బీజేపీ మెడకు పెగాసస్
Publish Date:Jan 31, 2022
Advertisement
పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైన సమయంలో కేంద్ర సర్కారుకు పెగాసస్ అంశం గుదిబండగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. పలువురు జర్నలిస్టులు, విపక్షాల నేతలకు సంబంధించిన మొబైల్ ఫోన్లను మోడీ సర్కారు ట్యాప్ చేస్తోందంటూ రెండేళ్ల క్రితం నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య హక్కులకు, వ్యక్తుల ప్రైవసీకి భంగకరంగా మారిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ కేసు కాస్తా సుప్రీంకోర్టు గడప తొక్కడంతో సుప్రీంకోర్టు ఇద్దరు సైబర్ నిపుణులను నియమించింది. వారు దీనిపై స్టడీ చేసి కోర్టుకు రాతపూర్వక నివేదికలను సమర్పించారు. ఆ రిపోర్టు ప్రకారం ప్రాథమికంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమేనని వారు ధ్రువీకరించారు. ఆ ఇద్దరిలో ఒక సైబర్ నిపుణుడు ఏడు ఐ-ఫోన్లను పరిశీలించగా వాటిలో రెండు ఫోన్లు పెగాసస్ మాల్ వేర్ ద్వారా ట్యాప్ అయినట్లు తన ఫోరెన్సిక్ స్టడీలో తేలిందని సుప్రీం కోర్టుకు తెలియజేశారు. ఇక మరో సైబర్ నిపుణుడు ఆరు ఆండ్రాయిడ్ ఫోన్లపై స్టడీ చేయగా ఆ ఫోన్లు అన్నీ కూడా పెగాసస్ తో ఎఫెక్ట్ అయ్యాయని కోర్టుకు చెప్పారు. నాలుగు ఫోన్లలో పెగాసస్ తాలూకు ఇతర వెర్షన్స్ ప్రవేశించగా.... రెండు ఫోన్లలో పెగాసస్ ఒరిజినల్ వెర్షన్ తాలూకు వేర్వేరు వెర్షన్స్ ప్రవేశించాయని, ఆ ఆనవాళ్లు ఇప్పటికీ ఆ ఫోన్లలోనే ఉన్నాయంటూ అఫిడవిట్ సమర్పించారు. దీంతో కోర్టు ముందుకు కీలకమైన సమాచారం చేరినట్టయింది. ఇజ్రాయెల్ కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ ఎన్ఎస్ఓ కు చెందిన పెగాసస్ ను ఇండియాలో ప్రతిపక్షాల సమాచారం తెలుసుకునేందుకు వాడుతున్నారని పలువురు నేతలు ఫిర్యాదులు చేశారు. రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్ వంటి యాంటీ బీజేపీ వ్యక్తులే గాక ప్రభుత్వంలోని పలువురు బ్యూరోక్రాట్స్ ఫోన్లను కూడా ట్యాప్ చేశారని పలు మీడియా సంస్థలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో సైబర్ నిపుణులు కోర్టుకు వెల్లడించిన వివరాలతో బీజేపీ నేతలు ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తలనొప్పులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మరోవైపు.. ఎవరైనా వ్యక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నట్టు అనుమానం వస్తే వారి కదలికలపై నిఘా ఉంచడం, వారి ఫోన్లపై కన్నేసి ఉంచడం ప్రభుత్వానికి గల సార్వభౌమాధికారమే అవుతుందని, వారి వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తే అప్పుడు అభ్యంతరం తెలపాలన్న వాదనలు కూడా లేకపోలేదు. ఈ క్రమంలో కోర్టు ఏం చెప్తుంది... ప్రభుత్వం ఏం వివరణ ఇస్తుంది... ఆఖరుకు ఈ అంశం ఎటువైపు మళ్లుతుందీ అన్నది వేచిచూడాలి.
http://www.teluguone.com/news/content/the--effect-of-pegasus-on-bjp-39-130999.html





