అబుదాబీలో రోడ్డు ప్రమాదం.. భారత్ కు చెందిన ముగ్గురు చిన్నారులు మృతి
Publish Date:Jan 5, 2026
Advertisement
విదేశీ గడ్డపై ఉపాధి పొందుతూ ఆనందంగా జీవితస్తున్న ఒక భారతీయ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అబుదాబిలో ఆదివారం (జనవరి 5) తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో వారి వారి ఇంటి పని మనిషి ప్రాణాలు కోల్పోయింది. కేరళ మలప్పురం జిల్లా కిళిస్సేరికి చెందిన అబ్దుల్ లతీఫ్ కుటుంబం దుబాయ్‌లో నివసిస్తోంది. వీరు తమ ఐదుగురు పిల్లలతో కలిసి అబుదాబిలో జరుగుతున్న ప్రసిద్ధ లివా ఫెస్టివల్ కు వెళ్లి తిరిగి దుబాయ్ వస్తుండగా షాహామా సమీపంలో వీరి వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. కారు వేగంగా పల్టీలు కొట్టడంతో లోపల ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా ఈ ప్రమాదంలో లతీఫ్ కుమారులు ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. అందులో 14 ఏళ్ల అషాజ్, 12 ఏళ్ల అమ్మార్, ఐదేళ్ల అయ్యష్‌లతో పాటు వారి ఇంట్లో పని చేస్తున్న బుష్రా అనే మహిళ అక్కడికక్కడే కన్నుమూశారు. అల్లారుముద్దుగా పెరుగుతున్న ముగ్గురు కొడుకులు కళ్ల ముందే ప్రాణాలు విడవడం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రమాద సమయంలో అబ్దుల్ లతీఫ్, రుక్సానా, మిగిలిన ఇద్దరు పిల్లలు ఎజ్జా (10), అజ్జామ్ (7)లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారు అబుదాబిలోని షేక్ షక్బౌట్ మెడికల్ సిటీలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు.
http://www.teluguone.com/news/content/three-indian-kids-of-one-family-fied-in-road-accident-36-212022.html





