నేనేరా... కూలీ నెంబర్ వన్...
Publish Date:Apr 16, 2017
Advertisement
రోజంతా కూలి పని చేస్తే ఎంతిస్తారు? వందో...రెండొందలో... లేదంటే మూడొందలో ఇస్తారు... మహా అయితే ఐదారొందలు మంచిదు. కానీ తెలంగాణలో కొందరికి వచ్చే కూలీ లక్షల్లో ఉంటోంది. కూలీ లక్షల్లో ఉంది కదా అని వాళ్లేదే ప్రపంచంలో ఎవరికి చేతగాని పని చేస్తున్నారా అనుకోకండి, అంతేకాదు ఎక్కువ సమయం పనిచేసినందుకు లక్షల్లో కూలీ ఇస్తున్నారని అస్సలే అనుకోవద్దు, ఎందుకంటే వాళ్లంతా పావుగంటో లేక అరగంటో కూలి పనిచేసి...క్షణాల్లో లక్షలు సంపాదిస్తున్నారు. అవును మీరు వింటున్నదీ నిజం. ఇంతలా సంపాదిస్తున్నది ఎవరో కాదు టీఆర్‌ఎస్ నేతలే. టీఆర్‌ఎస్ ప్లీనరీ కోసం కూలి పనిచేసి డబ్బు సంపాదించాలని గులాబీ దళపతి కేసీఆర్ ప్రకటించడమే ఆలస్యం ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగి క్షణాల్లో లక్షల్లో సంపాదించేస్తున్నారు. టీఆర్‌ఎస్ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు అవసరమైన ఖర్చును కూలి పనుల ద్వారా సంపాదించాలని పార్టీ శ్రేణులకు గులాబీ బాస్ సూచించారు. అంతేకాదు ఈనెల 14 నుంచి 20 వరకు గులాబీ కూలి దినాలుగా ప్రకటించారు. కేసీఆర్ పిలుపుతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చోటామోటా నేతలందరూ కూలీల అవతారమెత్తుతున్నారు. అలా మంత్రి కేటీఆర్ కూడా కూలీగా మారారు. ఓ అరగంటపాటు రెస్టారెంట్‌లో కూల్‌కూల్‌గా చేసి ఓ ఐస్‌క్రీమ్, ఓ జ్యూస్ తయారుచేశారు. ఇంతకీ ఆ ఐస్‌క్రీమ్ ఎంతకి అమ్ముడుపోయిందో తెలుసా? అక్షరాలా ఐదు లక్షల రూపాయలు. అంతేకాదు కేటీఆర్ తయారుచేసిన జ్యూస్ లక్షా 30వేలకు అమ్ముడుపోయింది. ఆ విధంగా కేటీఆర్ మొత్తం 7లక్షల 30వేలు ఈజీగా సంపాదించారు. అలాగే మంత్రి జగదీశ్‌రెడ్డి ఫార్మా కంపెనీల్లో అట్టపెట్టెలు మోసినందుకు మూడు లక్షల రూపాయలు కూలీ దక్కింది. ఇదే తరహాలో పలు జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చోటామోటా నేతలు....చెమట చుక్క రాలకుండా క్షణాల్లో వేలు, లక్షలు సంపాదిస్తూ, నేనేరా... నెంబర్ వన్ కూలీ అనిపించుకునేందుకు పోటీపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/trs-plenary-meeting-45-73982.html





