పవన్ పై కాంగ్రెస్ విమర్శల దాడి.. ఏ ప్రయోజనం కోసం?
Publish Date:Dec 3, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇందుకు కారణం కోనసీమలో కొబ్బరి దిగుబడి తగ్గిపోవడానికి తెలంగాణ దిష్టి తగిలిందనే అర్ధం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు. అయితే జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జనం సీరియస్ గా తీసుకోలేదు. మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదు. పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎవరూ స్పందించలేదు కూడా. కానీ తీరిగ్గా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన వారం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పించడం విస్తుగొలుపుతోంది. ఆ విమర్శల తీవ్రత గత రెండు రోజులుగా పెచ్చరిల్లింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే పవన్ సినిమాలను తెలంగాణ థియోటర్లలో ఆడనివ్వం అంటూ తీవ్ర స్థాయి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పుడు పరిశీలకులు వ్యక్తం చేస్తున్న సందేహాలు ఏమిటంటే.. కాంగ్రెస్ ఇప్పుడు, ఈ సమయంలో ఈ స్థాయి విమర్శలకు దిగడం పూర్తిగా నిరర్ధకం. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలకు సంబంధించినంత వరకూ పవన్ కల్యాణ్ కానీ, ఆయన జనసేన పార్టీ కానీ పూర్తిగా ఇర్రెలవెంట్. అయితే ఈ విమర్శల వల్ల తెలంగాణలో ఏమైనా జరగడమంటూ జరిగితే.. అది తెలంగాణ సెంటిమెంట్ తెరపైకి రావడమే. అలా తెలంగాణ సెంటిమెంట్ తెరపైకి వస్తే కాంగ్రెస్ కు రాజకీయంగా ఇసుమంతైనా ఉపయోగం ఉండదు. ఆ సెంటిమెంట్ వల్ల ప్రయోజనం అంటూ ఉంటే.. అది బీఆర్ఎస్ కు మాత్రమే. అంటే కాంగ్రెస్ నేతలు, మంత్రులు పవన్ కల్యాణ్ లక్ష్యంగా చేస్తున్న విమర్శల వల్ల బీఆర్ఎస్ మాత్రమే లబ్ధిపొందుతుంది. ఆ పని కాంగ్రెస్ ఎందుకు చేస్తున్నదంటూ రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అన్నిటికీ మించి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. త్వరలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లబోతోంది. అలాగే తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఓ వైపు ఇంత సందడి, హడావుడీ పెట్టుకుని కూడా కాంగ్రెస్ నేతలూ, మంత్రులూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండిచడం, ఆయనపై విమర్శలు గుప్పించడం వినా తమకు వేరే పనేంలేదనేలా చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే కాంగ్రెస్ పొలిటికల్ స్టాండర్డ్స్ పై అనుమానాలు వ్యక్తం అయ్యేందుకు దోహదపడుతున్నాయి. మీడియా పెద్దగా పట్టిచుకోవడం మానేసిన నేతలు, మంత్రులే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారనీ, కనీసం ఆ రకంగానైనా మీడియా దృష్టిలో పడి ఎంతో కొంత పాపులారిటీ వస్తుందని భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/what-is-the-purpouse-of-congress-attack-on-pawan-45-210406.html





