జగన్ బెయిల్ రద్దుపై హైకోర్టుకు రఘురామ.. సాక్షికి ఊహించని షాక్..
Publish Date:Sep 14, 2021
Advertisement
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో కేసు వేసి ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించారు. ఏ1, ఏ2ల ఇద్దరి బెయిలూ రద్దు అయ్యేలా.. అటు ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ సైతం రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. సెప్టెంబర్ 15న ఆ రెండు కేసులపై కలిపి.. ఒకేసారి తీర్పు ఇవ్వనుంది నాంపల్లిలోని సీబీఐ కోర్టు. ఓవైపు సీబీఐ కోర్టు తీర్పుపై ఉత్కంఠ పెరుగుతుండగా.. ఎంపీ రఘురామ మరో ట్విస్ట్ ఇచ్చారు. సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌నూ మరో కోర్టుకు బదిలీ చేయాలన్నారు. సీబీఐ కోర్టు బుధవారం ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. పిటిషన్‌పై అత్యవసరం విచారణ జరపాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అందుకు అంగీకరించిన హైకోర్టు రఘురామ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం ఆసక్తికరం. సాక్షి మీడియాలో వచ్చిన కథనంతో సీబీఐ కోర్టు తీర్పు ప్రభావితం అయ్యే అవకాశముందని ఆరోపించారు ఎంపీ రఘురామ. సీబీఐ కోర్టులో గత విచారణ సందర్భంగా.. తీర్పు కంటే ముందే.. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ను కోర్టు కొట్టేసిందంటూ సాక్షి మీడియా ట్విట్టర్‌లో న్యూస్ వచ్చింది. ఓవైపు విచారణ జరుగుతుండగానే.. సాక్షి మీడియాలో తన పిటిషన్‌ను కొట్టేశారంటూ వార్తలు రావడాన్ని రఘురామ తప్పుబట్టారు. సాక్షి కథనంపై కోర్టును ఆశ్రయించారు. అయితే, అది కావాలని రాసిన న్యూస్ కాదని.. ఉద్యోగి చేసిన తప్పిదమంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది సాక్షి మీడియా. ఆ మేరకు కోర్టుకు కౌంటర్ దాఖలు చేసింది. దీంతో.. పిటిషనర్ రఘురామ వ్యూహం మార్చారు. సాక్షి మీడియా కథనం ఆధారంగా సెప్టెంబర్ 15న రాబోవు సీబీఐ కోర్టు తీర్పు ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నందున.. వెంటనే సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. రఘురామ పిటిషన్‌తో సాక్షి మీడియా కథనంపై మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/raghurama-files-petition-in-ts-high-court-on-jagan-bail-cancel-39-122942.html





