కాంగ్రెస్ ని... గాంధీల సొత్తు కాకుండా పీవీ అడ్డుకున్నారా?
Publish Date:Sep 28, 2016
Advertisement
పీవీ నరసింహా రావు... ఈ పేరు పేలుడు పదార్థం లాంటిది! ఎవరు పీవీ గురించి మాట్లాడినా అది ఆటోమేటిక్ గా బ్లాస్టింగ్ న్యూస్ అయిపోతుంది! అలాంటి వివాదాస్పద, విలక్షణ వ్యక్తిత్వం మన మాజీ ప్రధానిది!
పీవీ ప్రధాన మీడియా సలహాదారు సంజయ్ బారు. వృత్తి రిత్యా జర్నలిస్ట్ అయిన ఆయన తాజాగా ఓ పుస్తకం రాశారు. దేశ ప్రధాని అయిన మన తెలుగు వాడు పీవీ గురించి చాలా విషయాలు అందులో చర్చించారు. అసలు పుస్తకం పేరే ఎంతో ఆసక్తికరంగా... 1991 : హౌ పీవీ నరసింహారావ్ మేడ్ హిస్టరీ... అని నామకరణం చేశారు. ఇందులో పీవీని అత్యంత దగ్గరగా చూసిన వాడిగా అనేక కోణాలు చర్చించారు బారూ...
సంజయ్ బారూ 2014లో కూడా ఇలాగే ఒక పుస్తకం రాశారు. దాంట్లో మన్మోహన్ తాలూకూ ప్రధాని కార్యాలయాన్ని సోనియా రిమోట్ కంట్రోల్ చేసేదని పేర్కొన్నారు. అప్పట్లో అది పెద్ద చర్చకు దారి తీసింది. విచిత్రం ఏంటంటే, సంజయ్ బారూ చెప్పిన విషయాల్ని మన్మోహన్ పెద్దగా ఖండించకపోవటం!
తన గత పుస్తకంతో సోనియాను టార్గెట్ చేసిన సంజయ్ బారూ మరోసారి అదే పని చేశారంటున్నారు విశ్లేషకులు. ఆయన పుస్తకంలో పీవీ కంటే ముందు సోనియా శంకర్ దయాళ్ శర్మను ప్రధానిని చేయాలని అనుకున్నారని రాశారు. కాని, శంకర్ దయాళ్ ఆరోగ్య కారణాల రిత్యా ప్రధాని ఆఫర్ ను తిరస్కరించటంతో పీవీకి అవకాశం వచ్చింది!
సంజయ్ బారూ రాజీవ్ గాంధీపైన కూడా కొన్ని మాటలు రాశారు. ఆయన చంద్రశేఖర్ ప్రభుత్వంపై అనుమానంతోనే మద్దతు విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. అందుకే, చంద్రశేఖర్ కనీసం పూర్తిస్తాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోయారని తెలిపారు. దాని వల్లే భారత్ ఇంధనం కోసం బంగారు నిల్వలు తాకట్టు పెట్టాల్సి వచ్చిందని వివరించారు.
దేశం బంగారు నిల్వలు కూడా తాకట్టు పెట్టిన క్లిస్ట సందర్భంలో పీవీ ప్రధాని అయ్యి సమర్థంగా పాలించాడని సంజయ్ బారూ పుస్తకంలో రాశారు. ఆయన తన ఆర్దిక మంత్రిగా ఇప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కావాలనే ఎంచుకోలేదన్నారు. ఆర్దిక రంగ నిపుణుడే కావాలని పట్టుబట్టి అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఐజీ పటేల్ కోసం ప్రయత్నించారట. కాని, ఆయన తిరస్కరించటంతో మన్మోహన్ ను ఆర్దిక మంత్రిని చేశారట!
1991వ సంవత్సరంలో చోటు చేసుకున్న అనేక కీలకమైన అంశాలపై సంజయ్ బారూ తన పుస్తకంలో ఎన్నో ఆసక్తికర అంశాలు తెలిపారు. అయితే, అన్నిటికంటే ముఖ్యంగా, పీవీ తాత్కాలికంగా కాంగ్రెస్ ను ఒక కుటుంబం స్వంత ఆస్తిగా మారిపోకుండా కాపాడారని ఆయన వ్యాఖ్యానించారు. కాని, తరువాత పీవీ తప్పుకోగానే కాంగ్రెస్ ... సోనియా కాంగ్రెస్ గా రూపాంతరం చెందిందని బారూ అన్నారు!
http://www.teluguone.com/news/content/pv-narasimha-rao-45-67088.html





