టర్కీ ఆయుధ నౌక అపహరణ.!
Publish Date:Aug 21, 2026
Advertisement
అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో పైరేట్ల (సముద్ర దొంగలు) బెడద మళ్లీ పెచ్చరిల్లిందా? అంటే.. సోమాలియా తీరంలో ఒక రవాణా నౌక అపహరణ ఘటనను బట్టి ఔననే అనాల్సి వస్తోంది. సోమాలియా తీరంలో కేమరూన్ ఫ్లాగ్‌తో ప్రయాణిస్తున్న నౌకను సోమాలియా సముద్ర దొంగలు అపహ రించారు. పోలార్ మూవ్‌మెంట్ షిప్పింగ్ సంస్థకు చెందిన ఈ నౌక.. సాధారణ సరుకులను మాత్రమే కాకుండా, టర్కీ ఆయుధాలు, కమ్యూనికేషన్, శాటిలైట్ పరికరాలను తీసుకెడుతోంది. సోమాలియాలోని పుంట్‌ల్యాండ్ పరిధిలోని ఎయిల్ జిల్లా మార్రాయా తీరానికి 3.5 నాటికల్ మైళ్ల దూరంలో ఎనిమిది మంది సాయుధులైన సోమాలియా పైరేట్లు నౌకపైకి విరుచుకుపడి, దానిని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత నౌకను నుగాల్ తీరం వైపు మళ్లించారు. ఈ వార్త ఇండియాలో ఆందోళనకు కారణమైంది. ఎందుకంటే, ఆ నౌకలో ఉన్న మొత్తం 10 మంది సిబ్బందిలో ఆరడజను మంది ఇండియన్లే. ఆ ఆరుగురు ఇండియన్ల ప్రాణాలూ సోమాలియాపైరేట్ల గుప్పిట్లో ఉన్నాయి. సోమాలియా రాజధాని మొగదిషులో ఏర్పాటు చేసిన టర్కీ మిలిటరీ శిక్షణ కేంద్రానికి అవసరమైన ఆయుధాలు మరియు డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థలను రవాణా చేస్తున్న సమయంలో ఈ దాడి చోటుచేసుకుంది. గతంలో ఓ నౌకను అపహరించిన పైరేట్ల ముఠాయే ఈ దాడి వెనుక కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఘటన సమాచారం అందగానే అంతర్జాతీయ భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం నౌక ఉన్న ప్రాంతానికి సమీపంలో టర్కీకి చెందిన విమానాలు, డ్రోన్లు, మిలిటరీ హెలికాప్టర్లు గస్తీ కాస్తున్నాయి. ప్రస్తుతం నౌకలో ఉన్న ఆరుగురు భారతీయులతో సహా సిబ్బంది అందరి భద్రతపై కుటుంబ సభ్యులు, కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. Somali Pirates Hijak Ship, Turkish Weapons Ship Hijack, MV LUTUF Somali Pirates, Indian Sailors Captured, Puntland Somalia Coast
http://www.teluguone.com/news/content/somali-pirates-hijak-ship-36-229442.html





