చలిపులి పంజా.. తెలంగాణ గజగజ
Publish Date:Dec 16, 2025
Advertisement
తెలంగాణ ను చలిపులి గజగజలాడిస్తోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో జనం చలికి వణికిపోతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో మంగళవారం (డిసెంబర్ 16) అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. చలి ప్రభావం జనజీవనంపై పడుతోంది. ఉదయం 9 గంటలు దాటినా ఇళ్ల లోంచి బయటకు రావడానికే జంకే పరిస్థితి ఏర్పడింది. మరో రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ), ఉమ్మడి మెదక్ జిల్లాలోని 11 ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ శివారు శేరిలింగంపల్లిలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటల వరకు కూడా చలి తగ్గకపోవడం, సాయంత్రం 5 గంటల నుంచే చల్ల గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళ రహదారులను దట్టమైన పొగ మంచు కమ్మేస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా గురువారం (డిసెంబర్ 18) నుంచి రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలకూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మంచిర్యాల, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదౌతాయని పేర్కొంది. చలి నుంచి రక్షణకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
http://www.teluguone.com/news/content/telanfana-shewering-with-cold-wave-36-211115.html





