ్‌లో ఉన్నానని ఆస్పత్రిలో పేదల వైద్య సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం ఎప్పుడు వైద్య సేవలకు పూర్తి సహకారాన్ని అందిస్తుందన్నారు. తాను హైదరాబాద్ చేరుకోగానే గాంధీని సందర్శిస్తానని మంత్రి తలసాని చెప్పారు.
http://www.teluguone.com/news/content/fire-accident-in-gandhi-hospital-patients-safe-25-124849.html





