సుచరితకు 'శివాజీ' ట్రీట్‌మెంట్!.. మాజీ మంత్రి ఆ పార్టీతో టచ్‌లోకి!
Publish Date:Apr 15, 2022
Advertisement
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన శివాజీ సినిమా చూసే ఉంటారుగా. అందులో దారికి రాని అధికారులను, మంత్రులను హీరో శివాజీ ఓ రూమ్‌లో వేసి చితక్కొట్టిస్తాడు. ఆ తర్వాత చెప్పిన చోట సంతకాలు పెట్టించి.. కావలసిన పని చేయించుకుంటాడు. అదంతా సినిమా. తాజాగా, మాజీ మంత్రి సుచరితకు శివాజీ సినిమా తరహాలో ట్రీట్‌మెంట్ ఇచ్చినట్టున్నారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ అనుమానం వ్యక్తం చేశారు. లేదంటే, మా అమ్మ రాజీనామా చేశారని సుచరిత కూతురు అంత క్లారిటీగా చెప్పాక కూడా.. తూచ్ అలాంటిదేమీ లేదు.. అది థ్యాంక్స్ గివింగ్ లెటర్ అంటూ మాజీ మంత్రి చెప్పడమేంటని అన్నారు రఘురామ. అందుకే, సుచరితను బెదిరించి ఉంటారేమో అనే కోణంలో శివాజీ సినిమాతో పోల్చి చెప్పారని అంటున్నారు. మీరు మీరు కొట్టుకొని సర్దుకుపోవచ్చని.. ఎవరెవరికి ఎలా సర్దిచెప్పారో ప్రజలకు తెలుసని అన్నారు. సుచరిత ఏ పార్టీ వాళ్లతో టచ్‌లోకి వెళ్లారో కూడా తనకు తెలుసన్నారు ఎంపీ రఘురామ. ఏమో చెప్పలేం.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.. అంటున్నారు. మంత్రి పదవి ఇవ్వలేదని జగనన్నపై సుచరిత అలక, ఆగ్రహం.. రెండుమూడు రోజుల పాటు ఆమెను పట్టించుకోకుండా పక్కనపెట్టేయడం.. దళిత నేతకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ విమర్శలు.. ఆ తర్వాత ఆమె సీఎంను కలవడం.. రాజీనామా చేయలేదంటూ బుకాయించడం.. ఇలా వరుస పరిణామాల నేపథ్యంలో ఎంపీ రఘురామ ఎంటరై.. మాజీ మంత్రి సుచరితను జగన్ అండ్ కో బెదిరించారనే ధోరణిలో శివాజీ సినిమా ట్రీట్‌మెంట్ అంటూ కామెంట్ చేయడం కలకలం రేపుతోంది. దళిత మహిళా నేత అనే సుచరితను అంతలా అవమానించారని అంటున్నారు. గత కేబినెట్‌లో ఐదుగురు దళిత మంత్రులు ఉండగా.. వారిలో నలుగురిని మళ్లీ మంత్రి మండలిలోకి తీసుకొని.. ఒక్క సుచరితనే సైడ్ చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తొలిరోజు ఎంపీ మోపిదేవిని రాయబారిగా ఇంటికి పంపించగా.. ఆవేశంలో రాజీనామా చేసి ఆయన చేతిలో పెట్టారు సుచరిత. దీంతో.. సుచరిత రాజీనామాపై హైకమాండ్ ఫుల్ సీరియస్ అయింది. మిగతా అసంతృప్తులను పదే పదే బుజ్జగించిన అధిష్టానం.. సుచరితను మాత్రం పట్టించుకోలేదు. తీరిగ్గా.. మూడు రోజుల తర్వాత సుచరితను తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిపించుకొని.. గట్టిగా క్లాస్ ఇచ్చారట సీఎం జగన్. ఆ తర్వాత ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి.. అది రాజీనామా లేఖ కాదు.. థ్యాంక్స్ గివింగ్ లెటర్ అంటూ అప్పటికప్పుడు స్టోరీ మార్చేశారు సుచరిత. అందుకే, సుచరితను బెదిరించారనే భావంలో శివాజీ సినిమా తరహా ట్రీట్‌మెంట్ అంటూ.. ఆమె ఓ పార్టీతో టచ్‌లోకి వెళ్లిందంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. రఘురామ చెప్పినట్టు.. ఆమె మరో పార్టీని సంప్రదించారా? లేక, ఆ పార్టీనే సుచరితకు ప్రపోజల్ పంపిచిందా? అనేది ఆసక్తికరం.
http://www.teluguone.com/news/content/sucharita-in-touch-with-another-political-party-39-134420.html





