హెచ్1బి వీసాలపై మూడేళ్లు నిషేధం.. అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్ల బిల్లు
Publish Date:Apr 24, 2026
Advertisement
అమెరికాలో ఉద్యోగం చేయాలనే కలలు కనే భారతీయ ఐటీ నిపుణులకు భారీ షాక్. తగిలింది. అమెరికా ప్రతినిధుల సభలో "ఎండ్ హెచ్-1బీ వీసా అబ్యూస్ యాక్ట్ ఆఫ్ 2026" పేరుతో రిపబ్లికన్ పార్టీ సభ్యుడు ఎలీ క్రేన్ ప్రవేశపెట్టిన బిల్లు.. ప్రస్తుత వీసా విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ప్రతిపాదించింది. ముఖ్యంగా కొత్త వీసాల జారీపై మూడేళ్ల పాటు పూర్తిస్థాయిలో నిషేధం విధించాలన్న ప్రతిపాదన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ బిల్లులోని నిబంధనలు అత్యంత కఠినంగా ఉన్నాయి. ప్రస్తుతం ఏటా అందుబాటులో ఉన్న 65,000 హెచ్-1బీ వీసాల సంఖ్యను 25,000కు కుదించాలని బిల్లే పేర్కొంది. అంతేకాకుండా.. ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ పద్ధతిని రద్దు చేసి, కేవలం అత్యధిక వేతనం పొందే నిపుణులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. హెచ్-1బీ వీసా పొందాలంటే కనీస వార్షిక వేతనం 2 లక్షల డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 1.66 కోట్ల రూపాయలు ఉండాలన్న నిబంధన విదేశీయులకు పెద్ద అడ్డంకిగా మారనుంది. ఉద్యోగులకే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ బిల్లు చేదువార్త మోసుకొచ్చింది. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, పిల్లలకు ఇచ్చే డిపెండెంట్ వీసాలను పూర్తిగా నిషేధించాలని, అలాగే వీసాదారులు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోకుండా అడ్డుకోవాలని కూడా బిల్లులో ఎలీక్రేన్ ప్రతిపాదించారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే విద్యార్థులకు ఉపయోగపడే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ ) ప్రోగ్రామ్‌ను కూడా రద్దు చేయాలని ఆయనా బిల్లులో ప్రతిపాదించారు. అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను విదేశీయులు తక్కువ వేతనాలకే తన్నుకుపోతున్నారన్న ఉద్దేశంతోనే ఈ మార్పులు కోరుతున్నట్లు ఎలీ క్రేన్ స్పష్టం చేశారు. భారీ కార్పొరేట్ సంస్థల లాభాల కంటే స్వదేశీ పౌరుల ప్రయోజనాలే ముఖ్యమని రిపబ్లికన్ సభ్యులు వాదిస్తున్నారు. విదేశీయుల స్థానంలో అమెరికన్లకే తొలి ప్రాధాన్యత దక్కాలన్నది వారి ప్రధాన డిమాండ్.
http://www.teluguone.com/news/content/three-year-ban-on-h1b-visas-36-218113.html





