బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ సమితి.. కేసీఆర్ కొత్త పార్టీపై షర్మిల సెటైర్లు
Publish Date:Oct 4, 2022

Advertisement
తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలలాగే.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి కూడా అంతం కనిపించని పాదయాత్ర సాగిస్తున్నారు. ఆమె పాదయాత్రకు ప్రజా మద్దతు సంగతి ఎలా ఉన్నా.. ఆమె అధికార పక్షం నేతలు, తెరాస అధినేత కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులే లక్ష్యంగా చేస్తున్న విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
ఆ విమర్శలపై చర్చ జరుగుతోంది. ఆమె పరిధి మీరి విమర్శలు చేస్తున్నారంటూ తెరాస నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేసి ఊరుకున్నారే కానీ... ఆమెకు కౌంటర్ ఇవ్వడానికి, ప్రతి విమర్శలు చేయడానికి ముందుకు రాలేదు. అయితే ఆమె తండ్రి వైఎస్ఆర్ పార్టీని ఇప్పటికీ తమ నేతగా చెప్పుకునే కాంగ్రెస్ మాత్రం షర్మిల కాంగ్రెస్ పై చేసిన విమర్శలను గట్టిగా తిప్పి కొట్టింది.
ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒక్కరే ఇప్పటి వరకూ షర్మిల విమర్శలకు గట్టిగా రిటార్డ్ ఇచ్చారు. తెలంగాణ వ్యతిరేకిగా వైఎస్ ను నిత్యం విమర్శించే టీఆర్ఎస్ మాత్రం షర్మిల విమర్శలను కనీసం గట్టిగా ఖండించేందుకు కూడా ధైర్యం చేయడం లేదు. తాజాగా షర్మిల కేసీఆర్ దసరా రోజున ప్రకటించనున్న జాతీయ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రకటించనున్న కొత్త పార్టీ బీఆర్ఎస్ (భారతీయ రాష్ట్ర సమితి) కాదనీ అది బార్ అండ్ రెస్టారెంట్ సమితీ అంటూ అభివర్ణించారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టింపు లేని కేసీఆర్ తగుదునమ్మా అంటూ జాతీయ పార్టీ పెట్టడమేమిటని విమర్శించారు. బంగారు తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని విమర్శలు గుప్పించారు.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో సోమవారం( అక్టోబర్ 2) నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆమె కేసీఆర్ కొత్త పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ తనను తాను మహాత్మాగాంధీతో పోల్చుకోవడం విడ్డూరంగా ఉందని, కేసీఆర్‌లా గాంధీజీ దొంగ దీక్షలు చేయలేదన్నారు. కోట్లాది మంది ఉద్యమం, వందల మంది ఆత్మబలిదానాలు, త్యాగాల ఫలితమే తెలంగాణ ఆవిర్బావమని షర్మిల చెప్పారు.
కానీ కేసీఆర్ మాత్రం తానే తెలంగాణ తీసుకువచ్చానని చెప్పుకుంటున్నారనీ, రాష్ట్రాన్ని కుటుంబం జాగీరుగా మార్చుసుకున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబం ఎప్పుడైన లాఠీ దెబ్బలు తిన్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇంట్లో ఎంత మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని నిలదీశారు.
http://www.teluguone.com/news/content/sharmila-satires-on-kcr-national-party-says-it-is-bar-and-restaurent-samithi-39-144874.html












