రిజర్వుడ్ స్థానాల్లో తెలుగుదేశం కూటమిదే హవా!
Publish Date:Apr 5, 2024
Advertisement
ఏపీలో ఎన్నికల హీట్ తార స్థాయికి చేరింది. అధికార వైసీపీ, కూటమి అభ్యర్థులు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే, ప్రచారానికి వెళ్తున్న వైసీపీ అభ్యర్థులకు అడుగడుగునా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సమస్యలపై వైసీపీ అభ్యర్థులను నిలదీస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ఐదేళ్లలో కేవలం కక్షపూరిత రాజకీయాలు, భూకబ్జాలు, ఇసుక, మట్టి, మద్యం దోపిడీతో వేలాది కోట్ల రూపాయలు దోచుకునేందుకే జగన్, ఆయన వర్గీయులు ప్రాధాన్యతనిచ్చారు. దీంతో ఐదేళ్లలో ప్రజా సమస్యల పరిష్కారం కాకపోగా.. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా.. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలను జగన్ తరిమేశారు. యువతకు ఉపాధి దొరకని పరిస్థితి. ఏపీలో రహదారుల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ప్రధాన రహదారులుసైతం అద్వాన్నంగా తయారయ్యాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ప్రజలు పలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా జగన్ సర్కార్ ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్లేదు. దీంతో రిజర్వుడ్ నియోజకవర్గాల్లోని ప్రజలు జగన్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏపీలో ప్రముఖ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తేలింది. ఇప్పటికే దాదాపు పదికిపైగా ప్రముఖ సంస్థలు తమ సర్వే ఫలితాలను విడుదల చేశాయి. అన్ని సర్వే ఫలితాల్లోనూ ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తారని తేలింది. తాజాగా పీపుల్స్ పల్స్ సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఏపీలో వైసీపీ జగన్ సర్కార్ పడిపోవటం ఖాయమని, సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించడం ఖాయమని సర్వే తేల్చింది. ఇందుకు కారణాలను కూడా సర్వే సంస్థ వెల్లడించింది. ఏపీ అసెంబ్లీ ఫలితాలను డిసైడ్ చేసే ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ స్థానాల్లో ఈసారి కూటమిదే హవాఅని పీపుల్స్ పల్స్ సర్వే ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 36 రిజర్వుడు స్థానాలు ఉన్నాయి. వాటిలో 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిల్లో చేసిన సర్వేలో కొన్ని షాకింగ్ నిజాలు బయటికొచ్చాయి. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఈ ఎస్సీ నియోజకవర్గాల మొగ్గు ఏ పార్టీ వైపు ఉంటే ఆ పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్నాయి. అటువంటి రిజర్వుడు నియోజకవర్గాల్లో వైసీపీకి బిగ్ షాక్ తగలబోతున్నట్లు సర్వే తేల్చింది. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని చెప్పిన సర్వే సంస్థ.. ఎందుకో కారణాలనుసైతం వెల్లడించింది. మాటకు ముందు మాటకు తరువాత నా ఎస్టీలు, నా ఎస్సీలు అనే జగన్ వారికి చేసిందేమీ లేదన్న సంగతి వారిలో జగన్ సర్కార్ పట్ల వ్యక్తమౌతున్న ఆగ్రహావేశాలే తేటతెల్లం చేస్తున్నాయని పేర్కొంది. ఏపీలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు తమవైపే ఉన్నారని, గత ఎన్నికల్లో మాదిరిగా ఈసారికూడా వైసీపీకే వారి మద్దతు ఉంటుందని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పలు సభల్లో పేర్కొంటూ వస్తున్నారు. కానీ, పీపుల్స్ పల్స్ సర్వేలో జగన్ పై ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తేలింది. రాష్ట్రంలో మొత్తం 36 రిజర్వుడు స్థానాల్లో 29ఎస్సీ నియోజకవర్గాలు, ఏడు ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఎస్సీ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నది. ఉదాహరణకు.. 2014 ఎన్నికల్లో 29 ఎస్సీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం కూటమికి 16, వైసీపీకి 13 స్థానాలు వచ్చాయి. అప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఒకటి, జనసేన పార్టీకి ఒకటి, వైసీపీకి 27 స్థానాలు వచ్చాయి. దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. పీపుల్స్ పల్స్ సంస్థ తాజాగా చేసిన సర్వే ప్రకారం. 29 ఎస్సీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం కూటమికి 19 సీట్లు (51.81%), వైసీపీకి 10 సీట్లు (42.83%) లభించే అవకాశాలున్నాయని అని తేలింది. దీంతో ఆనవాయితీ ప్రకారం.. తెలుగుదేం కూటమి విజయం ఖాయమని సర్వే సంస్థ పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై ఎందుకు వ్యతిరేకతతో ఉన్నారనే కారణాలను కూడా పీపుల్స్ పల్స్ సర్వే పేర్కొంది. ఎస్సీ నియోజకవర్గాల్లో చదువుకున్న దళిత వర్గాల్లో పెద్దఎత్తున ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతుండటం. సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు. ఐదేళ్ల జగన్ పాలనలో దళిత వర్గాల్లోని యువతకు ఉద్యోగాలు దొరక్కపోగా.. స్థానికంగా పని చేసుకునేందుకు ఉపాధి అవకాశాలు కరువయ్యాయి. స్వయం ఉపాధి రుణాలు సరిగా అందలేదు. జగన్ హయాంలో దళితులపై దాడులు పెరిగాయి. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన దళితులను పోలీసుల సహకారంతో చిత్రహింసలకు గురిచేశారు. ఈ క్రమంలో పలువురు దళితులు చనిపోయారు. ఈ కారణంగా దళితులంటే జగన్ మోహన్ రెడ్డి కనీస గౌరవంకూడా ఇవ్వడం లేదన్న వాదన దళిత వర్గాల్లో బలంగా ఏర్పడింది. చంద్రబాబు హయాంలో దళితులకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చి అభివృద్ధికి సహకారం అందించారని, జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత దళితుల అభివృద్ధి కుంటుపడిపోవటంతోపాటు, వారిపై దాడులు పెరిగారని ఏపీలోని దళిత వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఓటు ద్వారా వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు దళిత వర్గాల ప్రజలు సిద్ధమై న్నట్లు సర్వే పేర్కొంది. రిజర్వుడ్ నియోజకవర్గాల్లోని ప్రజలేకాక.. మిగిలిన 139 నియోజకవర్గాల్లోని ప్రజలుసైతం వైసీపీ ప్రభుత్వానికి ఓటు ద్వారా గుణపాఠం చెప్పేందుకు రెడీగా ఉన్నారని పీపుల్స్ పల్స్ సర్వే పేర్కొంది.
http://www.teluguone.com/news/content/-tdp-alliance-win-guarantee-25-173279.html





