రేవంత్ సంస్కారం.. జగన్ అహంకారం!
Publish Date:Feb 5, 2024

Advertisement
రేవంత్ సంస్కారం.. జగన్ అహంకారం.. ఇదే కొటేషన్ తో సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది. ఏపీలో సీఎం జగన్ అరాచక పాలన సాగిస్తుంటే.. తెలంగాణలో సీఎం రేవంత్ తనదైన శైలిలో అద్భుత పాలన సాగిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ కామెంట్లకు కొందరు వైసీపీ శ్రేణులు సైతం మద్దతు పలుకుతుంటడం గమనార్హం. ఇంతకీ.. రేవంత్, జగన్ గురించి సోషల్ మీడియాలో ఇంతలా ఎందుకు చర్చ జరుగుతోంది? రేవంత్ రెడ్డి చేసిన పనేంటి.. జగన్ చేయని పనేంటి? అంటే..
దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రజలకు, సినిమా వాళ్లకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఉంది కూడా. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా హీరోలంటే ప్రజలు ఎంతో గౌరవిస్తారు. హీరోలకు అభిమాన సంఘాలతోపాటు.. వారి పేరుతో సేవా కార్యక్రమాలు సైతం చేస్తుంటారు. రాజకీయ పార్టీల గెలుపోటముల్లో సినీ హీరోల ప్రభావం కూడా ఉంటుంది. ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి. అందుకే చంద్రబాబు నుంచి వైఎస్ఆర్, కేసీఆర్, ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరకు సినిమా వాళ్లను ఎంతో గౌరవంగా చూసుకుంటూ వచ్చారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. చిరుతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కూడా పద్మ విభూషణ్ అవార్డు వరించింది. మరి కొందరు తెలుగు వారికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డులు దక్కిన వారికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తాజాగా చిరు, వెంకయ్య నాయుడుతో పాటు పద్మ శ్రీ అవార్డుల గ్రహీతలను రేవంత్ సర్కార్ సన్మానించింది. అంతేకాక, పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ. 25లక్షలు, నెలనెలా రూ. 25వేల పెన్షన్ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజల నుంచి రేవంత్ సర్కార్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి, వెంకయ్య నాయుడు సైతం రేవంత్ సర్కార్ స్పందించిన తీరుపట్ల ప్రశంసల వర్షం కురిపించారు. రేవంత్ పాలన తీరును పొగిడారు. మరో వైపు రాజకీయాలకు అతీతంగా అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించడం పట్ల సోషల్ మీడియాలో రేవంత్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. రేవంత్ సంస్కారానికి ఇది నిదర్శనం అంటూ సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో ఏపీలోని జగన్ సర్కార్ పై సోషల్ మీడియాలో రేవంత్ సంస్కారం.. జగన్ అహంకారం అంటూ కామెంట్లు హోరెత్తుతున్నాయి. అయితే, ఇక్కడ విశేషం ఏమిటంటే.. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు కొందరు వైసీపీ శ్రేణులుకూడా మద్దతు తెలుపుతుంన్నారు. ఇంతకీ.. జగన్ సర్కార్ పై ఎందుకు అంత వ్యరేఖత వ్యక్తమవుతుందంటే.. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పాలన సాగించిన అన్ని ప్రభుత్వాలు సినిమా వాళ్లపైన, వెంకయ్య నాయుడు లాంటి పెద్దవారిపై ఎంతో మర్యాదగా నడుచుకుంటూ వచ్చాయి. కానీ, ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సినిమా వాళ్లపై చిన్నచూపుతో వ్యవహరిస్తోందన్న వాదన ఉంది. మరోవైపు వెంకయ్య నాయుడు లాంటి వారిపై వైసీపీ నేతలు బాహాటంగానే విమర్శలుచేసి ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నారు.
ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సినిమా వాళ్లంటే చాలా చిన్నచూపు అనే వాదన రాజకీయ వర్గాల్లో, సినీ వర్గాల్లో ఉంది. గతంలో టికెట్ల రేట్ల నుంచి మొదలు పెడితే ప్రతి విషయంలో సినిమా వాళ్లను ఓ ఆట ఆడుకున్నారు. ఎంతటి పేరున్న సినిమా హీరోలైనా ప్రభుత్వానికి ఏమైనా సూచన చేద్దామని చూసినా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయించి బెంబేలెత్తించేశారు. అంతటితో ఆగలేదు.. సినీ పెద్దలని కాళ్ల బేరానికి రప్పించుకున్నారు జగన్. మెగాస్టార్ చిరంజీవిలాంటి వారుసైతం జగన్ ముందు చేతులు జోడించి విజ్ఞప్తి చేసుకోవాల్సి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవితో చేతులు జోడించి మొక్కించుకొని వీడియో రిలీజ్ చేసి ఆనందం పొందారు. ఈ ఘటనతో జగన్ తీరుపై అప్పట్లో వైసీపీ శ్రేణుల్లోనూ వ్యతిరేకత వ్యక్తమయింది. కానీ, ఎవరూ బహిరంగంగా ఇది తప్పు అని చెప్పే సాహసం చేయలేదు. చిరంజీవిలాంటి వ్యక్తి రాజకీయాల్లో విఫలం అయి ఉండొచ్చు. కానీ, ఆయన రాజకీయాల్లోకి రాకముందు.. రాజకీయాలకు దూరంగా ఉంటున్నా.. ఆయనకున్న అభిమానం చెక్కుచెదర్లేదు.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చిన్నచూపు చూసే సినిమా రంగానికి చెందిన మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషన్ పురస్కారంతో గౌరవించింది. అవార్డులు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ, సీఎం రేవంత్ రెడ్డి తెలుగు వారికి పద్మ విభూషణ్, పద్మ శ్రీ అవార్డుల రావడం పట్ల అభినందనలు తెలిపారు. అంతేకాక శిల్పకళా వేదికగా చిరు, వెంకయ్యనాయుడు, పద్మ శ్రీ అవార్డు గ్రహీతలను ఘనంగా సన్మానించారు. మరోవైపు ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ జగన్ మాత్రం అవార్డు గ్రహీతలకు కనీసం కలిసి అభినందనలు కూడా తెలపలేదు. దీనిని ఎత్తి చూపుతూనే సినీ, రాజకీయవర్గాల్లో జగన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో రేవంత్ సంస్కారం.. జగన్ అహంకారం అంటూ విస్తృతంగా ట్రోల్ అవుతోంది.
http://www.teluguone.com/news/content/revanth-culture-and-jagan-pride-36-169911.html












