రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసు.. విచారణకు సునీల్ నాయక్
Publish Date:Mar 5, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోసంచలనం సృష్టించిన ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ7 అయిన బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఎట్టకేలకు విచారణకు హాజరయ్యారు. 2021 మే నెలలో, అప్పటి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సీఐడీ పోలీసులు అరెస్టు చేసి గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు. ఆ రాత్రి కస్టడీలో తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, కొట్టారని, తన ప్రాణాలకు ముప్పు తలపెట్టారని రఘురామ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు పునర్విచారణ ప్రారంభమైంది. ఘటన జరిగిన సమయంలో సునీల్ నాయక్ ఆంధ్రప్రదేశ్ సీఐడీలో డీఐజీ గా ఉన్నారు. రఘురామను కస్టడీలో ఉంచిన రాత్రి, సునీల్ నాయక్ పలుమార్లు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సునీల్ నాయక్ ఇక్కడ నుంచి రిలీవ్ అయ్యి బీహార్ కు వెళ్లిపోయారు. కాగా విచారణకు హాజరుకావాలని పోలీసులు సునీల్ నాయక్ కు పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించలేదు. దీంతో ఇటీవల ఏపీ పోలీసులు బీహార్ రాజధాని పాట్నాకు వెళ్లి ఆయన్ను అరెస్టు చేసే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. అయితే టెక్నికల్ కారణాలతో ఆయన అరెస్టుకు పాట్నా కోర్టు అనుమతి ఇవ్వలేదు. అదలా ఉండగా తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ సునీల్ నాయక్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఏపీ హైకోర్టు ఆయనను విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు సునీల్ నాయక్ గురువారం (మార్చి 5) గుంటూరులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. విజయనగరం ఎస్పీ దామోదర్ ఈ విచారణను నిర్వహిస్తున్నారు. గురువారం (మార్చి 5) నుంచి సోమవారం (మార్చి 9) వరకు విచారణ కొనసాగనుంది. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు ఆయన్ను ప్రశ్నించనున్నారు. ఈ కేసులో నిందితుల జాబితాలో సునీల్ నాయక్ తో పాటు అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పి.ఎస్.ఆర్. ఆంజనేయులు కూడా ఉన్నారు. కాగా విచారణలో సునీల్ నాయక్ ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/sunil-naik-attend-inquiry-36-215050.html





