మాజీ హోంమంత్రి సుచరిత ఇంటి ముందు ఎమ్మెల్యే శ్రీదేవి ధర్నా
Publish Date:Aug 21, 2022
Advertisement
తాడికొండ వైసీపీలో విభేదాలు రొడ్డెక్కాయి. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వైసీపీ నాయకురాలు, మాజీ హోంమంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయిన మేకతోటి సుచరిత నివాసం ముందు ధర్నాకు దిగారు. ఇప్పటి వరకూ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఉన్న ఉండవల్లి శ్రీదేవికి అదనంగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ ను పార్టీ అధిష్టానం అదనపు సమన్వయకర్తగా నియమించింది. ఈ నిర్ణయాన్ని ఉండవల్లి శ్రీదేవి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గ అదనపు సమన్వయ కర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఉండవల్లి శ్రీదేవి వర్గీయులు ఆందోళనలకు దిగారు. స్వయంగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పార్టీ జిల్లా అద్యక్షురాలు, మాజీ హోంమంత్రి సుచరిత నివాసం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తన అనుచరులతో కలిసి ఉండవల్లి శ్రీదేవి మేకతోటి సుచరిత నివాసం ముందు బైఠాయించి ధర్నాకు దిగడంతో పార్టీలో విభేదాలు ఒక్కసారిగా రోడ్డెక్కినట్లైంది. కాగా సుచరిత స్వయంగా ఉండవల్లి శ్రీదేవిని బుజ్జగించి నిరసన విరమింప చేశారు. అదనపు సమన్వయ కర్త నియామకం విషయాన్ని అధిష్ఠానంతో మాట్లాడి పరిష్కరిస్తానని సుచరిత హామీ ఇవ్వడంతో ఉండవల్లి శ్రీదేవి తన ఆందోళన విరమించారు. కాగా ఎమ్మెల్యే స్వయంగా పార్టీ జిల్లా అధ్యక్షురాలి నివాసం ఎదుట బైఠాయించి నిరసనకు దిగడంతో మేకతోటి సుచరిత నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
http://www.teluguone.com/news/content/tadikonda-mla-vundavalli-sridevi-dharna-at-sucharita-house-25-142390.html





