తూర్పులో తెలుగుదేశం కూటమిదే జేగంట!
Publish Date:Apr 5, 2024

Advertisement
రాష్ట్ర రాజకీయాలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాది ఒక విశిష్ఠ స్థానం. ఈ జిల్లాలో ఆధిక్యత సాధించిన పార్టీయే రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపడుతుందని రాజకీయవర్గాలలో ఒక గట్టి నమ్మకం వచ్చింది. స్వాతంత్రానంతరం ఎన్నికలు జరిగిన ప్రతి సారీ ఆ నమ్మకం నిజమని రుజువు అవుతూనే వస్తోంది. తూర్పుగోదావరి ఫలితాలే రాష్ట్రంలో అధికార పార్టీని నిర్ణయిస్తాయన్నది ఒక నమ్మకం. అందుకే తూర్పు ఏటైతే రాష్ట్రం కూడా అటే’ అంటారు రాజకీయ పండితులు. తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రం మొత్తంలో అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న జిల్లా ఇదే. ఇక్కడ ఏ పార్టీకి మెజారిటీ వచ్చిందో అది పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ స్థానాలను గెలుచుకుని అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తున్నది.
రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికలలో అంటే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలోని 19 నియోజకవర్గాలకు గానూ 14 నియోజకవర్గాలలో విజయం సాధించింది. ఆ ఎన్నికలలో తెలుగుదేశం రాష్ట్రంలో మెజారిటీ స్థానాలలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. అదే విధంగా 2019 ఎన్నికల్లో వైసీపీ పద్నాలుగు నియోజకవర్గాలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికారాన్ని కైవశం చేసుకుంది. ఇప్పుడు 2024 ఎన్నికలలో పరిస్థితి తెలుగుదేశం కూటమికే అనుకూలంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ వెలువడిన పలు సర్వేలలో కూడా అదే తేలింది. రాష్ట్రంలో అధికారం చేపట్టబోయే పార్టీ ఏది అన్న దానికి రాజకీయ పండితులు కూడా తూర్పు గోదావరి ఫలితాలనే ప్రామాణికంగా తీసుకుంటారు.
ఆ ప్రకారంగా చూస్తo ఈ సారి తూర్పులో తెలుగుదేశం కూటమి హవా కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో రాబోయేది తెలుగుదేశం కూటమి ప్రభుత్వమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక జిల్లాలో తుని, అనపర్తిలో అసెంబ్లీ నియోజకవర్గాలలో మాత్రమే వైసీపీకి ఒకింత సానుకూల పరిస్థితులు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. తునిలో యనమల కుటుంబంలో విభేదాల కారణంగా తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. వాస్తవానికి తుని తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచీ 2004 వరకు జరిగిన ఆరు ఎన్నికల్లో తెలుగుదేశం తునిలో విజయం సాధించింది. ఆ తరువాత జరిగిన అన్ని ఎన్నికలలోనూ ఓడిపోతూ వస్తోంది. ఇక అనపర్తి విషయానికి వస్తే.. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం బీజేపీకి వెళ్లడం కూటమికి ఒకింత ఇబ్బందికరంగా మారింది. అదే వైసీపీకి అనుకూలంగా మారింది.
ఇక్కడ తెలుగుదేశం తరఫున బలమైన అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉన్నప్పటికీ, మిత్ర ధర్మంలో భాగంగా తెలుగుదేశం ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. దీంతో నియోజకవర్గ తెలుగుదేశం కేడర్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రెబల్ గా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనపర్తి విషయంలో కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య చర్చ జరుగుతోందని అంటున్నారు. ఆ చర్చలు ఫలించి అనపర్తి నుంచి తెలుగుదేశం అభ్యర్థే పోటీలోకి దిగితే.. కూటమి విజయానికి తిరుగు ఉండదు కానీ..ప్రస్తుతానికి అయితే ఇక్కడ కూటమి వెనుకబాటులోనే ఉందని చెప్పాలి. ఈ రెండు నియోజకవర్గాలూ మినహాయిస్తే జిల్లాలో తెలుగుదేశం కూటమి ముందంజలో ఉందని సర్వేలు చెబుతున్నాయి. దీనిని బట్టి రాష్ట్రంలో అధికారం చేపట్టబోయేది తెలుగుదేశం కూటమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/tdp-alliance-sweep-in-east-25-173285.html












