టీఎంసీ సీనియర్ నేత, మాజీ మంత్రి సుజిత్ బోస్ అరెస్టు
Publish Date:May 11, 2026
Advertisement
మున్సిపల్ ఉద్యోగాల నియామకాల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి టీఎంసీ సీనియర్ నేత, మాజీ మంత్రి సుజిత్ బోస్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం ( మే 11) రాత్రి అరెస్ట్ చేశారు. కోల్‌కతాలోని ఈడీ కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు విచారించిన అనంతరం సుజిత్ బోస్ ను అరెస్టు చేశారు. 2014 నుంచి 2018 మధ్య కాలంలో జరిగిన మున్సిపల్ నియామకాలలో అవకతవకలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. సౌత్ దమ్ దమ్ మున్సిపాలిటీతో పాటు పలు పురపాలక సంస్థల్లో స్వీపర్లు, క్లర్కులు, డ్రైవర్ ఉద్యోగాలను అక్రమ పద్ధతిలో భర్తీ చేశారనీ, దాదాపు 150 మందికి పైగా అభ్యర్థుల నుంచి భారీగా వసూలు చేసి వారికి ఉద్యోగాలు కల్పించడంలో సుజిత్ బోస్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు సంస్థ తేల్చింది. ఈ అక్రమ నియామకాల ద్వారా వచ్చిన సొమ్ముతో సుజిత్ బోస్ విలాసవంతమైన ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఆయన బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు జమ అయినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. గతంలో టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్ విచారణలో భాగంగా అయన్ శీల్ అనే వ్యక్తి నివాసంలో దొరికిన పత్రాలతో మున్సిపల్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కొద్ది కాలంగా ఈ కేసులో సుజిత్ బోస్‌కు కోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించినప్పటికీ.. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయనను ఇప్పుడు ఈడీ అరెస్టు చేయడం ప్రాథాన్యత సంతరించుకుంది. సుజిత్ బోస్‌ను మంగళవారం ( మే 12) ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. విచారణలో భాగంగా లభించిన డిజిటల్ సాక్ష్యాలు, రికార్డులను అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు. ఈ కుంభకోణంలో మరికొంతమంది కీలక నేతల ప్రమేయం ఉందని ఈడీ అనుమానిస్తోంది.
http://www.teluguone.com/news/content/tmc-senior-leader-sujit-bose-arrested-36-219493.html





