పే..ద్ద బోర్డు పెట్టేయండి.. 'పూరీ' జబర్దస్త్ ఐడియా..
Publish Date:Jan 20, 2022
Advertisement
మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు? పెద్దగా వర్కవుట్ అవట్లేదా? బిజినెస్ డల్‌గా సాగుతోందా? అనుకున్నంత వ్యాపారం జరగట్లేదా? అయితే, ఓ పని చేయండి.. పే...ద్ద బోర్డు పెట్టేయండి.. పేరు ఏదైనా పర్వాలేదు.. బోర్డు మాత్రం భారీగా ఉండాలి.. ఈ ఒక్క మార్పు చేసి చూడండి.. మీ దశ మారిపోతుంది అంటున్నారు ఫేమస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పూరీ జగన్నాథ్ ఓ ఉచిత సలహా ఇచ్చారు. వ్యాపారం అభివృద్ధి చెందాలంటే కేవలం సంస్థకు పెట్టే పేరు, మార్కెటింగ్ మాత్రమే కాకుండా.. ఆ టౌన్‌షిప్ బోర్డు కూడా భారీగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఈ ఐడియా ఎలా వర్కవుట్ అవుతుందో వివరిస్తూ.. 'హాలీవుడ్' గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. "హాలీవుడ్.. ఈ పేరు తెలియనివాళ్లు ఉండరు. హాలీవుడ్ అనే పేరు ఎలా వచ్చిందంటే.. హార్వే హెండర్సన్ విల్కాక్స్ అనే వ్యక్తికి లాస్ ఏంజెల్స్‌లో ఓ పెద్ద రాంచ్ ఉండేది. ఆ స్థలంలో విట్లీ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారితో కలిసి ప్లాట్స్ వేయాలని అనుకున్నాడు. ఆ ప్రాజెక్ట్‌కి హార్వే వాళ్ల సతీమణి ‘హాలీవుడ్’ (ది ల్యాండ్ ఆఫ్ హోలీ బుష్) అనే పేరు పెట్టింది. లాస్ ఏంజెల్స్ అనేది ఎడారి ప్రాంతం. అలాంటి ఈ ప్రాంతంలో మొక్కలు, చెట్లు రాబోతున్నాయి అని దాని అర్థం. 1887లో హాలీవుడ్‌ని ప్రారంభించి.. అందర్నీ ఆకర్షించడం కోసం అక్కడ కొండ మీద 'హాలీవుడ్' అని భారీగా రాశారు. సుసంపన్న, ప్రసిద్ధ నివాస ప్రాంతం అని చెబుతూ విట్లీ మార్కెటింగ్ చేయడం ప్రారంభించాడు. 1910లో అక్కడి ప్రభుత్వం దాన్ని మున్సిపాలిటీగా మార్చింది. దాంతో అక్కడ ఎక్కువగా సినిమావాళ్లు స్థలాలు కొనుగోలు చేశారు. దానికి మరొక కారణం కూడా ఉంది. థామస్ అల్వా ఎడిసన్ 21 ఏళ్లకే దాదాపు 1000 పేటెంట్ రైట్స్ రిజిస్టర్ చేయించుకున్నాడు. టెలీగ్రాఫ్, టెలీఫోన్, మైక్రోఫోన్, మోషన్ పిక్చర్.. ఇలా చాలా పేటెంట్ రైట్స్ అతని దగ్గర ఉండేవి. ఎవరైనా మోషన్ పిక్చర్ తీయాలంటే అతడ్ని కలవాల్సి వచ్చేది. ఆ రోజుల్లో హాలీవుడ్ ఏరియాలో ఉండేవారికి అది వర్తించేది కాదు. దాంతో ‘‘ఇఫ్ యూ వాంట్ టు మేక్ మూవీస్, గో టు హాలీవుడ్. ఇట్ ఈజ్ ది బెస్ట్ ప్లేస్ టు మేక్ మూవీస్’’ అనే స్లోగన్ వచ్చింది. అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రకృతి అందాలు కూడా మూవీ మేకింగ్‌కు ఎంతో ఉపయోగపడేవి. మిస్టర్ ఖన్నా అనే వ్యక్తి హాలీవుడ్‌ను స్ఫూర్తిగా తీసుకుని బాలీవుడ్ పెట్టారు. వారిని చూసి మనం టాలీవుడ్, కోలీవుడ్ అని పెట్టుకున్నాం. కొరియన్ వాళ్లు హోయూవుడ్, పాకిస్థాన్ వాళ్లు లాలీవుడ్ అని పెట్టుకున్నారు. యూకే, కెనడా ఫిల్మ్ ఇండస్ట్రీలు హాలీవుడ్ కిందకు రాదు. హాలీవుడ్ అనేది ఒక రియల్ ఎస్టేట్ బోర్డు. అది అందరికీ కనిపించేలా పెద్ద పెద్ద అక్షరాలతో కొండపై పెట్టడం వల్ల దాని జాతకం మారిపోయింది. పాపులర్ అయిపోయింది. అందుకే రియల్ ఎస్టేట్ వాళ్లు గుర్తు పెట్టుకోవాల్సి విషయం ఏంటంటే.. టైటిల్, మార్కెటింగ్‌తో పాటు సైజ్ ఆఫ్ ది బోర్డ్ కూడా ఎంతో అవసరం. ఏ పేరు పెట్టినా పెద్ద బోర్డు మాత్రం పెట్టండి" అంటూ పూరీ మ్యూజింగ్స్‌లో సూచించారు.
http://www.teluguone.com/news/content/puri-jagannath-advise-to-real-estate-sector-39-130455.html





