ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రంతో ఏపీ పోటీ పడగలదా?
Publish Date:Jul 25, 2014
Advertisement
సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఐటీ రంగం అద్భుతమైన ప్రగతిని సాధించడానికి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాన కారణం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాల దృష్టీ ఐటీ రంగంపై కేంద్రీకృతమై వుంది. ఐటీ రంగంలో తమ రాష్ట్రమే అగ్ర స్థానంలో వుండాలన్న బలమైన కోరిక రెండు రాష్ట్రాల్లోనూ వుంది. అయితే కొంతమంది పరిశీలకులు తెలంగాణ రాష్ట్రానికి ఐటీ రంగంలో ఉజ్వల భవిష్యత్తు వుంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ని చూపిస్తున్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు అయిన కల్వకుంట్ల తారక రామారావు ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దూసుకువెళ్తున్నారు. బాగా చదువుకున్న వ్యక్తి, విదేశాలలో ఉన్నత ఉద్యోగాలు చేసిన వ్యక్తి, అద్భుతమైన కమ్యునికేషన్ స్కిల్స్ వున్న వ్యక్తి అయిన కేటీఆర్ హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి చురుగ్గా వ్యహరిస్తున్నారు. కేటీఆర్‌లోని చురుకుదనం, కార్యదక్షతతోపాటు వడ్డించిన విస్తరిలా వున్న హైదరాబాద్ కూడా తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో అద్భుత ఫలితాలను సాధించడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఐటీ రంగానికి సంబంధించిన అనేక సెమినార్లు నిర్వహించడం, విదేశీ ప్రతినిధులను కలవటం, అనేక ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నమై వున్నారు. మంత్రిగా కేటీఆర్ పనితీరును చూస్తుంటే తెలంగాణ అభివృద్ధిలో ఆయన కీలక వ్యక్తి అవుతారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఐటీ రంగం ముందుకు దూసుకుని వెళ్ళడమే తప్ప వెనక్కి తిరిగి చూసే అవసరమే లేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకి వున్న హైదరాబాద్ నగరం, కేటీఆర్ నాయకత్వం లాంటి అడ్వాంటేజెస్‌తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌కి చెప్పుకోదగ్గ అవకాశాలు, నాయకత్వం లేవన్న వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఐటీ రంగానికి ఒక చిరునామా అనేదే లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పల్లె రఘునాథరెడ్డి వయసు రీత్యా పెద్దవాడు. అంత చురుకుగా వ్యవహరించే వ్యక్తి కూడా కాదు. దానికితోడు ఐటీ రంగం మీద ఆయనకి వున్న అనుభవం దాదాపుగా శూన్యం. అంతేకాకుండా ఆయన భుజస్కందాల మీద ఐటీ మంత్రిత్వ శాఖ మాత్రమే కాకుండా ఇతర కీలక శాఖల బాధ్యతలు కూడా వున్నాయి. ఇన్ని బాధ్యతలు మోస్తున్న ఆయన ఐటీ రంగానికి ఎంతవరకు న్యాయం చేయగలరన్న అనుమానాలు వున్నాయి. చంద్రబాబు నాయుడు దృష్టి పెడితే ఐటీ రంగం ఆంధ్రప్రదేశ్ రంగం పుంజుకునే అవకాశాలు వుంటాయి. అయితే ఎన్నో సవాళ్ళతో ముందుకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు ఐటీ రంగం మీద దృష్టి ఎంతవరకు కేటాయిస్తారన్నది అనుమానమే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కంటే యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు అయిన కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణలోనే ఐటీ రంగం అభివృద్ధి సాధిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయమేమిటి?
http://www.teluguone.com/news/content/telangana-has-bright-future-in-it-field-45-36480.html





