పరిశ్రమల్లో రోబోల రాజ్యం.. ఉద్యోగులే లేని కొత్త లోకం!
Publish Date:Apr 24, 2026
Advertisement
ఆధునిక యుగంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. సాఫ్ట్‌వేర్ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టించిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతుండగానే.. ఇప్పుడు పారిశ్రామిక రంగంలో డార్క్ ఫ్యాక్టరీలు అంటే చీకటి కర్మాగారాల జోరు పెరుగుతోంది. మనుషుల ప్రమేయం లేకుండా, లైట్లు కూడా అవసరం లేని రీతిలో కేవలం రోబోలతోనే నడిచే కర్మాగారాలు ప్రపంచ ఉత్పత్తి రంగాన్ని శాసిస్తున్నాయి. 24 గంటల పాటు నిరంతరాయంగా.. ఎలాంటి అలసట లేకుండా ఉత్పత్తిని కొనసాగించే ఈ సాంకేతికత ఉత్పాదక రంగంలో అనూహ్య వేగాన్ని తీసుకువస్తోంది. అదే సమయంలో ఇటు ఉపాధి కోల్పోయే ఆందోళనల అంతకు రెండింతలుగా మోసుకొస్తోంది. సాధారణంగా ఫ్యాక్టరీ అంటే కార్మికులు, మిషన్ల చప్పుతో హోరెత్తుతుంటుంది. అయితే డార్క్ ఫ్యాక్టరీ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ డార్క్ ఫ్యాక్టరీలకు వెలుతురుతో పనిలేదు. అందుకే వీటిని చీకటి కర్మాగారాలు అంటారు. ఏఐ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కలగలిపిన రీతిలో ఈ డార్క్ ఫ్యాక్టరీలు పని చేస్తాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చైనా ఈ రంగంలో అగ్రస్థానంలో ఉంది. అక్కడ దాదాపు 15 లక్షల పారిశ్రామిక రోబోలు సేవలందిస్తున్నాయి. ప్రతి పదివేల మంది కార్మికులకు ఉన్న రోబోల నిష్పత్తిని చూస్తే దక్షిణ కొరియా 1,102 రోబోలతో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. సింగపూర్, జర్మనీ, జపాన్ వంటి దేశాలు కూడా ఈ రేసులో ముందుకు దూసుకువస్తున్నాయి. ఇండియాలోనూ రోబోల వినియోగం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. తమిళనాడులోని కాంచీపురంలో దేశంలోనే మొట్టమొదటి డార్క్ ఫ్యాక్టరీని పాలిమాటెక్'అనే సంస్థ ప్రారంభించింది. ఈ సంస్థ సెమీకండక్టర్ల తయారీపై దృష్టి పెట్టింది. ఇక్కడ ఉత్పత్తి ప్రక్రియ అంతా రోబోలే నిర్వహిస్తున్నాయి. మనుషులు కేవలం పర్యవేక్షణ, పరిశోధన, మార్కెటింగ్ బాధ్యతలను మాత్రమే చూస్తున్నారు. అంతకుముందు 2015లోనే రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ పాక్షికంగా ఇటువంటి వ్యవస్థను ప్రవేశపెట్టింది. కోయంబత్తూరుకు చెందిన ఎక్స్‌లాజిక్ ల్యాబ్స్ వంటి స్టార్టప్‌లు కూడా పూర్తిస్థాయి డార్క్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు కృషి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దిగ్గజ సంస్థలు ఇప్పటికే ఈ విధానంలో అద్భుతాలు చేస్తున్నాయి. జపాన్‌కు చెందిన ఫానుక్ సంస్థలో రోబోలే మరో రోబోను తయారు చేయడం విశేషం. చైనాకు చెందిన షావొమీ సంస్థ తన డార్క్ ఫ్యాక్టరీలో సెకనుకు ఒక మొబైల్ ఫోన్ చొప్పున ఏడాదికి కోటి ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. అమెరికాలోని టెస్లా కంపెనీ 90 శాతం ఆటోమేషన్‌తో నడుస్తోంది. రక్షణ రంగంలో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. యుద్ధ డ్రోన్లు, క్షిపణుల తయారీ కోసం చైనా, రష్యా, అమెరికాలు మనుషులు లేని ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నాయి. ఈ సాంకేతిక ప్రగతితో నిరుద్యోగ ముప్పు పొంచి ఉంద ఆందోళన వ్యక్తమౌతోంది. ఒక్క చైనాలోనే గత పదేళ్లలో ఆటోమేషన్ కారణంగా సుమారు మూడు కోట్ల మంది ఉపాధి కోల్పోయారన్నది అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ఫాక్స్‌కాన్ వంటి సంస్థలు భారీ సంఖ్యలో కార్మికులను తొలగించి రోబోలను నియమించుకుంటున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి చైనా కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. కార్మికులకు ఆధునిక టెక్నాలజీపై శిక్షణ ఇవ్వడం, విద్యాసంస్థల సిలబస్‌ను మార్చడం వంటి చర్యలు తీసుకుంటోంది. రోబోలతో కలిసి పనిచేసేలా మానవ వనరులను తీర్చిదిద్దుతోంది. ఇక ఇండియా కూడా మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను చేరుకోవాలంటే ఈ డార్క్ ఫ్యాక్టరీల యుగానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాలంటే అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోకతప్పదంటున్నారు. అదే సమయంలో కార్మికుల నైపుణ్యాలను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. భవిష్యత్తులో కేవలం శ్రమతో కూడిన పనులు కాకుండా, సాంకేతికతను నియంత్రించే నైపుణ్యం ఉన్నవారికే అవకాశాలు దక్కుతాయన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది. రానున్న రోజుల్లో ఈ డార్క్ ఫ్యాక్టరీలు భారీ పరిశ్రమలకే పరిమితం కాకుండా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కూడా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/reign-of-robots-in-industries-36-218124.html





