త్యాగశీలివమ్మా...కాదమ్మా...ప్రాణ భయమమ్మా...
Publish Date:Jul 31, 2014
Advertisement
ఇంతవరకు కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఉన్న కాంగ్రెస్ నేతలందరూ తమ అధినేత్రి సోనియాగాంధీ ప్రధానమంత్రి పదవిని త్యజించిన గొప్ప త్యాగశీలి అని చాలా గొప్పగా భజనలు చేసారు. అంతేకాదు ఆమె ఈ త్యాగశీలత గురించి పాటలు కట్టి ఆమె ముందే పాడుకొన్నారు కూడా. అయితే ఆమె కానీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీ గానీ ఆ భజన పాటలను ఎప్పుడు ఖండించలేదు. అంటే దానర్ధం వారూ ఆ ప్రచారాన్ని ద్రువీకరిస్తున్నట్లేనని అర్ధం అవుతోంది. కానీ మాజీ కేంద్రమంత్రి నట్వర్ సింగ్ వ్రాసిన ఒక పుస్తకంలో ఆమె ప్రధానమంత్రి పదవి చేపడితే ఆమె ప్రాణాలకే ప్రమాదమని రాహుల్ గాంధీ గట్టిగా అడ్డుపడటం వలననే ఆమె పదవి చేప్పట్టలేదనే గొప్ప నిజాన్ని బయటపెట్టారు. అంటే ఆమె పదవి చేప్పట్టకపోవడానికి కారణం ప్రాణ భయమే తప్ప త్యాగం చేసే ఉద్దేశ్యంతో కాదని స్పష్టం అవుతోంది. మరి అటువంటప్పుడు ఇంతకాలం ఆ త్యాగశీలి భజనలను ఎందుకు ప్రోత్సహించారో అర్ధం కాదు. ప్రధానమంత్రి పదవి చేపడితే ఉగ్రవాదుల చేతిలో చచ్చిపోతామనే భయం రాహుల్ గాంధీకి ఉందనే సంగతి ఆయన రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన ప్రసంగంలోనే బయటపడింది. అయితే ఆ భయంతోనే ఆయన తన తల్లిని కూడా ప్రధానమంత్రి పదవి చేప్పట్టకుండా అడ్డుపడ్డారనే సంగతి నట్వర్ సింగ్ బయటపెట్టిన తరువాతనే అసలు కధ బయటపడింది. బహుశః అందుకే రాహుల్ గాంధీ కూడా ఇంతకాలం అవకాశమున్నా కూడా ప్రధానమంత్రి పదవి చేప్పట్టకుండా అమూల్యమయిన అవకాశాన్ని వదులుకొని ఉండవచ్చును. కానీ చివరికి తల్లి బలవంతం చేతనో లేక పార్టీ నేతల ఒత్తిడి కారణంగానో ప్రధాన మంత్రి పదవి చెప్పట్టాడానికి బుర్ర ఊపిన తరువాత, ఎన్నికలలో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దానితో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకుండా పెద్ద ప్రమాదం నుండి తప్పించుకోగలిగారు. అందువల్ల ఆయనకు ఆ అవకాశం కల్పించిన భారత ప్రజలకు, నరేంద్రమోడీకి కృతజ్ఞతలు చెప్పుకోకతప్పదు. నరేంద్ర మోడీ తీరు చూస్తుంటే మరో ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికలలో కూడా రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని రిస్క్ తీసుకొనే అవసరం లేకుండా చేసేలా ఉన్నారు. ఏమయినప్పటికీ బ్రతికుంటే పార్లమెంటు వెనుక బెంచీలలో కునుకు తీస్తూ శేషజీవితం చల్లగా కులాసాగా గడిపేయవచ్చును. కానీ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని ప్రాణాలతో చెలగాటం ఆడుకోవడం ఎందుకు? అనే జ్ఞానం ఒక్క రాహుల్ గాంధీకి తప్ప మరెవరికీ కలగకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది.
http://www.teluguone.com/news/content/sonia-gandhi-prime-minister-natwar-singh-book-rahul-gandhi-scare-to-sonia-gandhi-murder-45-36715.html





