దేవినేని మరణం : బెజవాడ రక్త చరిత్రకి THE END!
Publish Date:Apr 17, 2017
Advertisement
దేవినేని కేవలం ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక నేత, మంత్రిగా కూడా పని చేసిన నాయకుడు మాత్రమే కాదు. అంతే అయితే, ఆయన గురించి పెద్దగా చెప్పుకోటానికి ఏం వుండేది కాదు. దేవినేని సత్తా అంతా ఆయన రాజకీయం కన్నా విజయవాడ యుద్ధ భూమిలో నెట్టుకురావటంలోనే కనిపిస్తుంది మనకు! అసలు దేవినేని కుటుంబంలో నెహ్రులా సహజ మరణం పొందనే లేదు ఆయన అన్న, తమ్ముడూ …. ఇద్దరూ కూడా! దేవినేని నెహ్రు అన్నయ్య గాంధీని, మురళిని వంగవీటి వర్గం హత్య చేసింది. అలా సోదరులిద్దరూ అర్ధాంతరంగానే అసువులు బాసినా నెహ్రు దశాబ్దాల పాటూ పోరాటం చేస్తూ ప్రాణాలు కాపాడుకుంటూ రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు! అదే ఆయన అసలు విజయం… కంకిపాడు నియోజకవర్గం నుంచి దేవినేని పదే పదే గెలవటం నిజంగా విశేషమేం కాదు. సహజమే. టీడీపీలో వున్నా, కాంగ్రెస్ లో వున్నా, ఇప్పుడు తిరిగి టీడీపీలోకి వచ్చినా జనం ఆయన వెంట ఎప్పుడూ వున్నారు. అందుక్కారణం ఎప్పుడో కాలేజీ రోజుల్లో మొదలైన వర్గ పోరాటాన్ని ఎక్కడ ఆపకుండా చివరిదాకా నిర్భయంగా, తెలివిగా నడపటమే. వంగవీటి మోహన రంగ లాంటి విపరీతమైన ఫాలోయింగ్ వున్న ప్రమాదకర ప్రత్యర్థి వున్నా దేవినేని నెహ్రు ఒకవైపు రౌడీయిజాన్ని, మరో వైపు రాజకీయాన్ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. వంగవీటి వర్గం తన అన్నని, తమ్ముడ్ని చంపేసినా ఆయన ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ టీడీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. వంగవీటి మోహనరంగ హత్య కేసులో ఆయనకు సీబీఐ నుంచి క్లీన్ చిట్ వచ్చినా… జనం మాత్రం దేవినేని నెహ్రునే రంగ హత్యకి కారణమని నమ్ముతుంటారు! రంగ హత్యకి నెహ్రు కారణం అయినా కాకున్నా విజయవాడ రక్త చరిత్రని రంగ హత్యతో ఆగిపోయేలా నెహ్రు చూశారు. తరువాతి కాలంలో వంగవీటి కుటుంబంపై దేవినేని కుటుంబం దాడులు చేయలేదు. వంగవీటి వర్గం కూడా రంగ హత్య తరువాత నెమ్మదించింది. ఇప్పుడు దేవినేని మరణంతో 1970లలో మొదలైన విజయవాడ వర్గ పోరాటం అధికారికంగా అంతమైనట్టే! వంగవీటి కుటుంబం నుంచి రాధాకృష్ణ, దేవినేని కుటుంబం నుంచి అవినాష్ రాజకీయాల్లో వున్నా … రాజధానిగా మారిపోయిన ప్రస్తుత విజయవాడలో తిరిగి గతం తాలూకూ పరిస్థితులు రావటం అసాధ్యమే! కాబట్టి దేవినేని మరణం… ఒక రక్త చరిత్రకి సహజ సమాప్తం!
దేవినేని రాజశేఖర్… ఉరఫ్ దేవినేని నెహ్రు…. గుండెపోటుతో మరణించారు. ఇది ఏపీ రాజకీయాలకి, మరీ ముఖ్యంగా, రాజధాని విజయవాడకి తీరని లోటే. ఆయన ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్ కి అధికారికంగా సెలవు ప్రకటించకున్నా కొడుకు అవినాష్ ను రంగంలోకి దింపి రెస్ట్ తీసుకోవాలనే అనుకున్నారు. కాని, కాలేజీ రోజుల్నుంచే అనూహ్య మలుపులు తిరుగుతూ వచ్చిన ఆయన జీవితం చివరి దశలో కూడా అనూహ్యంగానే అంతమైంది!
http://www.teluguone.com/news/content/devineni-nehru-45-74003.html





