ఒకే ఒక్కడు..!
Publish Date:Oct 4, 2022
Advertisement
ఆవిర్భావ క్షణం నుంచి ఆఖరి క్షణం వరకు.. ఒకే ఒక్కడు పార్టీ అధ్యక్షునిగా కొనసాగిన చరిత్ర ఉన్న పార్టీలు ఎన్నో ఉండవేమో. అరుదుగా అలాంటి పార్టీలు కొన్నిఉన్నా, అవి అనామక పార్టీలే, అయ్యుంటాయి కానీ చరిత్ర సృష్టించిన పార్టీలు అయితే కాకపోవచ్చును. కానీ, మరి కొద్ది గంటల్లో కాలగర్భంలో కలిసిపోతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆవిర్భావ క్షణం నుంచి చివరి వరకు కల్వకుట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) ఒక్కరే, పార్టీ అధ్యక్షునిగా కొనసాగారు. అందుకే, ఏక వ్యక్తి సారధ్యంలో పుట్టి,. పెరిగి. కాలగర్భంలో కలిసి పోయిన పార్టీ తెరాస తప్ప మరొకటి ఉండదేమో. అంటున్నారు. కానీ, అది పూర్తి సత్యం కాదు. నిజమే, ఎక్కడి దాకానో వెళ్ళ కుండానే, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ, ఆయన చేతుల మీదుగానే వెళ్ళిపోయింది. అలాగే, మఖలో పుట్టి పుబ్బలో మాయమై పోయిన దేవేందర్ గౌడ్ స్థాపించిన నవ తెలంగాణ పార్టీ వంటి మరి కొన్ని పార్టీలు కూడా ఉంటే ఉండవచ్చును. కానీ, తెరాసకు అలా మఖలో పుట్టి పుబ్బలో మాయమై పోయిన పార్టీలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా వుంది. అందుకే తెరాసను ఆ పార్టీల గాటన కట్టడం సమంజసం కాదు, కుదరని వ్యవహారం అని పరిశీలకులు పేర్కొంటున్నారు. అలాగే రాజకీయంగా చూసినప్పుడు కేసీఆర్, చిరంజీవి మధ్య తూకం కుదరదని అంటున్నారు. చిరంజీవి పార్టీ ఒక ఫ్లాఫ్ చిత్రం. కానీ, తెరాస తెలంగాణ సాధించిన పార్టీగానే కాకుండా, వరసగా రెండు సార్లు ప్రజలు ఆదరణతో అధికారం చేపట్టిన పార్టీ. తెరాస ఆవిర్భావానికి చారిత్రక నేపధ్యం ఉంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల వేదికగా, ఉద్యమ పార్టీగా పుట్టిన తెరాస సుమారు పుష్కర కాలం పైగా ఉద్యమ బాటలోనే నడిచింది. ఆరు పదుల తెలంగాణ కలను సాకారం చేసింది. సుమారు 1200 మందికి పైగా యువకుల ప్రాణత్యాగం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సరే అలాంటి పార్టీ ఇలా అర్ధాంతరంగా కనుమరుగై పోవడం ఒక విధంగా అనూహ్య పరిణామం. నిజానికి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకనో ఏమో కానీ, తెలంగాణ ఉద్యమ చరిత్రను చెరిపేసే ప్రయత్నమే చేస్తూ వచ్చారు. తెలంగాణ అసెంబ్లీ తొలి ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే, కేసేఆర్, ఇక తెరాస ఉద్యమ పార్టీ కాదు. ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీ అని ప్రకటించారు. ఉద్యమ పార్టీని ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీగా ప్రకటించిన కేసేఆర్ రాష్ట్ర రాజకీయ గతినీ మార్చి వేశారు. ఉద్యమ వాసనలు లేకుండా ఉద్యమ ఆనవాళ్ళు కనిపించకుండా, ఉద్యమ గీతం వినిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్ళు నిండినా అమరవీరుల స్థూపం ఇంకా పూర్తికాలేదు. సగం మంది అమరవీరుల చిరునామాలే చిక్కలేదు. అమరవీరుల కుటుంబాలకు ఇవ్వవలసిన గౌరవం, పరిహారం ఇంతవరకు అందనే లేదు. ఇక ఇప్పుడు ఏకంగా తెరాసకు వీడ్కోలు పలికేందుకు ముహూర్తం ఖరారు చేశారు. అదలా ఉంటే తెలంగాణ ఉద్యమ చరిత్రతో ముడి పడిన తెరాస చరిత్ర పుటల్లో చేరిపోవడం అందరినీ కాకున్నా కొందరిని బాధిస్తోందని అంటున్నారు. అయితే ఇంకొందరు మాత్రం, చీమలు పెట్టిన పుట్టలో విషనాగులు చేరినట్లు తెరాసలో ఉద్యమ ద్రోహులు చేరిన నేపధ్యంలో, తెరాస కనుమరుగు కావడమే మేలని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/only-one-leader-form-trs-start-to-end-39-144871.html





