మోదీ పట్టించుకోలే.. సీజేఐ చేసి చూపించారు.. జస్టిస్ రమణను కొనియాడిన కేసీఆర్
Publish Date:Apr 15, 2022
Advertisement
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక.. హైకోర్టు విడిపోయిన తర్వాత.. బెంచీల సంఖ్య పెంపుపై కేంద్రానికి, ప్రధాని మోదీకి లేఖరాశానని.. అయితే ఆ అంశం ఎప్పుడూ పెండింగ్‌లో ఉండేదని సీఎం కేసీఆర్ అన్నారు. సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ బాధ్యతలు చేపట్టాక ఆ సమస్య పరిష్కారమైందని కొనియాడారు. జస్టిస్ ఎన్వీ రమణ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రధాని, కేంద్రంతో మాట్లాడి రాష్ట్ర హైకోర్టులో బెంచీల సంఖ్య 24 నుంచి 42కి పెంచేలా చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం తరఫున జస్టిస్ ఎన్.వి.రమణకు ధన్యవాదాలు తెలియజేశారు. దేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ ఉండటం గర్వకారణమన్నారు సీఎం కేసీఆర్. బెంచీల సంఖ్య పెరిగిన నేపథ్యంలో 885 అదనపు పోస్టులను హైకోర్టుకు కేటాయించామని చెప్పారు. జిల్లా, సివిల్ కోర్టుల్లో పనిభారం ఎక్కువనే సమాచారం ఉందని.. ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మను కోరారు సీఎం. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన తెలంగాణ న్యాయాధికారుల సదస్సుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఎనిమిదేళ్ల క్రితం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం అందరి సహకారం, సమన్వయంతో ముందుకు పురోగమిస్తోందని సీఎం అన్నారు. రాష్ట్రంలో పటిష్ట ఆర్థిక పురోగతి సాధిస్తున్నామని.. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లోనూ ముందుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు ఏర్పాటు చేశామని.. అన్ని జిల్లాల్లోనూ సమీకృత కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. రాష్ట్ర న్యాయవ్యవస్థ, పరిపాలనా విభాగం కూడా గొప్పగా ముందుకెళ్లాలని ప్రబలంగా ఆకాంక్షించారు సీఎం కేసీఆర్.
http://www.teluguone.com/news/content/cm-kcr-praises-cji-ramana-39-134415.html





