ప్రమాదాలు జరిగినప్పుడే ఆర్టీఏ హడావిడి!
Publish Date:Jul 25, 2014
Advertisement
‘హడావిడి’ అనే మాటకు అర్థం తెలుసుకోవాలంటే ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆర్టీఏ అధికారులు చేసే పనులని చూడాలి. దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతూవున్నాయంటే దానికి ప్రధాన కారణం ఆర్టీఏ వ్యవస్థలో విపరీతంగా వున్న అవినీతే. దేశంలో అత్యంత భారీగా అవినీతి జరిగే ప్రభుత్వ వ్యవస్థల్లో ఆర్టీయే మొదటి వరుసలో వుంటుంది. డ్రైవింగ్ పరీక్షలు సరిగ్గా నిర్వహించకుండానే లైసెన్సులు ఇవ్వడం, ఫిట్‌నెస్ సరిగా లేని వాహనాలకు కూడా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేయడం ఇలాంటి ఆర్థిక బలహీనతలు ఆర్టీఏకి చాలా వున్నాయి. ఇలాంటి అవినీతి ప్రమాదాల రూపంలో తన రియాక్షన్‌ని చూపిస్తూ వుంటుంది. ఏదైనా ప్రమాదం జరగ్గానే ఆర్టీఏ అధికారులు హడావిడి మొదలు పెడతారు. అప్పటి వరకూ లంచం కోసం ఎన్ని సంతకాలు పెట్టినవాళ్ళయినా అర్జెంటుగా స్ట్రిక్ట్ ఆఫీసర్లయిపోతారు. కనిపించిన వాహనాన్నల్లా ‘అన్‌ఫిట్’ అంటూ సీచ్ చేసేస్తుంటారు. జరిమానాలు విధించేస్తూ వుంటారు. అలాంటి సమయంలో తాము గతంలో తిన్న లంచాలన్నిటినీ మరచిపోతూ వుంటారు. 2012 సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో ఒక స్కూలు బస్సు నీళ్ళలో పడిపోయి ఎనిమిది మంది చిన్నారులు మరణించారు. ఆ ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరగడంతో ఆర్టీఏకి కళ్ళు అకస్మాత్తుగా తెరుచుకున్నాయి. వెంటనే కనబడిన స్కూలు బస్సునల్లా తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. బస్సులో ఆలోపం.. ఈలోపం వుందని చెబుతూ వందలాది బస్సులను సీజ్ చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ బస్సులన్నీ రోడ్లమీద మామూలుగానే తిరిగాయి. ఆ బస్సులన్నీ ఎంచక్కా రోడ్డుమీద తిరగడం వెనుక ఎంత డబ్బు చేతులు మారిందో పరమాత్ముడికే ఎరుక. అలా ఎప్పుడు ఏ భారీ రోడ్డు ప్రమాదం జరిగినా ఆ తరహా వాహనాల మీద ‘ప్రత్యేక శ్రద్ధ’ చూపించి సీజ్ చేస్తూ వుండటం, ఆ తర్వాత డబ్బులు చేతులు మారగానే చూసీ చూడనట్టు వదిలేయడం. ఆమధ్య పాలెం ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఆర్టీఏ అధికారులు పనికిమాలిన హడావిడి చేసి వందలాది బస్సులను సీజ్ చేశారు. మా అంతటి నిజాయితీపరులు ఎవరూ లేరన్నట్టు బిల్డప్పు ఇచ్చారు. ఆ తర్వాత సీజ్ చేసిన బస్సులన్నీ రోడ్ల మీద తూనీగల్లా తిరుగుతున్నాయి. అధికారులెవరూ వాటిని పట్టించుకోవడం లేదు. అలా పట్టించుకోకుండా ఉండటానికి ఎంత డబ్బు పట్టుకున్నారో ఎవరికి ఎరుక? అలాగే రీసెంట్‌గా మెదక్ జిల్లాలో ఒక స్కూలు బస్సుని రైలు ఢీకొనడంతో 18 మంది మరణించారు. వారిలో 16 మంది చిన్నారులే. ఈ దుర్ఘటన జరగగానే ఆర్టీఏ అధికారులలో ఎక్కడలేని కదలిక వచ్చింది. శుక్రవారం నాడు తెల్లవారగానే డ్యూటీలో దిగిపోయి ఒక్క హైదరాబాద్ పరిసరాల్లోనే 120 స్కూలు బస్సులను కండీషన్‌లో లేవంటూ సీజ్ చేశారు. ఈ తనిఖీలు, సీజ్‌లు ప్రమాదాలు జరగకముందు చేస్తే ప్రమాదాలనేవే జరగవనే కనీస జ్ఞానం అధికారులకు కొరవడుతోంది. ఇప్పుడు సీజ్ చేసిన 120 బస్సులు ఓ వారం పదిరోజులు గడిచిన తర్వాత, తడవాల్సిన వారి చేతులు తడిసిన తర్వాత మళ్ళీ రోడ్ల మీద తిరుగుతూనే వుంటాయి. మళ్ళీ ప్రమాదాలు మామూలుగానే జరుగుతూనే వుంటాయి. ఇంకోసారి ఆర్టీఏ అధికారుల తనిఖీలు, సీజ్ చేయడాలు షరా మామూలుగానే జరుగుతూనే వుంటాయి. ఈ ‘చక్ర’భ్రమణానికి అంతే లేదా!
http://www.teluguone.com/news/content/road-transport-authority-neglecting-45-36479.html





