డాటా సెంటర్లకు రాయితీలపై అధ్యయనం చేయండి : సీఎం రేవంత్
Publish Date:Feb 17, 2026
Advertisement
డాటా సెంటర్లకు వివిధ రాష్ట్రాలు ఇస్తున్న రాయితీలపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థలు.. వారికి అవసరమైన భూమి, ఇతర వసతులపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. డాటా సెంటర్లకు భూ కేటాయింపులో హేతుబద్ధత ఉండాలని సీఎం సూచించారు. వివిధ ప్రాంతాల్లో డాటా సెంటర్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సాగుతున్న భూ సేకరణపైనా అధికారులను సీఎం ఆరా తీశారు. భూ పరిహారం నిర్ణయం విషయంలో ఉదారంగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రైతులను పిలిచి మాట్లాడి వారు సంతృప్తి చెందేలా పరిహారం నిర్ణయించాలన్నారు. రూ.వేల కోట్లతో పెట్టుబడులు పెట్టే సంస్థలు భూమిపై పెట్టె పెట్టుబడి చాలా స్వల్పమన్నారు. కంపెనీలకు సకాలంలో భూమి, ఇతర వసతులు అందుబాటులో ఉంచితే త్వరగా పనులు పూర్తి చేసుకుంటారని సీఎం అభిప్రాయపడ్డారు. సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరి అజిత్ రెడ్డి, ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక తదితరులు పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/subsidy-for-data-centers-36-214252.html





