మొన్న బొజ్జల... నేడు శివప్రసాద్... బాబు స్నేహితులకు ఏమైంది?
Publish Date:Apr 16, 2017
Advertisement
కథ క్లైమాక్స్ కు చేరినట్లే కనిపిస్తోంది. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తాడోపేడో తేల్చుకోవడానికే డిసైడయినట్లే కనిపిస్తున్నారు. పూర్తి తిరుగుబాటు ధోరణితో వ్యవహరిస్తున్నారు. అంబేద్కర్ జయంతి రోజున కాస్త సాఫ్ట్ గా విమర్శలు చేసిన శివప్రసాద్...మరింత ధిక్కార ధోరణి ప్రర్శించారు. నేరుగా చంద్రబాబునే టార్గెట్ చేశారు. దళితులు సాగు చేస్తున్న హథీరాం బాబా మఠం భూములు క్రమబద్ధీకరణ చేయమని అడగడం నేరమా అంటూ ప్రశ్నించారు. అసలు సంగతిని వదిలేసి తనపై బురదచల్లే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు... శివప్రసాద్ మరో బాంబు కూడా పేల్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై టీడీపీ ఎంపీలంతా అసంతృప్తిగా ఉన్నారన్నారు. ఫిరాయింపుదారులకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడంపైనా శివప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలు మారి మంత్రి పదవులు అనుభవిస్తున్న వారు తనపై విమర్శలు చేస్తున్నారంటూ పరోక్షంగా మంత్రి అమర్నాథరెడ్డిపై మండిపడ్డారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని, దివంగత సీఎం వైఎస్ ఎన్నోసార్లు పిలిచినా కనీసం కలవడానికి కూడా వెళ్లలేదని గుర్తుచేశారు శివప్రసాద్ వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యక్తిగత అజెండాతో మాట్లాడినా, పార్టీ గీత దాటినా సహించేది లేదని హెచ్చరికలు పంపారు. మంత్రులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు....శివప్రసాద్ వ్యవహారంపై చర్చించారు. హాథీరామ్ భూములను ఇవ్వాలని శివప్రసాద్ అడిగారని... తాను తిరస్కరించడంతోనే ధిక్కార స్వరం వినిపిస్తున్నారని సీఎం అభిప్రాయపడ్డారు. పార్టీ కార్యక్రమాలకు గైర్హాజరవుతూ, పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని సీఎం వివరించారు. మొత్తానికి మొన్నటివరకు కేబినెట్ విస్తరణ ప్రకంపనలు పుట్టిస్తే, ఇప్పుడు శివప్రసాద్ తిరుగుబాటు ఎపిసోడ్.. టీడీపీలో కలకలం రేపుతోంది. మంత్రివర్గ విస్తరణ సెగలు ఇప్పుడిప్పుడే చల్లారుతున్నాయని అనుకుంటే... అంతలోనే చిత్తూరు ఎంపీ... తన అసంతృప్తి బయటపెట్టడంతో నేతలు కలవర పడుతున్నారు. మరి శివ ప్రసాద్ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి.
http://www.teluguone.com/news/content/tdp-mp-siva-prasad-45-73983.html





