అడుదాం ఆంధ్రాపై విజిలెన్స్ నివేదిక.. రోజాకు చిక్కులు తప్పవా?
Publish Date:Apr 8, 2026
Advertisement
వైసీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా చిక్కుల్లో పడ్డారా? ఆమె మంత్రిగా ఉన్న సమయంలో అడుదాం ఆంధ్రా అంటూ నిర్వహించిన భారీ కార్యక్రమంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విజిలెన్స్ నివేదిక ఆమె ప్రమేయాన్ని నిర్ధారించిందా? అంటే విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు ఔను అన్న సమాధానమే వస్తున్నది. వైసీపీ హయాంలో అట్టహాసంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడా సంబరాల్లో భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిర్ధారించింది. ఈ మేరకు వేల పేజీలతో కూడిన సమగ్ర నివేదికను అధికారులు ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలుస్తోంది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా, అలాగే అప్పటి సాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిల ప్రమేయంపై కీలక ఆధారాలు లభ్యమైనట్లు విజిలెన్స్ తన నివేదికలో పేర్కొన్నట్లు చెబుతున్నారు. క్రీడా స్ఫూర్తిని పక్కన పెట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ కార్యకర్తలను విజేతలుగా ప్రకటించినట్లు విజిలెన్స్ గుర్తించింది. అర్హులైన క్రీడాకారులకు అన్యాయం చేస్తూ, క్రీడలను పార్టీ ప్రచార వేదికగా మార్చుకున్నారని కూడా విజిలెన్స నివేదిక పేర్కొంది. కాగా రాష్ట్రంలో వైసీపీ సర్కార్ దిగిపోయి, తెలుగుదేశం ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టే సమయంలో కొన్ని రికార్డులను, కంప్యూటర్ డేటాను ధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, సాంకేతిక సాయంతో అధికారులు వాస్తవాలు బయటకు తీశారని చెబుతున్నారు. ప్రస్తుతం విజిలెన్స్ నివేదిక ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ఉందంటున్నారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ కుంభకోణంపై లోతైన దర్యాప్తు కోసం ఏసీబీ లేదా సీఐడీ విచారణకు ఆదేశించే అవకాశం ఉందంటున్నారు. సాక్ష్యాధారాలు బలంగా ఉన్న నేపథ్యంలో, త్వరలోనే మాజీ మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలపై కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పదివేల పేజీలకు పైగా ఉన్న విజిలెన్స్ నివేదికపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందా అన్న ఉత్కంఠ వైసీపీయుల్లో కనిపిస్తోంది.
విజిలెన్స్ విచారణలో నాణ్యత లేని క్రీడా పరికరాలు సరఫరా చేసినట్లు తేలింది. బ్రాండెడ్ కంపెనీల ముసుగులో నాసిరకం బ్యాట్లు, బంతులు, టీ-షర్టులను పంపిణీ చేసినట్లు విజిలెన్స్ నివేదిక పేర్కొన్నట్లు తెలుస్తోంది. విజేతలకు అందాల్సిన ప్రైజ్ మనీని పక్కదారి పట్టించడం, నిబంధనలకు విరుద్ధంగా నిధులను మళ్లించడం వంటి చర్యల ద్వారా ప్రజా ధనాన్ని కొల్లగొట్టారని కూడా విజిలెన్స్ నివేదిక పేర్కొన్నట్లు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/roja-face-trouble-45-216935.html




